ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ
న్యూఢిల్లీ: యూపీ అక్రమ మైనింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్సీ రమేశ్ కుమార్ మిశ్రాతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీచేసింది. ఈడీ విచారణాధికారి ఎదుట జనవరి 24, 28న హాజరు కావాలని చంద్రకళ, రమేశ్ మిశ్రాలను ఆదేశించింది. మిగిలిన ఇద్దరు అధికారులకు వచ్చేవారం సమన్లు జారీచేస్తామని పేర్కొంది. 2012–16 మధ్యకాలంలో యూపీలోని హామీర్పూర్ జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగినట్లు సీబీఐ కేసు నమోదుచేసింది.
అప్పట్లో యూపీ సీఎంగా ఉన్న అఖిలేశ్ యాదవ్ తన వద్ద గనుల శాఖను అట్టిపెట్టుకున్నారనీ, అనుమతుల జారీలో నిబంధనలు ఉల్లంఘించారని సీబీఐ ఆరోపించింది. తాజాగా సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా అక్రమ నగదు చెలామణి చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఈడీ క్రిమినల్ కేసు నమోదుచేసింది. మైనింగ్ అనుమతుల జారీకి నిందితులు అందుకున్న అవినీతి సొమ్ము హవాలా మార్గాల ద్వారా వచ్చిందా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి. విచారణలో భాగంగా నిందితుల స్థిర, చరాస్తులను జప్తు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment