తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వివాదంలో చిక్కుకున్నారు. మత్స్యకారులను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్‌పై కేరళ బీజేపీ, సీపీఎం నాయకులు మండిపడ్డారు. మత్స్యకారులకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. థరూర్ ట్వీట్‌కు వ్యతిరేకంగా కొచ్చి, కొల్లాం, కోజికోడ్‌లలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. తాను రాసిన పదాల్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని థరూర్ వివరణ ఇచ్చారు. తిరువనంతపురం నుంచి లోక్‌సభ బరిలో నిలిచిన థరూర్ ప్రచారంలో భాగంగా ఇటీవల స్థానిక చేపల మార్కెట్‌లో పర్యటించారు.
‘ఎంతో నిష్టతో శాకాహారాన్ని మాత్రమే భుజించే ఎంపీకి చేపల మార్కెట్‌లో మంచి ఆదరణ లభించింది’ అని ట్వీట్ చేశారు. అనంతరం వివాదం రేగడంతో.. ప్రేమ కురిపించారని చెప్పడమే తన ఉద్దేశమని, ఎవరినీ అవమానించడం కాదని వివరణ ఇచ్చారు. తన కుటుంబంలో తాను మినహా అందరూ చేపలు తింటారన్నారు. మత్స్యకారులకు ఏమీ చేయని వారు కూడా ఒక్క పదాన్ని సాకుగా చూపి విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేరళ వరదల సందర్భంగా సహాయక చర్యల్లో పాలుపంచుకున్న మత్స్యకారులను థరూర్ ఫిబ్రవరిలో నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment