బీజింగ్: ఆన్లైన్ మీడియా వెబ్సైట్లపై ఉన్న తీవ్రమైన ఆంక్షలను చైనా కొంతవరకు సడలించింది. ఇప్పటివరకు చైనా ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్లకు స్వతహాగా రిపోర్టింగ్, ఇంటర్వ్యూలను నిర్వహించుకునే అధికారం లేదు. తాజాగా ఈ నిబంధనలలో మార్పులు తీసుకొచ్చారు. సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా( సీఏసీ), స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ సంస్థలు 14 మేజర్ న్యూస్ వెబ్సైట్లలో పనిచేసే 594 మంది రిపోర్టర్లకు శుక్రవారం అనుమతి కార్డులను జారీ చేశాయి. కానీ కొన్ని పరిమితమైన వెబ్సైట్లకు మాత్రమే ఈ అధికారాన్ని కల్పించి ప్రభుత్వం తన గుత్తాధిపత్యాన్ని నిలుపుకుంది.
ఇక నుండి ఆన్లైన్ మీడియా రిపోర్టర్లు స్వతంత్రంగా తమ రిపోర్టింగ్ వ్యవహారాలను నిర్వహించుకోవచ్చని సీఏసీ స్పోక్స్ పర్సన్ జియాంగ్ జున్ తెలిపారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఆన్లైన్ మీడియాపై నియంత్రణ తొలగించాలనే డిమాండ్ తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా నిర్ణయంతో గతంలో ఉన్నటువంటి సాంప్రదాయక మీడియా నుండి తీసుకున్న సమాచారాన్నే తర్జుమా చేసే విధానం మారబోతుంది. స్వతహాగా రిపోర్టింగ్ నిర్వహించుకునే వెసులుబాటు కలుగడంతో ఆన్లైన్ న్యూస్ మీడియాకు కొంత స్వేచ్ఛ లభించినట్లయింది.
ఆన్లైన్ మీడియాపై ఆంక్షలు సడలించిన చైనా
Published Fri, Nov 6 2015 6:37 PM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM
Advertisement