లక్నో : అక్రమ మైనింగ్ కేసులో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను సీబీఐ ప్రశ్నించనుందనే వార్తల నేపథ్యంలో దర్యాప్తు ఏజెన్సీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని అయితే ప్రజలకు సమాధానం ఇచ్చేందుకు బీజేపీ సంసిద్ధం కావాలని వ్యాఖ్యానించారు.
బీజేపీ ప్రత్యర్ధులను వేధించే సంస్కృతిని ప్రవేశపెట్టిందని, భవిష్యత్‌లో ఇది ఆ పార్టీకే ప్రమాదకరమని అఖిలేష్ హెచ్చరించారు. యూపీలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచేందుకు ఎస్పీ ప్రయత్నిస్తోందని, తమను నిలువరించే వారి చేతిలో ప్రస్తుతం సీబీఐ ఉన్నదని చెప్పుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ సీబీఐ విచారణ జరిపిస్తే తనను ప్రశ్నించారని, మరోసారి బీజేపీ తనపైకి సీబీఐని ఉసిగొల్పినా తాను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.
ప్రజలకు మాత్రం తగిన సమాధానం చెప్పేందుకు బీజేపీ సిద్ధం కావాలని పేర్కొన్నారు. సీబీఐ ఎందుకు దాడులు చేపడుతోందంటూ వారికేం కావాలో అది తనను అడగవచ్చన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ చేతులు కలుపుతాయని ప్రకటించిన మరుక్షణమే యూపీ మాజీ సీఎం అఖిలేష్‌పై విచారణ చేపట్టవచ్చని సీబీఐ సంకేతాలు పంపడం ప్రకంపనలు రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment