విజయ్ మాల్యా
ముంబై: ఆగస్టు 27వ తేదీన తమ ముందు హాజరుకావాలని మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా బకాయిల ఎగవేత కేసులో ఈడీ విజ్ఞప్తి మేరకు.. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ‘ప్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్’ కింద కోర్టు సమన్లు జారీ చేసింది. గడువు తేదీలోగా మాల్యా హాజరుకాకపోతే అతన్ని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించడంతో పాటు.. అతనికి సంబంధించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవచ్చు.
ఇటీవల మాల్యాపై ఈడీ దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌తో పాటు.. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలని చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఎంఎస్ అజ్మీ ఈ నోటీసులు జారీచేశారు. పరారీలో ఉన్న రుణ ఎగవేతదారులపై చర్యల కోసం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ప్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్’ కింద ఒకరిపై చర్యలు ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఏప్రిల్‌లో తీసుకొచ్చిన ఈ కొత్త ఆర్డినెన్స్ ప్రకారం.. పరారీలోని వ్యక్తుల ఆస్తుల్ని జప్తు చేసుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. మాల్యాకు చెందిన రూ. 12,500 కోట్ల ఆస్తుల్ని తక్షణం స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలని కూడా కోర్టును ఈడీ కోరింది.
రెండు నాన్‌బెయిలబుల్ వారంట్లు
రుణం ఎగవేత కేసుల్లో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డాడంటూ మాల్యాపై ఈడీ దాఖలు చేసిన రెండు కేసుల్లో ఇంతకుముందే కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీచేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో మాల్యా, అతని కంపెనీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ కలిపి ప్రస్తుతం రూ. 9,990.07 కోట్లకు చేరింది. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణల విషయమై మాల్యా స్పందిస్తూ.. బ్యాంకు రుణం ఎగవేత ఘటనలకు తాను ప్రచారకర్తగా మారిపోయాననడం తెల్సిందే. తన వాదనను వివరిస్తూ 2016 ఏప్రిల్‌లో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రికి లేఖ రాసినా స్పందించలేదని, ప్రభుత్వం అనుమతిస్తే ఆస్తుల్ని అమ్మి రుణాలు చెల్లిస్తానని చెప్పారు.
మాల్యా రీట్వీట్‌పై బీజేపీ విమర్శలు
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ట్వీట్‌ను విజయ్ మాల్యా రీపోస్టు చేయడాన్ని బీజేపీ తప్పుపట్టింది. మహాకూటమికి మోసగా డు మద్దతు తెలిపాడంటూ కాంగ్రెస్‌పై విమర్శలు చేసింది. బీజేపీ ప్రతినిధి అనిల్ బలూనీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో మాల్యా ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగించాడని, అతను చేసిన రీట్వీట్ దానిని ఇప్పుడు బయటపెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకుల నుంచి మాల్యా రుణాలు పొందాడని ఆయన పేర్కొన్నారు. నల్లధనంపై మోదీ ప్రభుత్వ హామీల్ని తప్పుపడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేసిన ట్వీట్‌ను ఇటీవల మాల్యా రీట్వీట్ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment