Online Media
-
నెట్టింట్లోకి మారిన క్లాస్రూమ్ అడ్రస్
సాక్షి, హైదరాబాద్ : చదువు కొత్త పుంతలు తొక్కుతోంది. నిన్నటి వరకు స్కూలు నుంచి ఇంటికొచ్చాక ట్యూషన్లు, హోంవర్క్‌లతో చిన్నారులను తల్లిదండ్రులు బిజీగా ఉంచేవారు. కానీ ఇప్పుడు ఆ ‘బిజీ’నెస్ కాస్త రూటు మారింది. చదువులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించుకొని ‘ఆన్లైన్’గా మారిపోయాయి. ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్స్‌కు దీటుగా.. ప్రైవేట్ వెబ్సైట్లు ఆన్లైన్ సేవలకు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా.. మొబైల్ యాప్‌లను రూపొందించాయి. తమ యాప్ బాగుంటుందంటే తమ యాప్ ఎక్కువ ఉపయోగకరమంటూ పోటీ పడుతున్నాయి. ఇలా పదుల సంఖ్యలో అందుబాటులోకి వచ్చిన లెర్నింగ్ యాప్‌లలో దేన్ని కొనుగోలు చేయాలో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. పదులు, వందల రూపాయల లెవల్ దాటి.. ఒక్కో తరగతికి వేల రూపాయల డబ్బు వసూలు చేస్తున్నారు. అయినా.. పిల్లల చదువులకోసం ఏమైనా చేయాల్సిందేనంటూ తల్లిదండ్రులు ఆ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. సాధారణ స్కూళ్లలో ఫీజుల కంటే ఎక్కువైనా భరించేందుకు సిద్ధపడుతున్నారు. పాఠాలే కాదు.. డౌట్స్ కూడా తీరుస్తారు విద్యార్థులకు ఆన్లైన్ చదువులు లక్ష్యంగా ప్రతి సంస్థ వీడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. త్రీడీ, యానిమేషన్ మేళవించి రూపొందించిన పాఠాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించాయి. అంతేకాకుండా విద్యార్థుల పరిసరాల్లోని పరిస్థితులతో పాఠ్యాంశాలను అన్వ యించి అందించే బోధనతో కూడిన వీడియో పాఠాలను అందు బాటులోకి తెచ్చాయి. విద్యార్థులకు అర్థం కాకపోతే.. ఆన్లైన్లో నివృత్తి చేసేందుకు 24 గంటలు పనిచేసే కాలింగ్ సదుపాయం కల్పించాయి. కొన్ని సంస్థలైతే ఏకంగా ఆన్లైన్లోనే సందేహాలను నివృత్తి చేసే చర్యలు చేపట్టాయి. విద్యార్థి తనకు అర్థంకాని ప్రాబ్లంను ఆన్లైన్లో పంపిస్తే దానికి ఆన్లైన్లోనే సమాధానం ఇచ్చేలా చర్యలు చేపట్టాయి. ప్రతి విద్యార్థి తరగతి వారీగా చూసే వీడియో పాఠశాలపై ప్రశ్నలు ఇచ్చి వారు ఏ స్థాయిలో ఉన్నారో అంచనా వేసేందుకు ‘ఇండివిజువల్ అనలిటికల్ రిపోర్టు’అందిస్తూ దానికి అనుగుణంగా ముందుకు సాగేలా చర్యలు చేపట్టాయి. పోటీ పరీక్షలకు సంబంధించి పాత ప్రశ్నాపత్రాలను అందుబాటులో ఉంచుతూ.. ప్రిపేర్ అయ్యేలా చర్యలు చేపట్టడంతోపాటు కెరీర్ కౌన్సెలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశాయి. ఇంకొన్ని ఈ–లెర్నింగ్ సంస్థలైతే.. గ్రూప్‌లను క్రియేట్ చేసి ఇతరులతో గ్రూప్ డిస్కషన్లో పాల్గొనేలా చర్యలు చేపట్టాయి. స్కూల్ ఫీజుల కంటే అత్యధికంగా వసూళ్లు సాధారణ స్కూల్ ఫీజుల కంటే ఒక్కో తరగతికి అందించే ఆన్లైన్ లెర్నింగ్ సబ్‌స్క్రిప్షన్‌కు ఈ సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. తరగతిని బట్టి ఫీజులను నిర్ణయిస్తున్నాయి. కనీసంగా ఒక్కో తరగతికి ఒక్కో విధంగా రూ.15 వేల నుంచి రూ.35 వేల వసూలు చేస్తున్నాయి. అందులోనూ ఐఐటీ, నీట్ బేస్డ్గా అందించే చదువులకు రేటు ఎక్కువ. మరోవైపు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, లేదా 12వ తరగతి వరకు ప్యాకేజీల రూపంలో స్పెషల్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాయి. ఇలా అన్ని తరగతులకు తీసుకుంటే రూ.95వేల నుంచి దాదాపు రూ.1.20లక్షల వరకు తల్లిదండ్రులు చెల్లించాల్సి వస్తోంది. కొన్సి సంస్థలు తమ ఆన్లైన్ కోర్సులను తీసుకునే వారికి ట్యాబ్‌లు, వీడియో పాఠాలతో కూడిన ఎస్డీ కార్డులను అందిస్తున్నాయి. ‘సాక్షి’మీడియా ఆధ్వర్యంలో కూడా.. వీటితో పాటు పత్రికారంగంలోని ఆన్లైన్ యాప్‌లు కూడా విస్తృతాదరణ పొందుతున్నాయి. ఇందులో ‘సాక్షి’మీడియా గ్రూప్..www.sakshieducation.com వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ కంటెంట్‌ను, వీడియో పాఠాలను విద్యార్థులకు అందిస్తోంది. ఇక్కడే ప్రాక్టీస్ టెస్ట్‌లను కూడా నిర్వహిస్తోంది. నిపుణుల సలహాలు, సూచనలు, పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విధానాలు, టిప్స్‌ను ఉచితంగా అందిస్తోంది. బాధ్యతగా ఉండే వారికి మంచి ప్లాట్ఫారం ఆన్లైన్ లెర్నింగ్ యాప్‌లు సెల్ఫ్ రెస్పాన్స్‌బుల్‌గా ఉండే వారికి ఎక్కువ ఉపయోగం. ప్రస్తుతం ఆన్లైన్ లెర్నింగ్ యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకునే వారిలో 20% మాత్రమే సరిగ్గా వినియోగిస్తున్నారు. మిగతావారు డబ్బులు చెల్లించి వదిలేస్తున్నారు. ఆన్లైన్ లెర్నింగ్ కంటే క్లాస్రూమ్ లెర్నింగే ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఇంటరాక్షన్ ఇక్కడే ఉంటుంది. తరగతిలోని విద్యార్థుల స్థాయిని టీచర్లు అర్థం చేసుకుని వారికి సరిపోయే విధంగా మార్పులు చేస్తారు. గ్రూప్ డిస్కషన్‌కు ఇక్కడే ఎక్కువ అవకాశం ఉంది. - వెంకట్ కంచనపల్లి, సీఈవో సన్‌టెక్ -
ఆన్లైన్ మీడియాపై ఆంక్షలు సడలించిన చైనా
బీజింగ్: ఆన్లైన్ మీడియా వెబ్సైట్లపై ఉన్న తీవ్రమైన ఆంక్షలను చైనా కొంతవరకు సడలించింది. ఇప్పటివరకు చైనా ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్లకు స్వతహాగా రిపోర్టింగ్, ఇంటర్వ్యూలను నిర్వహించుకునే అధికారం లేదు. తాజాగా ఈ నిబంధనలలో మార్పులు తీసుకొచ్చారు. సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా( సీఏసీ), స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ సంస్థలు 14 మేజర్ న్యూస్ వెబ్సైట్లలో పనిచేసే 594 మంది రిపోర్టర్లకు శుక్రవారం అనుమతి కార్డులను జారీ చేశాయి. కానీ కొన్ని పరిమితమైన వెబ్సైట్లకు మాత్రమే ఈ అధికారాన్ని కల్పించి ప్రభుత్వం తన గుత్తాధిపత్యాన్ని నిలుపుకుంది. ఇక నుండి ఆన్లైన్ మీడియా రిపోర్టర్లు స్వతంత్రంగా తమ రిపోర్టింగ్ వ్యవహారాలను నిర్వహించుకోవచ్చని సీఏసీ స్పోక్స్ పర్సన్ జియాంగ్ జున్ తెలిపారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఆన్లైన్ మీడియాపై నియంత్రణ తొలగించాలనే డిమాండ్ తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా నిర్ణయంతో గతంలో ఉన్నటువంటి సాంప్రదాయక మీడియా నుండి తీసుకున్న సమాచారాన్నే తర్జుమా చేసే విధానం మారబోతుంది. స్వతహాగా రిపోర్టింగ్ నిర్వహించుకునే వెసులుబాటు కలుగడంతో ఆన్లైన్ న్యూస్ మీడియాకు కొంత స్వేచ్ఛ లభించినట్లయింది. -
రెండేళ్లలో ఆన్‌లైన్‌లోకి 2 కోట్ల చిన్న సంస్థలు
గూగుల్ ఇండియా లక్ష్యం న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో భారత్‌లో 2 కోట్ల పైగా చిన్న, మధ్య త రహా (ఎస్ఎంబీ) సంస్థలను ఆన్లైన్ మాధ్యమంలోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. ఇందుకోసం గూగుల్ మై బిజినెస్ (జీఎంబీ) మొబైల్ యాప్‌ను అందిస్తున్నట్లు ఆయన వివరించారు. దీన్ని ఉపయోగించుకుని ఎస్ఎంబీలు .. ఇంగ్లీషు, హిందీ భాషల్లో తమ వ్యాపారాల వివరాలను ఆన్లైన్లో ఉచితంగా పొందుపర్చవచ్చని చెప్పారు. -
ధీమాగా ఆన్లైన్ బీమా...
ఆన్లైన్ మాధ్యమంపై అవగాహన పెరుగుతుండటంతో ఈ తరహా జీవిత బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. సులభంగా, వేగవంతంగా, పారదర్శకంగా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ఆఫ్‌లైన్ మాధ్యమంతో పోలిస్తే చౌకగా లభించే ఆన్లైన్ పాలసీలవైపు మొగ్గు చూపే వారు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ లో బీమా పాలసీలు కొనుగోలు చేసేటప్పుడు .. విధిగా తెలుసుకోవాల్సిన నాలుగు ప్రధాన అంశాల గురించి వివరించేది ఈ కథనం. జీవిత బీమా పాలసీ తీసుకోవడంలో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. మన ఆర్థిక లక్ష్యాలు, వాటిని సాధించడం గురించి ఇన్వెస్ట్మెంట్ ఏజెంటుతోనో లేదా ఫైనాన్షియల్ ప్లానర్తోనో సుదీర్ఘంగా చర్చించాల్సి ఉంటుంది. వివిధ పాలసీలను పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది. బోలెడంత సమాచారంతో కూడిన బ్రోచర్లను క్షుణ్నంగా చదవాల్సి ఉంటుంది. చిట్టచివరికి మన అవసరాలకు తగిన పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. అనేక సంవత్సరాలుగా బీమా పాలసీల విక్రయం ఇలాగే ఉంటోంది. ఇంత సుదీర్ఘమైన ప్రక్రియను ఆన్లైన్లో సింపుల్‌గా తేల్చేయడమన్నది సాధారణంగా ఊహకందని విషయం. విమానం టికెట్లో, సినిమా టికెట్లో తీసుకున్నట్లు ఆన్లైన్లో బీమా పాలసీలను కూడా తీసేసుకోవచ్చంటే బోలెడన్ని సందేహాలు తలెత్తడం సహజం. అయితే, వీటిని నివృత్తి చేసేందుకు బీమా కంపెనీలు గట్టిగా కృషి చేస్తున్నాయి. కొంత మేర విజయవంతం అయ్యాయి కూడా. అయినప్పటికీ .. పాలసీదారులు తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. వాస్తవాలు దాచిపెట్టొద్దు జీవిత బీమా పాలసీ అన్నది నమ్మకం మీద ఆధారపడిన కాంట్రాక్టు వంటింది. కాబట్టి పాలసీ తీసుకోవాలనుకునే వారు దరఖాస్తు చేసేటప్పుడే ముఖ్యమైన అంశాలేమీ దాచకుండా వెల్లడించడం చాలా కీలకమైన అంశం. ఉదాహరణకు.. పాలసీ తీసుకునే వ్యక్తికి అధిక రక్తపోటు ఉన్న పక్షంలో ఆ విషయాన్ని ముందుగానే వెల్లడించాలి. ఒకవేళ దీన్ని దాచిపెట్టి దరఖాస్తు చేసుకుంటే.. పాలసీదారు ఇచ్చిన వివరాల ఆధారంగా బీమా కంపెనీ పాలసీని ఇచ్చేసేయొచ్చు. కానీ, పాలసీదారు అకాలమరణం పాలైతే.. క్లెయిము విషయంలో వారి కుటుంబసభ్యులు సమస్యలు ఎదుర్కొనాల్సి రావొచ్చు. కాంట్రాక్టు కుదుర్చుకునేటప్పుడు పూర్తి వాస్తవాలు వెల్లడించలేదన్న కారణంతో క్లెయిమును తోసిపుచ్చడానికి బీమా కంపెనీకి పూర్తి అధికారాలు ఉంటాయి. కేవలం ఒకటో, అరో వాస్తవాలను వెల్లడించలేదన్న కారణంతో బీమా కంపెనీ.. క్లెయిమును నిరాకరించడం దారుణం అనిపించినప్పటికీ.. వాస్తవాలు తెలుసుకుంటే సబబే అనిపిస్తుంది. బీమా వ్యాపారాన్ని కాస్త క్షుణ్నంగా పరిశీలిస్తే.. రిస్కులను పరస్పరం పంచుకునేందుకు పాలసీదారులు ఏర్పాటు చేసుకునే వేదికే బీమా సంస్థ. క్లెయిములు వచ్చినప్పుడు ఈ సభ్యులంతా కలసి కట్టిన డబ్బు నుంచే చెల్లించాల్సి ఉంటుంది. కనుక, వాస్తవాలను దాచిపెట్టి క్లెయిములు పొందాలనుకునే వారి వల్ల ఇతర పాలసీదారులు నష్టపోకుండా ఉండేలా చూడటం అన్నది బీమా కంపెనీ బాధ్యత. దానికి అనుగుణంగానే ఆయా సంస్థలు వ్యవహరిస్తుంటాయి. ప్రీమియంల దగ్గరే ఆగిపోవద్దు ఆన్లైన్ మాధ్యమం వల్ల ఇతరుల ప్రమేయం లేకుండా కస్టమర్లు నేరుగా పాలసీలు తీసుకునే వీలుంటుంది. దీంతో, పంపిణీ ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయి. ప్రీమియాల తగ్గింపు రూపంలో ఆ ప్రయోజనాలు కస్టమర్‌కు అందుతాయి. ప్రస్తుతం చాలా జీవిత బీమా సంస్థలు పోటీపడి మరీ చౌక ప్రీమియంలతో ఆన్లైన్ టర్మ్ పాలసీలు అందిస్తున్నాయి. పొగాకు జోలికి పోని వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేక ప్రీమియం రేట్లు కూడా అందుబాటులోకి తెచ్చాయి. ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి. అలాగని కేవలం ప్రీమియంల దగ్గరే ఆగిపోవద్దు. క్లెయిముల చెల్లింపుల్లో కంపెనీ చరిత్ర, కంపెనీ బ్రాండ్ నేమ్, సర్వీసుల్లో నాణ్యత తదితర అంశాలన్నీ అధ్యయనం చేసిన తర్వాతే బీమా కంపెనీని, అది అందించే పాలసీని ఎంచుకోవాలి. వీలైనంత ముందుగా తీసుకోవాలి పాలసీలను ఎంత చిన్న వయసులో తీసుకుంటే అంత మంచిదన్నది బీమాకు సంబంధించిన ప్రాథమిక సూత్రం. సంపూర్ణ ఆరోగ్యవంతులై, వయసు తక్కువగా ఉన్నప్పుడు ప్రీమియంలూ తక్కువ స్థాయిలోనే ఉంటాయి. అంతేగాకుండా.. చిన్న వయసులో ఉన్నప్పుడు సుదీర్ఘకాలానికి వర్తించే పాలసీని తీసుకునే వీలుంటుంది. ఉదాహరణకు సంపూర్ణ ఆరోగ్యవంతుడైన పాతికేళ్ల వ్యక్తి.. ఏటా కేవలం రూ. 8,000 చెల్లించి (సర్వీస్ ట్యాక్స్ అదనం) రూ. 1 కోటి మేర కవరేజీకి పాలసీ తీసుకోవచ్చు. అదే, ముప్పై అయిదేళ్ల వ్యక్తి ఇదే కవరేజీ తీసుకోవాలంటే ప్రీమియం రూ. 14,000 పైచిలుకు ఉంటుంది (30 సంవత్సరాల వ్యవధి పాలసీ). పన్ను ప్రయోజనాలే చూసుకోవద్దు జీవితంలో ఒక్కో దశలో ఆర్థిక అవసరాలు ఒక్కో విధంగా మారుతుంటాయి. కనుక, జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఏయే దశలో అవసరాలు ఎలా ఉంటాయి, ఎంత కవరేజీ అవసరమవుతుంది లాంటి అంశాల గురించి తెలుసుకోవాలి. దానికి తగ్గ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. అంతే తప్ప కేవలం పన్నులు ఆదా చేసుకునే దృష్టికోణంతో మాత్రమే పాలసీ తీసుకుంటే.. అది అవసరానికి ఉపయోగపడకుండా పోయే ప్రమాదముందని గుర్తుంచుకోవాలి. ఏదైతేనేం.. సులభతరంగా బీమా పాలసీలు తీసుకునేందుకు కంపెనీలు ఆన్లైన్ వేదికను అందుబాటులోకి తెచ్చాయి. వీటిపై అవగాహన పెంచేందుకు అవి చేస్తున్న ప్రయత్నాలూ ప్రభావవంతంగానే ఉంటున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఆన్లైన్ పాలసీల రో జులు వచ్చేశాయి. ఇక, పాలసీదారుడు తన వంతుగా కీలకమైన విషయాలను దృష్టిలో ఉంచుకుని వివేకవంతమైన నిర్ణయం తీసుకోవాలి. -
ఎన్నికల పై 'ఆన్లైన్' స్టార్టప్‌ల గురి
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ఇంకో నెలరోజుల్లో నగారా మోగనుంది. రాజకీయ పార్టీలన్నీ తమ అస్త్రాలకు పదునుపెట్టడంలో ఇప్పటికే నిమగ్నమయ్యాయి. అయితే, ఈసారి ఎన్నికల్లో టెక్నాలజీపైనే ప్రధానంగా దృష్టిపెడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా విరివిగా వాడుకునేందుకు పార్టీలన్నీ తమ శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నాయి. ఇంటర్నెట్ హవాతో ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్సైట్లలో అభిప్రాయాలు పంచుకుంటున్న భారతీయుల సంఖ్య అంతకంతకూ పెరగడమే దీనికి కారణం. ఇదే అదనుగా కొన్ని ఆన్లైన్ సేవల స్టార్టప్ కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. ఎలక్షన్ టెక్నాలజీ టూల్స్‌కు డిమాండ్ పెరగడంతో ఈ స్టార్టప్‌లకు కూడా మంచి ప్రాచుర్యం లభిస్తోంది. ఎన్నికల్లో ఓటర్లకు తమ పార్టీ విధానాలు, అభ్యర్థుల వివరాలను తెలియజేయాలంటే ఆన్లైన్ మాధ్యమం గొప్ప సాధనంగా మారింది. ప్రధానంగా మధ్యతరగతి ఓటర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం... చదువుకున్న యువతీయువకులు ఓటింగ్‌లో ఎక్కువగా పాల్గొంటుండటం కూడా పార్టీల టెక్నాలజీ జపానికి ముఖ్య కారణం. దీంతో వారికి చేరువయ్యేందుకు స్టార్టప్‌ల ఆసరా తీసుకుంటున్నాయి. వివిధ పార్టీలకు ప్రచారానికి అనువుగా ఉండే సొల్యూషన్లను రూపొం దించేందుకు ఇప్పటికే అరడజనుకు పైగా టెక్నాలజీ స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. ఓటర్లకు సరైన అభ్యర్థిని ఎంచుకునేందుకు అవసరమైన సమాచారాన్ని కూడా ఇవి అందిస్తున్నాయి. గడచిన పక్షం రోజుల్లోనే ఇలాంటి రెండు వెంచర్లు ఆరంభం కావడం గమనార్హం. ‘నగరాలు, పట్టణాల్లో చాలా మంది యువ ఓటర్లు రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలకు హాజరు కారు. వీరిలో అసలు ఓటు వేసేవారి సంఖ్య కూడా తక్కువే. అయితే, వీరు ఆన్లైన్లో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తమ భావాలను పంచుకుంటారు’ అని వోట్‌రైట్.ఇన్ అనే ఆన్టైల్ ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకుడు విక్రం నలగంపల్లి పేర్కొన్నారు. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో రాజకీయ పార్టీల అభ్యర్థుల ట్రాక్‌రికార్డును ఇందులో పొందుపరచనున్నారు. ముఖ్యంగా వాళ్ల ఆస్తులు, విద్యార్హతలు, ఏదైనా క్రిమినల్ కేసులుంటే వాటి వివరాలు, ఇలాంటివన్నీ ఎన్నికల సంఘం నుంచి సేకరించి ఈ పోర్టల్‌లో పెట్టనున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్లను క్రమంతప్పకుండా ఉపయోగించేవారిని వోట్‌రైట్ లక్ష్యంగా చేసుకుంటోందని విక్రం చెబుతున్నారు. ఓటర్లకు ఆన్లైన్ ద్వారా తమ సందేశాలను పంపాలనుకునే అభ్యర్థుల నుంచి ఫీజు రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేయనున్నట్లు చెప్పారు. అమెరికాలో పదేళ్లపాటు పనిచేసిన ఈ 34 ఏళ్ల యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భారత్‌కు తిరిగివచ్చి ఈ స్టార్టప్‌ను ఆరంభించడం విశేషం. కొన్ని స్టార్టప్‌ల సంగతిదీ... వోట్‌రైట్.ఇన్: రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడం, ఓటర్లు అభ్యర్థుల ప్రొఫైల్‌ను సరిపోల్చుకోవడానికి తగిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. వేల్యూఫస్ట్: డిజిటల్, టెక్స్ట్ ఆధారిత మెసేజ్‌ల కోసం కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను పార్టీలను అందుబాటులో ఉంచుతోంది. సోషల్హ్యూస్.కామ్: సోషల్ మీడియాలో ఎన్నికల్లో పోటీపడే అభ్యర్ధుల బ్రాండ్ అవేర్నెస్ను కొలిచే ప్లాట్‌ఫామ్‌ను ఈ బెంగళూరు సంస్థ ఆరంభించింది. విప్లవ్ కమ్యూనికేషన్స్: లోక్‌సభ స్థానాలు, ఓటర్లకు సంబంధించిన డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్‌ను ఈ గుర్గావ్ సంస్థ అందిస్తోంది. 2009 ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో బిజూ జనతాదల్ అభ్యర్థుల గొంతుతో మొబైల్లో 5 లక్షల వాయిస్ కాల్స్‌ను ఓటర్లకు వినిపించేలా తోడ్పడింది. వీళ్లంతా గెలవడం విశేషం. ఈ క్రేజ్ ఎందుకంటే... ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు రాజకీయ పార్టీలకు చేదోడు అందించనున్నాయి. తాజా సర్వే ప్రకారం మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగాను 160 స్థానాల్లో సోషల్ మీడియా అత్యంత ప్రభావం చూపనుంది. ‘ఆమ్ ఆద్మీ’ జోరు... అరవింద్ కేజ్రీవాల్ నెలకొల్పిన ఆమ్ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించడం వెనుక ఈ ఆన్లైన్ సోషల్ మీడియా ప్రచారం కూడా ప్రభావవంతంగా పనిచేసింది. వోట్రైట్కు తొలి కస్టమర్లలో ఇప్పుడు ఆమ్ఆద్మీ కూడా ఒకటి కాబోతోంది. త్వరలోనే తమ అభ్యర్థుల వివరాలన్నీ కొద్దివారాల్లోనే వోట్‌రైట్.ఇన్‌లో పెట్టాలని భావిస్తున్నట్లు ఆమ్ఆద్మీ పార్టీ సోషల్ మీడియా మేనేజర్ అంకిత్ లాల్ పేర్కొన్నారు. ఒక్క ఢిల్లీలోనే ఫేస్బుక్ యూజర్లు 54 లక్షల మందిగా అంచనా. అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న కేజ్రీవాల్‌కు యువతలో వచ్చిన మద్దతుకు సోషల్ మీడియా కూడా ఒక ప్రధాన కారణమేననేది పరిశీలకుల అభిప్రాయం. కాంగ్రెస్, బీజేపీలదీ ఇదే రూట్... మధ్యతరగతి ప్రజలు ఆన్లైన్లో తమ గొంతును ఎలుగెత్తుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ ఇతరత్రా ప్రధాన పార్టీలు కూడా ఈ రూట్లోకి వచ్చేస్తున్నాయి. ‘వచ్చే ఎలక్షన్లలో ఆటను మార్చేయగల అయిదు ప్రధాన కారకాల్లో సోషల్ మీడియా కూడా ఒకటి. మేం ఇప్పటికే చాలా స్టార్టప్‌లతో పనిచేశాం. మా సొంత టెక్నాలజీలను అభివృద్ధి చేసుకున్నాం కూడా’ అని బీజేపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) జాతీయ హెడ్ అరవింద్ గుప్తా చెప్పారు. సోషల్ నెట్‌వర్క్‌లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ప్రచారం కల్పించే ప్రధాన బాధ్యతను ఆయనే చూస్తున్నారు. దేశంలో ఇంటర్నెట్ యూజర్లు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఈసారి ఎన్నికట్లో సోషల్ మీడియా అత్యంత ప్రభావం చూపనుందని గ్రేనియం టెక్నాలజీస్ సహ-వ్యవస్థాపకుడు బీజీ మహేష్ చెబుతున్నారు. బీజేపీ సోషల్ మీడియా ప్రచారంలో ఉన్న మేనేజర్లకు ఆయనే మార్గనిర్ధేశం చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయానికి సోషల్ మీడియా చాలా చేదోడుగా నిలిచిందని కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ గౌడ పేర్కొన్నారు. బెంగళూరు ఐఐఎంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డిజిటల్ ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. -
యప్ టీవీ నుంచి లైవ్ కవరేజి సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రవాసీలు లక్ష్యంగా ఇంటర్నెట్ టీవీ సేవలు అందించే యప్‌టీవీ తాజాగా లైవ్ కవరేజి సర్వీసులను ప్రారంభించింది. కార్పొరేట్ ఫంక్షన్లు, వివాహాది శుభకార్యాలు మొదలైన వాటిని ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ మాధ్యమంలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ‘యప్‌టీవీ లైవ్’ సర్వీసులు ఉపయోగపడతాయని సంస్థ సీఈవో ఉదయ్ రెడ్డి శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో తెలిపారు. లైవ్ టెలికాస్ట్ మధ్యలో అంతరాయం కలగకుండా ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు వివరించారు. అలాగే, వీడియో ఆన్ డిమాండ్ సదుపాయం ద్వారా ఈ కార్యక్రమాలను సుమారు నెల రోజుల దాకా వీక్షించే వెసులుబాటు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన డివైజ్‌లను వీడియోగ్రాఫర్లకు అద్దెకు ఇవ్వనున్నట్లు, నెలవారీ అద్దె సుమారు రూ. 13,000 నుంచి ఉంటుందని (డేటా స్టోరేజి మొదలైనవన్నీ కలిపి) ఉదయ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఇది అందుబాటులో ఉండగలదన్నారు. వీడియోగ్రాఫర్లే కాకుండా.. ఈ సర్వీసులు పొందదల్చుకునే వినియోగదారులూ నేరుగా సంప్రదించవచ్చని చెప్పారు. యప్టీవీలో ప్రస్తుతం 170 పైగా టీవీ చానళ్లను అందిస్తున్నామని చెప్పారు. మొత్తం మీద వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల్లో 70-80 మిలియన్ డాలర్ల ఆదాయాలను అంచనా వేస్తున్నట్లు ఉదయ్ రెడ్డి వివరించారు.