సోషల్ మీడియాకు ఓట్లు రాలేనా?
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? సోషల్ మీడియాకు ఓట్లు రాలుతాయా? ఎవరేమనుకున్నా రాజకీయ పార్టీలు మాత్రం సోషల్ మీడియా మంత్రాన్నే పఠిస్తున్నాయి. బీజేపీ ప్రధానమంత్రి పదవి అభ్యర్థి నరేంద్ర మోడీ నుంచి వార్డు కౌన్సిలర్ వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను తమ ప్రధాన ఆయుధంగా భావిస్తున్నారు. 18 ఏళ్ల పిల్లల దగ్గర్నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు అందరికీ ఫేస్బుక్ అకౌంట్లు ఉన్న రోజులివి. దాంతో, అలాంటి మాధ్యమాల ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. సర్వే సంస్థలు కూడా సోషల్ మీడియాకు అగ్రతాంబూలం ఇస్తున్నాయి. అయితే ఈ సోషల్ మీడియాతో ఓట్లు ఎంతవరకు రాలుతాయన్నదే అనుమానంగా కనిపిస్తోంది.
ఒకప్పుడు కార్యకర్తల బలాన్ని పెంచుకోవాలంటే పార్టీలు భారీగా శిబిరాలు పెట్టి, సభ్యత్వాలు సేకరించి నానా కష్టాలు పడేవి. కానీ ఇప్పుడు సోషల్ నెట్వర్క్ పుణ్యమాని పరిస్థితులు మారిపోయాయి. ట్విట్లర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ సైట్స్‌లో విరివిగా రాజకీయ నాయకులు విసురుతున్న ట్వీట్లు, కామెంట్లతో వారికి ఫాలోవర్స్ పెరగడమే కాదు.. మద్దతుదారులు కూడా బాగానే వస్తున్నట్లు పార్టీలు చెబుతున్నాయి. కానీ ఈ ట్వీట్లతో ఓట్లు రాలుతాయా అనేది మాత్రం అనుమానమే. ఎందుకంటే, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడికి ట్విట్టర్‌లో 35 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌ను లక్షన్నర మంది ఫాలో అవుతున్నారు. దీనికి కారణం వాళ్ల బలమైన కామెంట్లే. తొలిసారి ఓట్లు వేసేవాళ్లు మాత్రమే ఎక్కువగా ఈ సోషల్ సైట్లలో రాజకీయ వార్తలు, నాయకులు కామెంట్లను చూస్తున్నట్లు సర్వే సంస్ధలు చెబుతున్నాయి. అది కూడా కేవలం మెట్రో నగరాల్లోనే వీటికి ఎక్కువ గుర్తింపు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వీటి ప్రభావం అంతంత మాత్రమే.
ఈ ఏడాది ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 81.5 కోట్లు. ఇందులో 20 శాతం మంది తొలిసారి ఓటేస్తున్న వారే. వీరిలో చాలామందికి సోషల్ నెట్‌వర్క్‌తో కనెక్షన్ ఉంది. ఇప్పుడు పార్టీలన్నింటి టార్గెట్ వీళ్లే. వీరితో కనెక్ట్ అయ్యేందుకు పార్టీలు రకరకాల పిల్లిమొగ్గలు వేస్తున్నాయి. అవతలివాళ్ల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ఎలాగోలా అందరి దృష్టినీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.