తదనంతరం సోషల్‌ మీడియా ఖాతాల పరిస్థితేంటి? | What is the status of social media accounts after person die? | Sakshi
Sakshi News home page

తదనంతరం సోషల్‌ మీడియా ఖాతాల పరిస్థితేంటి?

Published Mon, Sep 10 2018 12:19 AM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

What is the status of social media accounts after person die? - Sakshi

మహిపాల్‌ (28) 2015లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. అతడు జీవించి ఉండగా వినియోగించిన ఫేస్‌బుక్‌ ఖాతా ఇప్పటికీ అతడి పేరిటే కొనసాగుతోంది. మహిపాల్‌ అంత్యక్రియల ఫొటోలను అందులో పోస్ట్‌ చేశారు. వారసత్వంగా మహిపాల్‌ ఖాతాను ఆయన సోదరుడు నిర్వహిస్తున్నాడు. ఫేస్‌బుక్‌ వేదికగా మహిపాల్‌కు ఎందరో నివాళులు అర్పించారు.

ఫేస్‌బుక్‌ పేజీలో మహిపాల్‌ పేరు పక్కన ఆయన జ్ఞాపకార్థం అని సూచిస్తూ ‘రిమెంబరింగ్‌’ అనే పదం కనిపిస్తుంది. భౌతిక ఆస్తులకే కాదు, జీవించి ఉన్న సమయంలో ఏర్పాటు చేసుకున్న డిజిటల్‌ వేదికలు కూడా విలువైనవే. కనుక ఒకరి మరణానంతరం వారి సోషల్‌ మీడియా ఖాతాల పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా..? ఆస్తులపై హక్కుల బదలాయింపునకు విల్లు రాసినట్టే, డిజిటల్‌ ప్రాపర్టీలకు ఎవరో ఒకర్ని లెగసీ కాంటాక్ట్‌ (ఆస్తికి వీలునామా)గా నియమించుకోవడం లేదా విల్లు రాసుకోవడం ఇందుకు మార్గం. ఆ వివరాలు అందించే కథనమే ఇది.  


సోషల్‌ మీడియా వేదికలు, ఇతర డిజిటల్‌ సాధనాలకు లెగసీ కాంటాక్ట్‌ను నియమించుకోకపోవడం లేదా వాటికి సంబంధించి విల్లు రాయకపోయినట్టయితే వారి మరణానంతరం ఆ ఖాతాలను కుటుంబ సభ్యులు యాక్సెస్‌ చేసుకోవడం అంత సులభం కాదు. ఆ ఖాతాల లాగిన్‌ వివరాలు తెలియకపోతే, అందులోని సమాచారాన్ని పొందేందుకు కంపెనీలు అనుమతించవు. ఎందుకంటే అది నిబంధనలకు విరుద్ధం.

ఉన్న మార్గం ఒక్కటే... కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించి అనుమతి పొందడమే. అయితే ఇది కష్టమైన ప్రక్రియ అని సైబర్‌ చట్టాల్లో నిపుణుడైన న్యాయవాది దుగ్గల్‌ తెలిపారు.  గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్‌ తదితర సంస్థలన్నీ  యూజర్ల మరణానంతరం వారి ఖాతాలకు ఏమవుతుందన్న సమాచారాన్ని అందిస్తున్నాయి. వీటిలో కొన్ని ఖాతాల్ని యాక్సెస్‌ చేసుకునేందుకు లెగసీ కాంటాక్ట్‌ను నియమించుకునే వీలు కల్పిస్తున్నాయి.   

ఫేస్‌బుక్‌
మరణానంతరం యూజర్‌ ఖాతాను పూర్తిగా డిలీట్‌ చేసేయడం లేదా దాన్ని స్మారకంగా కొనసాగించుకునే అవకాశం కల్పిస్తోంది. జ్ఞాపకంగా ఖాతాను కొనసాగించుకోదలిస్తే జీవించి ఉన్నప్పుడే ఒకర్ని లెగసీ కాంటాక్ట్‌గా పేర్కొనాలి. ఒక్కసారి జ్ఞాపకార్థంగా ఖాతా మారిన తర్వాత పరిమిత యాక్సెస్‌కు మాత్రమే వీలుంటుంది. పోస్ట్‌లు షేర్‌ చేయడం, ప్రొఫైల్‌ పిక్చర్‌ మార్చుకోవడం, న్యూ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లకు స్పందించడం చేయవచ్చు. ఖాతా డిలీట్‌ చేసేయాలని అడిగే హక్కు కూడా ఉంటుంది.

ట్విట్టర్‌
ఓ ట్విట్టర్‌ యూజర్‌ మరణించినట్టయితే అతని కుటుంబ సభ్యుల్లో తర్వాతి వ్యక్తి నుంచి ఖాతాను డీయాక్టివేట్‌ చేయాలంటూ అభ్యర్థన వస్తే సంస్థ ఆమోదిస్తుంది. ఇందుకోసం కుటుంబ సభ్యుల్లో ఒకరు తమ గుర్తింపు ధ్రువీకరణలు, అలాగే, యూజర్‌ డెత్‌ సర్టిఫికెట్‌ చూపించాల్సి ఉంటుంది. అయితే మరణించిన వ్యక్తి ఖాతాను నిర్వహించేందుకు అనుమతించదు. లింక్డ్‌ఇన్, ప్రింట్‌రెస్ట్‌ సైతం ట్విట్టర్‌ తరహా పాలసీనే కలిగి ఉన్నాయి. గుర్తింపు ధ్రువీకరణలు పొందిన వెంటనే ఖాతా డీయాక్టివేట్‌ అవుతుంది.

మైక్రోసాఫ్ట్‌
మైక్రోసాఫ్ట్‌ సంస్థకు చెందిన ఎంఎస్‌ఎన్, లైవ్, అవుట్‌లుక్, హాట్‌మెయిల్‌ సంస్థలు మాత్రం ఒక వ్యక్తి తదనంతరం కూడా ఆయా ఖాతాల్ని కొనసాగించుకునే అవకాశం కల్పిస్తున్నాయి. వద్దనుకుంటే డిలీట్‌ చేసేసుకోవచ్చు. వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వడం ద్వారా కుటుంబ సభ్యులు యాక్సెస్‌ చేసుకునే అవకాశం ఇస్తున్నాయి.  

ఇన్‌స్టాగ్రామ్‌
ఫేస్‌బుక్‌ మాదిరే ఇన్‌స్టాగ్రామ్‌ నిబంధనలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఓ వ్యక్తి మరణానంతరం అతని ఖాతాను స్మారకార్థంగా మార్చాలని లేదా డిలీట్‌ చేయాలని కోరే వీలుంది.

గూగుల్‌
గూగుల్‌కు చెందిన జీమెయిల్, గూగుల్‌ ప్లస్, యూట్యూబ్‌కు సంబంధించి తమ తదనంతరం అందులోని కంటెంట్‌ ఏమవుతుందో యూజర్లు తెలుసుకుని ఉండడం అవసరమే. మూడు నుంచి పద్దెనిమిది నెలల పాటు డీయాక్టివేట్‌ కాల వ్యవధిని నిర్ణయించుకోవచ్చు. అంటే ఓ వ్యక్తి 12 నెలలని నిర్ణయించుకున్నారనుకోండి. 12 నెలల పాటు ఖాతాను యాక్సెస్‌ చేయకుండా ఉండిపోతే అది ఇన్‌యాక్టివ్‌గా మారిపోతుంది.

ఈ వేచి ఉండే కాలం తర్వాత ఖాతాను డిలీట్‌ చేసేయడం లేదా అందులోని సమాచారాన్ని ఒకరి నుంచి పది మంది యూజర్లతో షేర్‌ చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఏ సమాచారం వారికి చేరవేయాలో కూడా నిర్ణయించుకునే స్వేచ్ఛమీదే. ఇన్‌యాక్టివ్‌గా మారిన మూడు నెలల తర్వాత ఖాతా డిలీట్‌ ఆప్షన్‌ అమల్లోకి వస్తుంది.   ఒకవేళ ఓ యూజర్‌ తన తదనంతరం ఎవర్నీ లెగసీ కాంటాక్టుగా పేర్కొనకపోతే కుటుంబ సభ్యులు వారసత్వ ధ్రువీకరణ పత్రంతో ఆయా సంస్థలను సంప్రదించాల్సి ఉంటుంది. లేదా కోర్టును ఆశ్రయించి ఆయా ఖాతాల్లోని డేటాను పొందే హక్కు ఉంటుంది.

అయితే, ఇందుకు చాలా సమయం తీసుకుంటుంది. అందుకే ఇతర భౌతిక ఆస్తుల మాదిరిగానే డిజిటల్‌ కంటెంట్‌కు సంబంధించి కూడా జీవించి ఉన్నప్పుడు వీలు రాసుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్‌ రూపంలో లేదా పేపర్‌పైనా విల్లు రాసుకునే స్వేచ్ఛ ఉంది. రెండింటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు ఒకటే. విల్లు రాయడంతోపాటు ఆ వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయడం, దాన్ని ఎక్కుడ భద్రపరుస్తున్నదీ సమాచారం అందించడం కీలకం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement