సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: దీనిని బట్టి చెప్పొచ్చు రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకునేందుకు ఎంతగా ఆరాటపడుతున్నాయో. దీని ద్వారా వీలైనంత మంది కార్యకర్తలను సమీకరించుకుని తద్వారా పార్టీ విధానాలు, ఎదుటి పార్టీ లోపాలను ప్రజలకు వివరించే పనిలో పడ్డాయి. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ మాత్రమేకాదు ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ, జనసమితి, సీపీఐ వంటి పార్టీలు కూడా సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగించుకునేందుకు ఉద్యమంలా ముందుకు వెలుతున్నాయి. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఒకేసారి వేల మంది బూత్ ఏజెంట్లను ఉద్దేశించి మాట్లాడటానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
కేటీఆర్ ఆద్యుడు... ఆ తరువాత హరీశ్‌రావు..
ఐటీ మంత్రిగా కేటీ రామారావు రాష్ట్ర ప్రభుత్వం, తన శాఖలో చీమ చిటుక్కుమన్నా ట్వీట్ చేసేవారు. నాలుగేళ్ల క్రితం ఆయన అనుసరించిన ఈ మార్గం అప్పుడప్పుడు ప్రత్యర్థి పార్టీల వారికి నచ్చేది కాదు. అయితే, అప్పటి నుంచి ఆయన అనుసరిస్తున్న మార్గమే ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పార్టీల నేతలకు సరైన పంథాగా కనిపిస్తోంది. కేటీఆర్ తరువాత ఎక్కువగా ట్విట్టర్‌ను వాడే మంత్రుల్లో హరీశ్‌రావు ఉంటారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు ట్వీట్ ద్వారా ఒకేసారి లక్షల మందికి చేరేలా చూస్తుంటారు.
హరీశ్ పేరుతో ఫేస్‌బుక్ ఖాతాలో కూడా ఎప్పటికప్పుడు విషయాలను అప్ డేట్ చేస్తారు. ఇప్పుడు ఇది అన్ని పార్టీలకు పాకింది. కేటీఆర్ ట్వీట్లకు ఉత్తమ్ రీట్వీట్ ద్వారానే సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమం ద్వారా మరింత క్రియాశీలకంగా వ్యవహరించే మార్గాల గురించి రాజకీయ పార్టీలు ఐటీ నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ మాధ్యమాన్ని వినియోగించుకునేందుకు రూ.కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. అంతేకాదు ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్‌లో 5 వేలు.. అంతకంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వారిని గుర్తించి డబ్చిచ్చి మరీ వచ్చే ఎన్నికల కోసం వారిని వాడుకోవాలని పార్టీలు భావిస్తుండటం గమనార్హం.
గాంధీ భవన్‌లో ప్రత్యేక విభాగం...
టీపీసీసీ సామాజిక మాధ్యమాన్ని విరివిగా వాడుకునేందుకు భారీగానే ఖర్చు చేస్తోంది. దీని కోసం కొందరు ఐటీ నిపుణులను కూడా నియమించుకుంది. టీపీసీసీ అభిప్రాయాలు, పత్రికా ప్రకటనలు, మీడియా సమావేశాలు వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. జిల్లాల వారీగా పార్టీ సానుభూతిపరులను ఎంపిక చేసుకుని వారి ద్వారా అధికార పక్షం లోపాలు, హామీల అమలులో వైఫల్యాలు వంటి వాటిని ప్రచారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ‘సామాజిక మాధ్యమం విషయమై పార్టీని మరింత బాధ్యతాయుతంగా మార్చడానికి వీలుగా మా పార్టీ ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ ప్రణాళిక ప్రజలకు వివరించడానికి దీనిని వినియోగిస్తాం. మా అభిప్రాయం చెప్పడానికి టెలివిజన్ ఒక్కటే ముఖ్యమైన మాధ్యమం కాదని గుర్తించాం’అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు.
సామాజిక మీడియాను పట్టించుకోకపోతే తప్పు
మొదట్లో సామాజిక మాధ్యమంపై తెలంగాణ జన సమితి పెద్ద ఆసక్తి చూపలేదు. కానీ, రోజురోజుకు దీనికి పెరుగుతున్న డిమాండ్‌ను చూసి టీజేఎస్ ఇప్పుడు పూర్తిగా దానిపైనే ఆధారపడుతోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో కాని వాటి కోసం సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలియజేస్తోంది. దీని కోసం ఆ పార్టీ కూడా నిపుణులను ఏర్పాటు చేసుకుంది. ‘సామాజిక మీడియాను పట్టించుకోకపోవడం తప్పని కొద్ది రోజుల్లోనే మాకు అర్థమైంది. దీనిద్వారా అత్యంత వేగంగా ప్రజల్లోకి వెళ్లగలం అన్న విష యాన్ని ఇప్పుడు గమనించాం. ఇప్పుడు మాకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఎంత ముఖ్యమో సామాజిక మాధ్యమం అంతే’అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు.
సామాజిక మాధ్యమాన్ని వదలడం లేదు..
వామపక్షాలు సైతం సామాజిక మాధ్యమానికి ఆకర్షితులు కావడం విశేషం. సీపీఎం ఎప్పటి నుంచో ఈ ప్రచారానికి దిగినా సీపీఐ ఇటీవలే రంగప్రవేశం చేసింది. ఇప్పటిదాకా దీనిని వాడుకోకపోవడం వల్ల తాము చాలా కోల్పోయామని ఆ పార్టీ అంటోంది. ‘సామాజిక మీడియాను పట్టించుకోకపోవడం చాలా తప్పు. కేటీఆర్ ట్వీట్ల మీద ఆధారపడినప్పుడు మాలో కొందరం దానిని పిచ్చిపనిగా అనుకున్నం. కానీ, ఇప్పుడు సామాజిక మాధ్యమం జీవితంలో భాగమైపోయింది. చేతిలో ఫోన్ ఉంటే చాలు మనం చెప్పదలచుకున్నది క్షణాల్లో వేల మందికి చేరవేయవచ్చు. సామాజిక మాధ్యమం మీద కన్నెర్ర చేయడం కంటే.. దానిని అక్కున చేర్చుకోవడమే మేలు’అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.
మా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా వాటిని నేరవేర్చింది. ఇది నేను చెప్పడం కాదు, ఫేస్‌బుక్ వేదికగా చాలామంది మళ్లీ మేమే రావాలని కోరుకుంటున్నారు.
– ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్
మా అభిప్రాయం చెప్పడానికి టెలివిజన్ ఒక్కటే ముఖ్యమైన మాధ్యమం కాదని గుర్తించాం. సామాజిక మాధ్యమాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నాం.
– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సామాజిక మీడియాను పట్టించుకోకపోవడం తప్పని మాకు అర్థమైంది. దీని ద్వారా అత్యంత వేగంగా ప్రజల్లోకి వెళ్లగలమన్న విషయాన్ని తెలుసుకున్నాం.
– టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్
ఇప్పుడు సామాజిక మాధ్యమం జీవితంలో భాగమైపోయింది. చేతిలో ఫోన్ ఉంటే చాలు మనం చెప్పదలచుకున్నది క్షణాల్లో వేల మందికి చేరవేయవచ్చు.
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment