ఎన్నికల పై 'ఆన్‌లైన్' స్టార్టప్‌ల గురి | Online startups help politicians hit the right note with voters | Sakshi
Sakshi News home page

ఎన్నికల పై 'ఆన్‌లైన్' స్టార్టప్‌ల గురి

Published Fri, Jan 24 2014 12:53 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

ఎన్నికల పై 'ఆన్‌లైన్' స్టార్టప్‌ల గురి - Sakshi

ఎన్నికల పై 'ఆన్‌లైన్' స్టార్టప్‌ల గురి

దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ఇంకో నెలరోజుల్లో నగారా మోగనుంది. రాజకీయ పార్టీలన్నీ తమ అస్త్రాలకు పదునుపెట్టడంలో ఇప్పటికే నిమగ్నమయ్యాయి. అయితే, ఈసారి ఎన్నికల్లో టెక్నాలజీపైనే ప్రధానంగా దృష్టిపెడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా విరివిగా వాడుకునేందుకు పార్టీలన్నీ తమ శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నాయి. ఇంటర్నెట్ హవాతో ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్‌సైట్లలో అభిప్రాయాలు పంచుకుంటున్న భారతీయుల సంఖ్య అంతకంతకూ పెరగడమే దీనికి కారణం. ఇదే అదనుగా కొన్ని ఆన్‌లైన్ సేవల స్టార్టప్ కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. ఎలక్షన్ టెక్నాలజీ టూల్స్‌కు డిమాండ్ పెరగడంతో ఈ స్టార్టప్‌లకు కూడా మంచి ప్రాచుర్యం లభిస్తోంది.
 
 ఎన్నికల్లో ఓటర్లకు తమ పార్టీ విధానాలు, అభ్యర్థుల వివరాలను తెలియజేయాలంటే ఆన్‌లైన్ మాధ్యమం గొప్ప సాధనంగా మారింది. ప్రధానంగా మధ్యతరగతి ఓటర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం... చదువుకున్న యువతీయువకులు ఓటింగ్‌లో ఎక్కువగా పాల్గొంటుండటం కూడా పార్టీల టెక్నాలజీ జపానికి ముఖ్య కారణం. దీంతో వారికి చేరువయ్యేందుకు స్టార్టప్‌ల ఆసరా తీసుకుంటున్నాయి. వివిధ పార్టీలకు ప్రచారానికి అనువుగా ఉండే సొల్యూషన్లను రూపొం దించేందుకు ఇప్పటికే అరడజనుకు పైగా టెక్నాలజీ స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. ఓటర్లకు సరైన అభ్యర్థిని ఎంచుకునేందుకు అవసరమైన సమాచారాన్ని కూడా ఇవి అందిస్తున్నాయి. గడచిన పక్షం రోజుల్లోనే ఇలాంటి రెండు వెంచర్లు ఆరంభం కావడం గమనార్హం.
 
 ‘నగరాలు, పట్టణాల్లో చాలా మంది యువ ఓటర్లు రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలకు హాజరు కారు. వీరిలో అసలు ఓటు వేసేవారి సంఖ్య కూడా తక్కువే. అయితే, వీరు ఆన్‌లైన్‌లో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో తమ భావాలను పంచుకుంటారు’ అని వోట్‌రైట్.ఇన్ అనే ఆన్‌టైల్ ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకుడు విక్రం నలగంపల్లి పేర్కొన్నారు.  మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో రాజకీయ పార్టీల అభ్యర్థుల ట్రాక్‌రికార్డును ఇందులో పొందుపరచనున్నారు. ముఖ్యంగా వాళ్ల ఆస్తులు, విద్యార్హతలు, ఏదైనా క్రిమినల్ కేసులుంటే వాటి వివరాలు, ఇలాంటివన్నీ ఎన్నికల సంఘం నుంచి సేకరించి ఈ పోర్టల్‌లో పెట్టనున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను క్రమంతప్పకుండా ఉపయోగించేవారిని వోట్‌రైట్ లక్ష్యంగా చేసుకుంటోందని విక్రం చెబుతున్నారు. ఓటర్లకు ఆన్‌లైన్ ద్వారా తమ సందేశాలను పంపాలనుకునే అభ్యర్థుల నుంచి ఫీజు రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేయనున్నట్లు చెప్పారు. అమెరికాలో పదేళ్లపాటు పనిచేసిన ఈ 34 ఏళ్ల యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భారత్‌కు తిరిగివచ్చి ఈ స్టార్టప్‌ను ఆరంభించడం విశేషం.
 
 కొన్ని స్టార్టప్‌ల సంగతిదీ...
 వోట్‌రైట్.ఇన్: రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడం, ఓటర్లు అభ్యర్థుల ప్రొఫైల్‌ను సరిపోల్చుకోవడానికి తగిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్.
 వేల్యూఫస్ట్: డిజిటల్, టెక్స్ట్ ఆధారిత మెసేజ్‌ల కోసం కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను పార్టీలను అందుబాటులో ఉంచుతోంది.
 సోషల్‌హ్యూస్.కామ్: సోషల్ మీడియాలో ఎన్నికల్లో పోటీపడే అభ్యర్ధుల బ్రాండ్ అవేర్‌నెస్‌ను కొలిచే ప్లాట్‌ఫామ్‌ను ఈ బెంగళూరు సంస్థ ఆరంభించింది.
 విప్లవ్ కమ్యూనికేషన్స్: లోక్‌సభ స్థానాలు, ఓటర్లకు సంబంధించిన డేటాబేస్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను ఈ గుర్గావ్ సంస్థ అందిస్తోంది. 2009 ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో బిజూ జనతాదల్ అభ్యర్థుల గొంతుతో మొబైల్‌లో 5 లక్షల వాయిస్ కాల్స్‌ను ఓటర్లకు వినిపించేలా తోడ్పడింది. వీళ్లంతా గెలవడం విశేషం.
 ఈ క్రేజ్ ఎందుకంటే...

  •  ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు రాజకీయ పార్టీలకు చేదోడు అందించనున్నాయి.
  •  తాజా సర్వే ప్రకారం మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగాను 160 స్థానాల్లో సోషల్ మీడియా అత్యంత ప్రభావం చూపనుంది.

 
   ‘ఆమ్ ఆద్మీ’ జోరు...
 అరవింద్ కేజ్రీవాల్ నెలకొల్పిన ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించడం వెనుక ఈ ఆన్‌లైన్ సోషల్ మీడియా ప్రచారం కూడా ప్రభావవంతంగా పనిచేసింది. వోట్‌రైట్‌కు తొలి కస్టమర్లలో ఇప్పుడు ఆమ్‌ఆద్మీ కూడా ఒకటి కాబోతోంది. త్వరలోనే తమ అభ్యర్థుల వివరాలన్నీ కొద్దివారాల్లోనే వోట్‌రైట్.ఇన్‌లో పెట్టాలని భావిస్తున్నట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ సోషల్ మీడియా మేనేజర్ అంకిత్ లాల్ పేర్కొన్నారు. ఒక్క ఢిల్లీలోనే ఫేస్‌బుక్ యూజర్లు 54 లక్షల మందిగా అంచనా. అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న కేజ్రీవాల్‌కు యువతలో వచ్చిన మద్దతుకు సోషల్ మీడియా కూడా ఒక ప్రధాన కారణమేననేది పరిశీలకుల అభిప్రాయం.
 
 కాంగ్రెస్, బీజేపీలదీ ఇదే రూట్...

 మధ్యతరగతి ప్రజలు ఆన్‌లైన్‌లో తమ గొంతును ఎలుగెత్తుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ ఇతరత్రా ప్రధాన పార్టీలు కూడా ఈ రూట్‌లోకి వచ్చేస్తున్నాయి. ‘వచ్చే ఎలక్షన్‌లలో ఆటను మార్చేయగల అయిదు ప్రధాన కారకాల్లో సోషల్ మీడియా కూడా ఒకటి. మేం ఇప్పటికే చాలా స్టార్టప్‌లతో పనిచేశాం. మా సొంత టెక్నాలజీలను అభివృద్ధి చేసుకున్నాం కూడా’ అని బీజేపీ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) జాతీయ హెడ్ అరవింద్ గుప్తా చెప్పారు. సోషల్ నెట్‌వర్క్‌లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ప్రచారం కల్పించే ప్రధాన బాధ్యతను ఆయనే చూస్తున్నారు. దేశంలో ఇంటర్నెట్ యూజర్లు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఈసారి ఎన్నికట్లో సోషల్ మీడియా అత్యంత ప్రభావం చూపనుందని గ్రేనియం టెక్నాలజీస్ సహ-వ్యవస్థాపకుడు బీజీ మహేష్ చెబుతున్నారు. బీజేపీ సోషల్ మీడియా ప్రచారంలో ఉన్న మేనేజర్లకు ఆయనే మార్గనిర్ధేశం చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయానికి సోషల్ మీడియా చాలా చేదోడుగా నిలిచిందని కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ గౌడ పేర్కొన్నారు. బెంగళూరు ఐఐఎంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డిజిటల్ ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement