లండన్: సామాజిక మాధ్యమాల్లో ప్రమాదకరమైన సమాచారం వస్తే ఆయా సంస్థల యాజమాన్యాన్ని ఇందుకు బాధ్యులుగా చేస్తామని బ్రిటన్ హెచ్చరించింది. విద్వేష నేరాలు, దూషణలకు సంబంధించి ఫేస్‌బుక్ సహా పలు సోషల్‌మీడియా సంస్థల అధినేతలతో చర్చించిన అనంతరం కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్)ను ప్రకటించింది. ఈ తరహా యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించడం ప్రపంచంలో ఇదే తొలిసారని బ్రిటన్ సాంస్కృతిక, మీడియా మంత్రి జెరిమీ రైట్ తెలిపారు. ఇందులో భాగంగా విద్వేష సమాచారం, ప్రమాదకరమైన వీడియోలను కంపెనీలు బాధ్యతగా తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించి త్వరలోనే చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. ఈ ప్రతిపాదనల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన సోషల్‌మీడియా సంస్థలకు తొలుత హెచ్చరికలు జారీచేస్తామన్నారు. ఆ తర్వాత ఆయా సంస్థల్లోని సీనియర్ మేనేజర్లకు జరిమానా విధించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదుచేస్తామన్నారు. చివరగా సంబంధిత ప్లాట్‌ఫామ్‌ను దేశంలో నిషేధిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం ఓ స్వతంత్ర నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రైట్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment