Issued summons
-
రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, బెంగళూరు: టాలీవుడ్ నటి రష్మికా మందన్నకు షాక్ తగిలింది. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజపేటలో ఉన్న రష్మిక నివాసంపై గురువారం ఐటీ,ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం 7.30 గంటల సమయంలో రష్మిక అభిమానుల పేరుతో ఇంట్లో ప్రవేశించి ఆమె తండ్రితో పరిచయం చేసుకున్నారు. అంతలోనే సోదాలు మొదలుపెట్టారు. దాడిలో పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సినిమాలకు తీసుకుంటున్న పారితోషికం వివరాలను రష్మిక తగ్గించి చూపుతున్నట్లు, పన్ను కూడా సరిగా కట్టలేదని ఐటీ ఆరోపిస్తోంది. విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. -
శశిథరూర్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు ఢిల్లీ కోర్టు ఒకటి సమన్లు జారీ చేసింది. జూన్ 7న కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. పేరు తెలియని ఆర్ఎస్ఎస్ నేత ఒకరు ప్రధాని మోదీని శివలింగంపై కూర్చున్న తేలుతో పోల్చారంటూ థరూర్ గత అక్టోబర్‌లో చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ ఫిర్యాదు చేశారు. ‘థరూర్ వ్యాఖ్యలు నాతో పాటు దేశంలోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివభక్తుల విశ్వాసాలను గాయపరిచాయి. ఇది సహించరాని దూషణ. లక్షలాది మంది ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా అపఖ్యాతి పాలుచేయడమే..’ అని బబ్బర్ పేర్కొన్నారు. పరువు నష్టానికి సంబంధించిన సెక్షన్ల కింద ఫిర్యాదు దాఖలు చేశారు. శనివారం ఈ ఫిర్యాదును విచారించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ సమన్లు జారీ చేశారు. -
‘సోషల్’ యాజమాన్యాన్ని బాధ్యులుగా చేస్తాం
లండన్: సామాజిక మాధ్యమాల్లో ప్రమాదకరమైన సమాచారం వస్తే ఆయా సంస్థల యాజమాన్యాన్ని ఇందుకు బాధ్యులుగా చేస్తామని బ్రిటన్ హెచ్చరించింది. విద్వేష నేరాలు, దూషణలకు సంబంధించి ఫేస్బుక్ సహా పలు సోషల్‌మీడియా సంస్థల అధినేతలతో చర్చించిన అనంతరం కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్)ను ప్రకటించింది. ఈ తరహా యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించడం ప్రపంచంలో ఇదే తొలిసారని బ్రిటన్ సాంస్కృతిక, మీడియా మంత్రి జెరిమీ రైట్ తెలిపారు. ఇందులో భాగంగా విద్వేష సమాచారం, ప్రమాదకరమైన వీడియోలను కంపెనీలు బాధ్యతగా తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. ఈ ప్రతిపాదనల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన సోషల్‌మీడియా సంస్థలకు తొలుత హెచ్చరికలు జారీచేస్తామన్నారు. ఆ తర్వాత ఆయా సంస్థల్లోని సీనియర్ మేనేజర్లకు జరిమానా విధించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదుచేస్తామన్నారు. చివరగా సంబంధిత ప్లాట్‌ఫామ్‌ను దేశంలో నిషేధిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం ఓ స్వతంత్ర నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రైట్ అన్నారు. -
రాహుల్‌కు గుజరాత్ కోర్టు సమన్లు
అహ్మదాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలాకు గుజరాత్‌లోని ఓ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. 2016 నవంబర్‌లో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు(ఏడీసీబీ) రూ.750 కోట్ల విలువైన రద్దయిన నోట్లను కొత్త నోట్లతో మార్చి భారీ కుంభకోణానికి పాల్పడిందని వీరు తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆ బ్యాంకు చైర్మన్ అజయ్‌పటేల్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు మే 27వ తేదీన తమ ముందు హాజరు కావాలంటూ వారిద్దరికీ సోమవారం సమన్లు జారీ చేశారు. ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన ఐదు రోజుల్లోనే ఆ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరైన బీజేపీ చీఫ్ అమిత్‌షాకు చెందిన రూ.745 కోట్ల మేర పాత నోట్లను కొత్తవాటితో మార్పిడి చేసిందని ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త తెలిపిన సమాచారం మేరకు రాహుల్ గాంధీ.. ‘కేవలం ఐదు రోజుల్లోనే రూ.750 కోట్ల పాతనోట్లను కొత్తనోట్లతో మార్పిడి చేసి, ప్రథమ బహుమతి గెలుచుకున్నందుకు కంగ్రాట్స్ అమిత్ షా జీ, డైరెక్టర్, అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్..’అంటూ ట్విట్టర్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
మైనింగ్ కేసులో ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: యూపీ అక్రమ మైనింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్సీ రమేశ్ కుమార్ మిశ్రాతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీచేసింది. ఈడీ విచారణాధికారి ఎదుట జనవరి 24, 28న హాజరు కావాలని చంద్రకళ, రమేశ్ మిశ్రాలను ఆదేశించింది. మిగిలిన ఇద్దరు అధికారులకు వచ్చేవారం సమన్లు జారీచేస్తామని పేర్కొంది. 2012–16 మధ్యకాలంలో యూపీలోని హామీర్పూర్ జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగినట్లు సీబీఐ కేసు నమోదుచేసింది. అప్పట్లో యూపీ సీఎంగా ఉన్న అఖిలేశ్ యాదవ్ తన వద్ద గనుల శాఖను అట్టిపెట్టుకున్నారనీ, అనుమతుల జారీలో నిబంధనలు ఉల్లంఘించారని సీబీఐ ఆరోపించింది. తాజాగా సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా అక్రమ నగదు చెలామణి చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ క్రిమినల్ కేసు నమోదుచేసింది. మైనింగ్ అనుమతుల జారీకి నిందితులు అందుకున్న అవినీతి సొమ్ము హవాలా మార్గాల ద్వారా వచ్చిందా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి. విచారణలో భాగంగా నిందితుల స్థిర, చరాస్తులను జప్తు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. -
జయ కేసులో వెంకయ్యకు సమన్లు?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై విచారణలో భాగంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావులకు సమన్లు జారీ చేసేందుకు విచారణ కమిషన్ సిద్ధమవుతోంది. 2016 సెప్టెంబరు 22వ తేదీన అనారోగ్య కారణాలతో జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరడం, అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీన కన్నుమూయడం తెలిసిందే. నాడు జయను పరామర్శించేందుకు అపోలో ఆస్పత్రికి వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య, గవర్నర్ విద్యాసాగర్‌లను విచారించాలని కమిషన్ భావిస్తోంది. తన తరఫు లాయర్‌ను అనుమతించాలని జయ మేనకోడలు దీప చేసిన విజ్ఞప్తిని కమిషన్ తోసిపుచ్చింది. దీంతో ఆమె బుధవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
శశిథరూర్‌కు కోల్‌కతా కోర్టు సమన్లు
కోల్‌కతా: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు కోల్‌కతాలోని ఓ కోర్టు సమన్లు జారీచేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే భారత్ ‘హిందూ పాకిస్తాన్’గా మారుతుందంటూ థరూర్ చేసిన వ్యాఖ్యలపై ఇక్కడి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీచేసినట్లు పిటిషనర్ సుమిత్ చౌదురీ తెలిపారు. థరూర్ వ్యాఖ్యలు దేశంలో మత సామరస్యాన్ని, ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న జడ్జి ఆగస్టు 14లోగా కోర్టుముందు హాజరు కావాలని థరూర్‌ను ఆదేశించారు. -
ఆగస్టు 27న కోర్టుకు రండి
ముంబై: ఆగస్టు 27వ తేదీన తమ ముందు హాజరుకావాలని మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా బకాయిల ఎగవేత కేసులో ఈడీ విజ్ఞప్తి మేరకు.. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ‘ప్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్’ కింద కోర్టు సమన్లు జారీ చేసింది. గడువు తేదీలోగా మాల్యా హాజరుకాకపోతే అతన్ని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించడంతో పాటు.. అతనికి సంబంధించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఇటీవల మాల్యాపై ఈడీ దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌తో పాటు.. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలని చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఎంఎస్ అజ్మీ ఈ నోటీసులు జారీచేశారు. పరారీలో ఉన్న రుణ ఎగవేతదారులపై చర్యల కోసం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ప్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్’ కింద ఒకరిపై చర్యలు ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఏప్రిల్‌లో తీసుకొచ్చిన ఈ కొత్త ఆర్డినెన్స్ ప్రకారం.. పరారీలోని వ్యక్తుల ఆస్తుల్ని జప్తు చేసుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. మాల్యాకు చెందిన రూ. 12,500 కోట్ల ఆస్తుల్ని తక్షణం స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలని కూడా కోర్టును ఈడీ కోరింది. రెండు నాన్‌బెయిలబుల్ వారంట్లు రుణం ఎగవేత కేసుల్లో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డాడంటూ మాల్యాపై ఈడీ దాఖలు చేసిన రెండు కేసుల్లో ఇంతకుముందే కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీచేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో మాల్యా, అతని కంపెనీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ కలిపి ప్రస్తుతం రూ. 9,990.07 కోట్లకు చేరింది. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణల విషయమై మాల్యా స్పందిస్తూ.. బ్యాంకు రుణం ఎగవేత ఘటనలకు తాను ప్రచారకర్తగా మారిపోయాననడం తెల్సిందే. తన వాదనను వివరిస్తూ 2016 ఏప్రిల్‌లో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రికి లేఖ రాసినా స్పందించలేదని, ప్రభుత్వం అనుమతిస్తే ఆస్తుల్ని అమ్మి రుణాలు చెల్లిస్తానని చెప్పారు. మాల్యా రీట్వీట్‌పై బీజేపీ విమర్శలు న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ట్వీట్‌ను విజయ్ మాల్యా రీపోస్టు చేయడాన్ని బీజేపీ తప్పుపట్టింది. మహాకూటమికి మోసగా డు మద్దతు తెలిపాడంటూ కాంగ్రెస్‌పై విమర్శలు చేసింది. బీజేపీ ప్రతినిధి అనిల్ బలూనీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో మాల్యా ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగించాడని, అతను చేసిన రీట్వీట్ దానిని ఇప్పుడు బయటపెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకుల నుంచి మాల్యా రుణాలు పొందాడని ఆయన పేర్కొన్నారు. నల్లధనంపై మోదీ ప్రభుత్వ హామీల్ని తప్పుపడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేసిన ట్వీట్‌ను ఇటీవల మాల్యా రీట్వీట్ చేయడం గమనార్హం. -
శశి థరూర్‌కు సమన్లు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన సునందా పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ను నిందితుడిగా పేర్కొంటూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. జూలై 7న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. థరూర్‌పై విచారణ జరపడానికి ఆధారాలున్నాయని కోర్టు నమ్ముతున్నట్టు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ తెలిపారు. శశి థరూర్.. సునంద పుష్కర్ ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణలకు ఆధారాలున్నాయని, విచారణకు హాజరు కావాలని ఆయనకు సమన్లు జారీ చేయాలని మే 14న ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. భార్య సునంద పుష్కర్ పట్ల ఆయన క్రూరంగా వ్యవహరించేవారని, నాలుగున్నరేళ్ల కిందటి ఈ కేసులో ఆయన ఒక్కరే నిందితుడని చార్జిషీట్లో ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. వారి వద్ద పనిచేసే నారాయణ్ సింగ్ ఈ కేసులో కీలక సాక్షిగా వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 498ఎ (భర్త లేదా భర్త తరఫు బంధువులు భార్యపై క్రూరంగా వ్యవహరించడం) కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ చార్జ్‌షీట్‌ను ఆధారం చేసుకుని థరూర్‌కు సమన్లు జారీ చేశారు. దీనిపై థరూర్ లాయర్ వికాస్ పహ్వా స్పందిస్తూ చార్జిషీట్ కాపీని కోరామని, దానిలో అంశాలు పరిశీలించి నిర్ణయిస్తామని అన్నారు. ప్రాసిక్యూషన్‌కు సహకరిస్తానన్న స్వామి కేసులో ప్రాసిక్యూషన్‌కు సహకరించడానికి అనుమతించాలని బీజేపీ ఎంపీ, న్యాయవాది సుబ్రమణ్యం స్వామి కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసులో విజిలెన్స్ విచారణపై నివేదిక సమర్పించాలని పోలీసుల్ని ఆదేశించాలని అభ్యర్థించారు. దీన్ని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ వ్యతిరేకించారు. కోర్టు ఈ దరఖాస్తును వచ్చే నెల 7 వరకు పెండింగ్‌లో ఉంచింది. 2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణానికి సంబంధించి పోలీసులు 2015 జనవరి 1న ఐపీసీ సెక్షన్ 302 (హత్యానేరం) కింద గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఆరోపణలు హాస్యాస్పదం: శశి థరూర్ ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో శశి థరూర్ స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలు హాస్యాస్పదం, నిరాధారమన్నారు. కక్ష సాధింపు ధోరణితో తనకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొడతానని అన్నారు. న్యాయవ్యవస్థ ద్వారా నిజమేంటో బయటపడుతుందన్నారు. -
చిదంబరంనకు సమన్లు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంపై ఈనెల 6వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంనకు సీబీఐ సమన్లు జారీ చేసింది. మే 31వ తేదీనే సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా చిదంబరం విజ్ఞప్తి మేరకు 6వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో జూలై 3వ తేదీ వరకు చిదంబరంను అరెస్టు చేయరాదంటూ ఢిల్లీ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మీడియా ప్రముఖులు పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణిలు ప్రమోటర్లుగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ గత ఏడాది కేసు నమోదు చేసింది. ఈ కేసులో రూ.10 లక్షలు తీసుకున్నారనే ఆరోపణలపై చిదంబరం కుమారుడు కార్తీని సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. -
జూలై 15న బొగ్గు స్కాం కేసు విచారణ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సమన్లు జారీ అయిన బొగ్గు స్కాం కేసు విచారణ జూలై 15న జరగనుంది. ఈ మేరకు విచారణ తేదీని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం నిర్ణయించింది. మార్చి 11న మన్మోహన్‌కు జారీ అయిన సమన్లపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు విచారణను సీబీఐ కోర్టు గతంలో వాయిదా వేసింది. తాజాగా ఈ కేసు తదుపరి విచారణకు తేదీని నిర్ణయించింది. నిజానికి ఈ కేసు మూసివేతకు గత డిసెంబర్ 16న సీబీఐ నివేదిక సమర్పించింది. అయితే దీన్ని తిరస్కరించిన కోర్టు.. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని, అప్పట్లో బొగ్గు శాఖ బాధ్యతలను కూడా చూసుకున్న మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను, పీఎంవో అధికారులను విచారించాలని ఆదేశించింది. ఒడిశాలోని తాలాబిరా-2 బొగ్గు బ్లాకును హిందాల్కో కంపెనీకి 2005లో కేంద్రం కేటాయించింది. ఇందులో అక్రమాలు చోటుచేసుకున్నట్లు నమోదైన కేసులో మన్మోహన్‌ను కూడా నిందితుడిగా సీబీఐ పేర్కొంది. కోర్టు ఆదేశాలతో మాజీ ప్రధానితోపాటు హిందాల్కో కంపెనీకి, దాని యాజమాన్యానికి, ఇద్దరు ఉన్నతాధికారులకు సమన్లు జారీ అయ్యాయి. దీనిపై నిందితులు సుప్రీంను ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.