ధీమాగా ఆన్‌లైన్ బీమా... | Online insurance as confidence | Sakshi
Sakshi News home page

ధీమాగా ఆన్‌లైన్ బీమా...

Published Sun, Jul 27 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

ధీమాగా ఆన్‌లైన్ బీమా...

ధీమాగా ఆన్‌లైన్ బీమా...

ఆన్‌లైన్ మాధ్యమంపై అవగాహన పెరుగుతుండటంతో ఈ తరహా జీవిత బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. సులభంగా, వేగవంతంగా, పారదర్శకంగా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ఆఫ్‌లైన్ మాధ్యమంతో పోలిస్తే చౌకగా లభించే ఆన్‌లైన్ పాలసీలవైపు మొగ్గు చూపే వారు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్ లో బీమా పాలసీలు కొనుగోలు చేసేటప్పుడు .. విధిగా తెలుసుకోవాల్సిన నాలుగు ప్రధాన అంశాల గురించి వివరించేది ఈ కథనం.

 జీవిత బీమా పాలసీ తీసుకోవడంలో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. మన ఆర్థిక లక్ష్యాలు, వాటిని సాధించడం గురించి ఇన్వెస్ట్‌మెంట్ ఏజెంటుతోనో లేదా ఫైనాన్షియల్ ప్లానర్‌తోనో సుదీర్ఘంగా చర్చించాల్సి ఉంటుంది. వివిధ పాలసీలను పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది. బోలెడంత సమాచారంతో కూడిన బ్రోచర్లను క్షుణ్నంగా చదవాల్సి ఉంటుంది. చిట్టచివరికి మన అవసరాలకు తగిన పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది.

అనేక సంవత్సరాలుగా బీమా పాలసీల విక్రయం ఇలాగే ఉంటోంది. ఇంత సుదీర్ఘమైన ప్రక్రియను ఆన్‌లైన్‌లో సింపుల్‌గా తేల్చేయడమన్నది సాధారణంగా ఊహకందని విషయం. విమానం టికెట్లో, సినిమా టికెట్లో తీసుకున్నట్లు ఆన్‌లైన్లో బీమా పాలసీలను కూడా తీసేసుకోవచ్చంటే బోలెడన్ని సందేహాలు తలెత్తడం సహజం. అయితే, వీటిని నివృత్తి చేసేందుకు బీమా కంపెనీలు గట్టిగా కృషి చేస్తున్నాయి. కొంత మేర విజయవంతం అయ్యాయి కూడా. అయినప్పటికీ .. పాలసీదారులు తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.

అవేంటంటే..  వాస్తవాలు దాచిపెట్టొద్దు
 జీవిత బీమా పాలసీ అన్నది నమ్మకం మీద ఆధారపడిన కాంట్రాక్టు వంటింది. కాబట్టి పాలసీ తీసుకోవాలనుకునే వారు దరఖాస్తు చేసేటప్పుడే ముఖ్యమైన అంశాలేమీ దాచకుండా వెల్లడించడం చాలా కీలకమైన అంశం. ఉదాహరణకు.. పాలసీ తీసుకునే వ్యక్తికి అధిక రక్తపోటు ఉన్న పక్షంలో ఆ విషయాన్ని ముందుగానే వెల్లడించాలి.

 ఒకవేళ దీన్ని దాచిపెట్టి దరఖాస్తు చేసుకుంటే.. పాలసీదారు ఇచ్చిన వివరాల ఆధారంగా బీమా కంపెనీ పాలసీని ఇచ్చేసేయొచ్చు. కానీ, పాలసీదారు అకాలమరణం పాలైతే.. క్లెయిము విషయంలో వారి కుటుంబసభ్యులు సమస్యలు ఎదుర్కొనాల్సి రావొచ్చు. కాంట్రాక్టు కుదుర్చుకునేటప్పుడు పూర్తి వాస్తవాలు వెల్లడించలేదన్న కారణంతో క్లెయిమును తోసిపుచ్చడానికి బీమా కంపెనీకి పూర్తి అధికారాలు ఉంటాయి.

 కేవలం ఒకటో, అరో వాస్తవాలను వెల్లడించలేదన్న కారణంతో బీమా కంపెనీ.. క్లెయిమును నిరాకరించడం దారుణం అనిపించినప్పటికీ.. వాస్తవాలు తెలుసుకుంటే సబబే అనిపిస్తుంది. బీమా వ్యాపారాన్ని కాస్త క్షుణ్నంగా పరిశీలిస్తే.. రిస్కులను పరస్పరం పంచుకునేందుకు పాలసీదారులు ఏర్పాటు చేసుకునే వేదికే బీమా సంస్థ. క్లెయిములు వచ్చినప్పుడు ఈ సభ్యులంతా కలసి కట్టిన డబ్బు నుంచే చెల్లించాల్సి ఉంటుంది. కనుక, వాస్తవాలను దాచిపెట్టి క్లెయిములు పొందాలనుకునే వారి వల్ల ఇతర పాలసీదారులు నష్టపోకుండా ఉండేలా చూడటం అన్నది బీమా కంపెనీ బాధ్యత. దానికి అనుగుణంగానే ఆయా సంస్థలు వ్యవహరిస్తుంటాయి.
 
 ప్రీమియంల దగ్గరే ఆగిపోవద్దు
  ఆన్‌లైన్ మాధ్యమం వల్ల ఇతరుల ప్రమేయం లేకుండా కస్టమర్లు నేరుగా పాలసీలు తీసుకునే వీలుంటుంది. దీంతో, పంపిణీ ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయి. ప్రీమియాల తగ్గింపు రూపంలో ఆ ప్రయోజనాలు కస్టమర్‌కు అందుతాయి. ప్రస్తుతం చాలా జీవిత బీమా సంస్థలు పోటీపడి మరీ చౌక ప్రీమియంలతో ఆన్‌లైన్ టర్మ్ పాలసీలు అందిస్తున్నాయి. పొగాకు జోలికి పోని వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేక ప్రీమియం రేట్లు కూడా అందుబాటులోకి తెచ్చాయి. ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి. అలాగని కేవలం ప్రీమియంల దగ్గరే ఆగిపోవద్దు. క్లెయిముల చెల్లింపుల్లో కంపెనీ చరిత్ర, కంపెనీ బ్రాండ్ నేమ్, సర్వీసుల్లో నాణ్యత తదితర అంశాలన్నీ అధ్యయనం చేసిన తర్వాతే బీమా కంపెనీని, అది అందించే పాలసీని ఎంచుకోవాలి.
 
 వీలైనంత ముందుగా తీసుకోవాలి
 పాలసీలను ఎంత చిన్న వయసులో తీసుకుంటే అంత మంచిదన్నది బీమాకు సంబంధించిన ప్రాథమిక సూత్రం. సంపూర్ణ ఆరోగ్యవంతులై, వయసు తక్కువగా ఉన్నప్పుడు ప్రీమియంలూ తక్కువ  స్థాయిలోనే ఉంటాయి. అంతేగాకుండా.. చిన్న వయసులో ఉన్నప్పుడు సుదీర్ఘకాలానికి వర్తించే పాలసీని తీసుకునే వీలుంటుంది. ఉదాహరణకు సంపూర్ణ ఆరోగ్యవంతుడైన పాతికేళ్ల వ్యక్తి.. ఏటా కేవలం రూ. 8,000 చెల్లించి (సర్వీస్ ట్యాక్స్ అదనం) రూ. 1 కోటి మేర కవరేజీకి పాలసీ తీసుకోవచ్చు. అదే, ముప్పై అయిదేళ్ల వ్యక్తి ఇదే కవరేజీ తీసుకోవాలంటే ప్రీమియం రూ. 14,000 పైచిలుకు ఉంటుంది (30 సంవత్సరాల వ్యవధి పాలసీ).
 
 పన్ను ప్రయోజనాలే చూసుకోవద్దు
  జీవితంలో ఒక్కో దశలో ఆర్థిక అవసరాలు ఒక్కో విధంగా మారుతుంటాయి. కనుక, జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఏయే దశలో అవసరాలు ఎలా ఉంటాయి, ఎంత కవరేజీ అవసరమవుతుంది లాంటి అంశాల గురించి తెలుసుకోవాలి. దానికి తగ్గ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. అంతే తప్ప కేవలం పన్నులు ఆదా చేసుకునే దృష్టికోణంతో మాత్రమే పాలసీ తీసుకుంటే.. అది అవసరానికి ఉపయోగపడకుండా పోయే ప్రమాదముందని గుర్తుంచుకోవాలి.

 ఏదైతేనేం.. సులభతరంగా బీమా పాలసీలు తీసుకునేందుకు కంపెనీలు ఆన్‌లైన్ వేదికను అందుబాటులోకి తెచ్చాయి.  వీటిపై అవగాహన పెంచేందుకు అవి చేస్తున్న ప్రయత్నాలూ ప్రభావవంతంగానే ఉంటున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఆన్‌లైన్ పాలసీల రో జులు వచ్చేశాయి. ఇక, పాలసీదారుడు తన వంతుగా కీలకమైన విషయాలను దృష్టిలో ఉంచుకుని వివేకవంతమైన నిర్ణయం తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement