మనం శబ్దాన్ని గుర్తిస్తాం, శబ్దానికి చెవినిస్తాం, ఫెళఫెళార్భాటంగా సాగే శబ్దవిప్లవాలకు స్పందిస్తాం. నీటిని గుర్తిస్తాం కానీ చాపకింద నీటిని చటుక్కున గుర్తించలేకపోతాం. వాస్తవం ఏమిటంటే, మనం వెంటనే పోల్చుకోలేని నిశ్శబ్దాలూ, నిశ్శబ్ద విప్లవాలూ; చాప కింద నీరు లాంటి నిరంతర పరిణామాలూ కూడా ఉంటాయి. సాధారణంగా అవే మనిషి జీవితాన్ని, అతని నమ్మకాల్ని తలకిందులు చేస్తాయి. అతనికి తెలియకుండానే అతని కరచరణాలను కట్టడి చేసి శాసిస్తాయి.
సాంకేతికత అలాంటి ఒక నిశ్శబ్ద విప్లవం. ఎప్పుడో చరిత్రపూర్వయుగంలో మనిషి కనిపెట్టిన చక్రం, ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలపాటు అతని భవిష్యత్తును నిర్దేశించింది; అతని జీవ నాన్ని, అతను కూడా ఊహించలేనన్ని కొత్త కొత్త మలుపులు తిప్పింది. చక్రం తిప్పనిదేముంది? ఉన్న సాంకేతికత పోయి కొత్త సాంకేతికత రావడానికీ, అది కొత్త కొత్త మార్పులు కొని తేవడానికీ నిన్నమొన్నటివరకూ ఎక్కువ సమయం పట్టేది. ఆ లోపల ‘పాత’ అనేది సంప్రదాయంగా ఘనీభవించిపోయి కొత్తను అడ్డుకునేది; కాలగమనాన్ని తన అరచేతులతో ఆపడానికి ప్రయత్నించేది.
అలాంటి సంప్రదాయ శాసనం నుంచి బయటపడి తన ఉనికిని స్థాపించుకోవడానికి ‘కొత్త’ ఎంతో పెనుగులాడేది, ఆ ఘర్షణలో సంప్రదాయానిదే పై చేయి అయేది. కానీ ఆధునికకాలం దగ్గరికి వచ్చేసరికి సాంకేతికత ఒక మహావిజృంభణగా మారిపోయింది. ఒక మహావిప్లవరూపం ధరించింది. అప్పటికి కొత్త అనుకున్న సాంకేతికతకు అలవాటు పడే లోపలే దానిని పాతగా మార్చివేస్తూ అంతకన్నా కొత్తదైన సాంకేతికత అడుగుపెట్టడం ప్రారంభించింది. అందువల్ల పాతకు సంప్రదాయంగా ఘనీభవించే వ్యవధి బాగా తగ్గిపోయి, కొత్త సాంకేతికత ముందు అది కూడా తలవంచి దారినివ్వడం అనివార్యమైంది.
ఆ విధంగా సంప్రదాయ, సాంకేతికతల బలాబలాలు తారుమారైపోయాయి. కొత్త సాంకేతికత రెండు మూడు తరాల కాలవ్యవధిలో అడుగుపెట్టడం కూడా పోయి ఒకే తరంలో, కళ్ళు మూసి తెరచే లోగానే ప్రత్యక్షం కావడం ఇప్పుడు సర్వసాధారణమైంది. ఏదైనా సమాచారాన్ని ‘రియల్ టైమ్’లో ప్రపంచవ్యాప్తం చేయడమూ; పుటలకు పుటలు మనం రాసినదానిని మనం కోరుకున్న భాషలోకి తక్షణం తర్జుమా చేసి ఇవ్వడమే కాదు; కీబోర్డుమీద చిటికెనవేలితో నొక్కితే చాలు, మన గురించిన మొత్తం సమాచారాన్ని మన కళ్ళముందు నిలిపే స్థాయికి సాంకేతికత చేరుకుంది. రోబోను సృష్టించిన మనిషి, సాంకేతికత చేతిలో తనే రోబోగా మారాడు.
సమాచారమాధ్యమాల రంగానికే వస్తే ఈ సాంకేతిక మహావిప్లవం తెచ్చిన మార్పు ఎన్నో ఆసక్తికరమైన పరిస్థితులను çసృష్టించింది. సామాజిక మాధ్యమాల పేరిట ఫేస్‌బుక్, వాట్సప్, బ్లాగ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వగైరాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో అంతవరకూ ఆధిపత్యం చలాయించిన ప్రింటు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు సాంప్రదాయిక మాధ్యమాలుగా మారాయి. సామాజిక, సాంప్రదాయిక మాధ్యమాల సహజీవనం వినూత్న పరిణామాలకు దారి తీసింది. అంతవరకు స్థలకాలాల నిర్ణయాధికారం సాంప్రదాయిక మాధ్యమాల నిర్వాహకుల చేతుల్లో ఉండేది. ఇప్పుడా అధికారం స్మార్ట్ ఫోన్, లేదా ల్యాప్ టాప్ దగ్గరున్న ప్రతి వ్యక్తికీ బదిలీ అయింది.
అతను తాను కోరుకున్నంత స్థలంలో, తను ఎప్పుడనుకుంటే అప్పుడు తన అభిప్రా యాన్ని ప్రచురించుకునే వెసులుబాటు వచ్చింది. ఫేస్‌బుక్ పరిభాషలో చెప్పాలంటే ‘గోడ’ రూపంలో తను సృష్టించుకున్న తన పత్రికకు, తన ఛానెల్‌కు తనే సంపాదకుడు. తన వాల్ మీద ఏది పోస్టు చేయాలో నిర్ణయించుకునే అధికారం తనదే. ‘వెనకటి మహాభారతం పద్దెనిమిది పర్వాలు కావచ్చు, ఆధునిక మహాకావ్యం పద్దెనిమిది పేజీలే’ ననే అర్థంలో మహాకవి శ్రీశ్రీ చేసిన వ్యాఖ్య ఒకటి ప్రసిద్ధమే. ఇప్పుడు మన ఫేస్‌బుక్ వాల్ మీద, లేదా మన బ్లాగులో ఏకకాలంలో పద్దెనిమిది పంక్తుల్లో ఒక మినీ వ్యాసాన్ని, పద్దెనిమిది పుటల్లో ఒక కావ్యాన్నే కాదు, పద్దెనిమిది పర్వాల మహేతిహాసాన్ని కూడా రాయగలిగినంత జాగా అందుబాటులోకి వచ్చింది.
సాంకేతికవిప్లవం ఆవిష్కరించే వింతలకు అంతే ఉండదు. కొత్త సాంకేతికత ఒక్కొక్కసారి సుదూరగతానికి చెందిన పాతపద్ధతులను కూడా కొత్త మెరుపుతో ముందుకు తేగలదు. పూర్వం, అచ్చుయంత్రం కాదు సరికదా, లిఖితసంప్రదాయం కూడా వేళ్లూనుకొనని రోజుల్లో పురాణశ్రవణం ఉండేది. పౌరాణికుడు, శ్రోతలు ఎదురెదురుగా ఉండేవారు. శ్రోతల అభిరుచులు, అభిప్రాయాలూ, అనుకూల, వ్యతిరేకస్పందనలు తక్షణమే పౌరాణికుని దృష్టికి వచ్చేవి. అవి కూడా పురాణ శ్రవణాన్ని, కథానిర్మాణాన్ని ప్రభావితం చేసేవి. ఆ విధంగా పురాణకథనం ద్వికర్తృకంగా, లేదా జంట నిర్మాణంగా రూపుదాల్చేది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో మళ్ళీ అదే పద్ధతి పునరావృతమైంది.
తను చదివిన, లేదా విన్న వాటిపై పాఠకుడు, శ్రోత అప్పటికప్పుడు స్పందించగలుగుతున్నాడు. ఆ విధంగా అది ఒక రచనను ‘రియల్ టైమ్’లో ప్రభావితం చేసి అవసరమైతే మార్చుకునే అవకాశా న్నిస్తున్నది. ప్రజాస్వామికమైన చర్చను కొత్త పుంతలు తొక్కిస్తున్నది. సంపాదకుడనే అంకుశం లోపించినప్పుడు సామాజిక మాధ్యమాలు మదపుటేనుగుల స్వైర విహారానికి ఆటపట్టులవుతాయి. ఉచితానుచితాలు, సభ్యతా సంస్కారాల హద్దులు చెరిగిపోవ డమూ సంభవిస్తుంది. అయితే స్థలకాలాలు, శాస్త్రసాంకేతిక నూతనావిష్కారాలకు అతీతంగా ఎల్ల కాలాలకూ, ఎల్ల ప్రాంతాలకూ వర్తించే మన్నికైన మానవ విలువలు; విజ్ఞతావివేకాల కొలమానాలు ఎప్పుడూ సజీవంగా ఉంటూనే ఉంటాయి. సాంప్రదాయిక, సామాజిక మాధ్యమాల తేడా లేకుండా సంపాదక స్థానంలో ఉన్న ప్రతి ఒకరిపై జనాభిప్రాయమనే పెద్ద అంకుశం అజ్ఞాతంగా ఉండి నియంత్రిస్తూనే ఉంటుంది. ఆ జనాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించే పాఠకుడు అతిని ఒక కంట కనిపెట్టి చూస్తూ అవసరమనిపించిన సమయంలో కత్తెర ప్రయోగిస్తూనే ఉంటాడు. నిత్యజాగృతుడైన పాఠ కుడు, లేదా శ్రోత, లేదా ప్రేక్షకుడే అంతిమంగా ఏ మాధ్యమానికైనా ఎడిటర్– ఇన్– చీఫ్!
Comments
Please login to add a commentAdd a comment