సోషల్ మీడియాపై సీపీఐ దృష్టి
ముంబై : సోషల్ మీడియాపై కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు సీపీఐ కసరత్తు చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో సోషల్ మీడియా చూపిన ప్రభావాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పార్టీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బాలచంద్ర కాంగో బుధవారం ఇక్కడ తెలిపారు. ఇందులో భాగంగా ముంబైలో ఈ నెల 25న సోషల్‌మీడియా కార్యకర్తల కోసం రాష్ట్రస్థాయి వర్క్‌షాపును నిర్వహించనున్నట్లు తెలిపారు.
సోషల్ మీడియాతో యువత ప్రభావితమవుతోందని, అందుకే ఆధునిక ఆలోచనలతో కూడిన పార్టీ కార్యక్రమాలను ఈ మీడియా ద్వారా తెలియజేయనున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా సామాజిక మార్పులో సోషల్ మీడియా కీలక భూమిక పోషించిందని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ముందుకుసాగుతున్నారని తెలిపారు.
పార్టీ పనివిధానం, సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయడంలో సరైన కార్యాచరణ లేక తమ నాయకత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నదని అన్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర శాఖ ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ తదితర సోషల్ మీడియా సైట్‌లను ప్రారంభించిందని చెప్పారు. యూ ట్యూబ్‌లో చానెల్ కూడా ప్రారంభించామని చెప్పారు. 25న నిర్వహించనున్న వర్క్‌షాపులో సోషల్ మీడియాను పార్టీ కార్యక్రమాలకు వేదికగా ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై కార్యకర్తలకు శిక్షణ ఇప్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.