
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు ఢిల్లీ కోర్టు ఒకటి సమన్లు జారీ చేసింది. జూన్ 7న కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. పేరు తెలియని ఆర్‌ఎస్‌ఎస్ నేత ఒకరు ప్రధాని మోదీని శివలింగంపై కూర్చున్న తేలుతో పోల్చారంటూ థరూర్ గత అక్టోబర్‌లో చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ ఫిర్యాదు చేశారు. ‘థరూర్ వ్యాఖ్యలు నాతో పాటు దేశంలోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివభక్తుల విశ్వాసాలను గాయపరిచాయి. ఇది సహించరాని దూషణ. లక్షలాది మంది ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా అపఖ్యాతి పాలుచేయడమే..’ అని బబ్బర్ పేర్కొన్నారు. పరువు నష్టానికి సంబంధించిన సెక్షన్ల కింద ఫిర్యాదు దాఖలు చేశారు. శనివారం ఈ ఫిర్యాదును విచారించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ సమన్లు జారీ చేశారు.