న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన సునందా పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ను నిందితుడిగా పేర్కొంటూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. జూలై 7న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. థరూర్‌పై విచారణ జరపడానికి ఆధారాలున్నాయని కోర్టు నమ్ముతున్నట్టు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ తెలిపారు.
శశి థరూర్.. సునంద పుష్కర్ ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణలకు ఆధారాలున్నాయని, విచారణకు హాజరు కావాలని ఆయనకు సమన్లు జారీ చేయాలని మే 14న ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. భార్య సునంద పుష్కర్ పట్ల ఆయన క్రూరంగా వ్యవహరించేవారని, నాలుగున్నరేళ్ల కిందటి ఈ కేసులో ఆయన ఒక్కరే నిందితుడని చార్జిషీట్‌లో ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. వారి వద్ద పనిచేసే నారాయణ్ సింగ్ ఈ కేసులో కీలక సాక్షిగా వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 498ఎ (భర్త లేదా భర్త తరఫు బంధువులు భార్యపై క్రూరంగా వ్యవహరించడం) కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ చార్జ్‌షీట్‌ను ఆధారం చేసుకుని థరూర్‌కు సమన్లు జారీ చేశారు. దీనిపై థరూర్ లాయర్ వికాస్ పహ్వా స్పందిస్తూ చార్జిషీట్ కాపీని కోరామని, దానిలో అంశాలు పరిశీలించి నిర్ణయిస్తామని అన్నారు.
ప్రాసిక్యూషన్‌కు సహకరిస్తానన్న స్వామి
కేసులో ప్రాసిక్యూషన్‌కు సహకరించడానికి అనుమతించాలని బీజేపీ ఎంపీ, న్యాయవాది సుబ్రమణ్యం స్వామి కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసులో విజిలెన్స్ విచారణపై నివేదిక సమర్పించాలని పోలీసుల్ని ఆదేశించాలని అభ్యర్థించారు. దీన్ని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ వ్యతిరేకించారు.
కోర్టు ఈ దరఖాస్తును వచ్చే నెల 7 వరకు పెండింగ్‌లో ఉంచింది. 2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ హోటల్‌లో సునంద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణానికి సంబంధించి పోలీసులు 2015 జనవరి 1న ఐపీసీ సెక్షన్ 302 (హత్యానేరం) కింద గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
ఆరోపణలు హాస్యాస్పదం: శశి థరూర్
ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో శశి థరూర్ స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలు హాస్యాస్పదం, నిరాధారమన్నారు. కక్ష సాధింపు ధోరణితో తనకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొడతానని అన్నారు. న్యాయవ్యవస్థ ద్వారా నిజమేంటో బయటపడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment