అఖిలేశ్ యాదవ్, తెలంగాణ ఐఏఎస్ అధికారిణి చంద్రకళ
న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ సీబీఐ విచారణ ఎదుర్కొనే చాన్సుంది. ఈ మేరకు నమోదైన కేసు వివరాల్ని సీబీఐ వెల్లడించింది. ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, ఎస్పీ ఎమ్మెల్సీ రమేశ్ కుమార్ మిశ్రా, బీఎస్పీ నాయకుడు సంజయ్ దీక్షిత్ సహా మొత్తం 11 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి శనివారం సీబీఐ అధికారులు.. యూపీ, ఢిల్లీలో నిందితులకు చెందిన 14 చోట్ల సోదాలు నిర్వహించారు. 2012–16 మధ్య కాలంలో హమీర్‌పూర్ జిల్లాలో ఇసుక, కంకర లాంటి ఖనిజాల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయన్నది తాజా కేసులో ప్రధాన ఆరోపణ. 2012–17 మధ్య కాలంలో నాటి సీఎం అఖిలేశ్ 2012–13లో గనుల శాఖను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అందుకే ఆయన పాత్రపై సీబీఐ దృష్టిసారించే వీలుంది.
అక్రమంగా కాంట్రాక్టులిచ్చారు..
2012–14 మధ్య కాలంలో హమీర్‌పూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన చంద్రకళ ఈ–టెండర్ నిబంధనల్ని ఉల్లంఘించి కాంట్రాక్టులు కట్టబెట్టారని సీబీఐ ఆరోపించింది. ఆమె అక్రమంగా కొత్త అనుమతులిచ్చారని, పాత వాటిని పునరుద్ధరించారని పేర్కొంది. అక్రమ మైనింగ్‌కు అనుమతిచ్చిన చంద్రకళ, ఇతర అధికారులు.. గుత్తేదారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన చంద్రకళ 2008లో ఐఏఎస్‌కు ఎంపికై, యూపీ కేడర్ అధికారిగా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment