ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌...లపైనే ఆశలు! | Political parties concentration on Social media | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌...లపైనే ఆశలు!

Published Wed, Apr 2 2014 3:17 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌...లపైనే ఆశలు! - Sakshi

ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌...లపైనే ఆశలు!

దేశంలో యువ ఓటర్లు భారీగా పెరిగిపోయారు. వారిని ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి.  అందులో భాగంగా పార్టీలు ఇపుడు సోషల్‌ మీడియానే నమ్ముకుంటున్నాయి. ఈ ఎన్నికలలో  ఇదే వారికి కలిసి వచ్చే మార్గంగా సర్వే సంస్ధలు చెబుతున్నాయి.  రాజకీయ నాయకులు కూడా నమ్ముతున్నారు.  ఐతే ఇవి ఎంత వరకు ఓట్లను రాల్చుతాయనేది ప్రధాన ప్రశ్న.
 
ఒకప్పుడు పార్టీలు  కార్యకర్తల్ని పెంచుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టేవి. వ్యయప్రయాసలకు ఓర్చేవి.  కానీ సోషల్ నెట్‌వర్క్‌ సైట్స్‌ పుణ్యమా అని ఇపుడు ట్రెండ్‌ మారింది. ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌.. లాంటి సోషల్‌ సైట్స్‌లో విరివిగా రాజకీయ నాయకులు విసురుతున్న ట్విట్లు, కామెంట్స్‌తో   వారికి ఫాలోవర్స్‌  పెరగడమే కాదు కొంత మంది మద్దతుదారులుగా మారుతున్నారని పార్టీలు చెపుతున్నాయి. కానీ ఈ ట్విట్స్  అన్ని వర్గాల ప్రజలను అకర్షిస్తాయా? అన్నది  ప్రశ్నేగానే మిగులుతోంది.  నరేంద్రమోడికి ట్విట్టర్‌లో 35 లక్షల మంది  ఫాలోవర్స్‌ ఉండగా, ఆమ్‌ ఆద్మీ  నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ను లక్షన్నర మంది ఫాలో అవుతున్నారు.  దీనికి  కారణం వాళ్ల  బలమైన  కామెంట్సే.

మొదటిసారిగా ఓటర్లుగా నమోదైనవారు మాత్రమే  ఈ సోషల్‌ సైట్స్‌లో  ఎక్కువగా రాజకీయ వార్తలు,  నాయకుల కామెంట్స్‌ను సెర్చ్‌ చేస్తున్నారని సర్వే సంస్ధలు చెపుతున్నాయి. అది కూడా కేవలం మెట్రో నగరాల్లోనే సోషల్‌ సైట్స్‌ క్యాంపేన్‌లకు  గుర్తింపు ఉంది.  గ్రామీణ ప్రాంతాల్లో సోషల్‌ సైట్స్ ప్రభావం అంతంత మాత్రమే.

 ఈ ఏడాది దేశంలో ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 81 కోట్ల 50 లక్షల మంది వరకు ఉన్నారు.  మొత్తం ఓటర్లలో 47 శాతం మంది 18-35 ఏళ్ల లోపు యువ ఓటర్లే ఉన్నారు. ఈసారి దాదాపు 15 కోట్ల మంది యువతీ యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదైనట్లు ఒక అంచనా. 2014లో వారు ఎవరి వైపు మొగ్గితే వారిదే విజయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతి మూడో ఓటరూ 30 ఏళ్ల లోపు వ్యక్తే.  మొత్తం ఓటర్లలో ఇందులో 20 శాతం మంది తొలిసారి ఓటేస్తున్న వారే. వీరిలో చాలా మందికి  సోషల్‌ నెట్‌వర్క్‌తో కనెక్షన్‌ ఉంది. ఇప్పుడు పార్టీల టార్గెటంతా వీళ్లే. యూత్‌తో కనెక్ట్‌ అయ్యేందుకు స్ట్రాంగ్‌ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యానాలతో  ఆకర్షించేందుకు  తెగపోటీలు పడుతున్నారు.  రాజకీయ పార్టీలు ఆ రకమైన ప్రయత్నాలలో తలమునకలై ఉన్నాయి. ఎన్నికల ఫలితాలపై ఈ సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.

s.nagarjuna@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement