కుటుంబానికి బీమా ధీమా.. | A major benefit of any life insurance plan is that it provides financial security to your family members | Sakshi
Sakshi News home page

కుటుంబానికి బీమా ధీమా..

Published Mon, Oct 21 2024 12:29 AM | Last Updated on Mon, Oct 21 2024 2:21 PM

A major benefit of any life insurance plan is that it provides financial security to your family members

ఆర్జించే వ్యక్తికి కవరేజీ ఎంత ఉండాలి?

సమ్‌ అష్యూర్డ్, టర్మ్‌ ఎంపిక ఎంతో కీలకం

ఇది అందరికీ ఒకే విధంగా ఉండదు

తమ అవసరాలు, లక్ష్యాల ఆధారంగా నిర్ణయం

టర్మ్‌ప్లాన్‌తో మెరుగైన రక్షణ

ఇందులోనూ పలు రకాలు, రైడర్లు

 కోరుకున్నట్టుగా  పరిహారం చెల్లింపులు  

షణ్ముఖ్, నిత్య దంపతులకు ఇద్దరు పిల్లలు. షణ్ముఖ్‌ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నిత్య గృహిణి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేవు. సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం చిచ్చు పెట్టింది. షణ్ముఖ్‌ పేరిట లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు రెండున్నాయి. ఆ రెండింటి నుంచి వచ్చిన మొత్తం కేవలం రూ.15 లక్షలు. కుటుంబ జీవన అవసరాలకు ఈ మొత్తం చాలదని తెలియడంతో.. బాధను దిగమింగుకుని నిత్య ప్రైవేటు  ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది.

 జీవిత బీమా రక్షణ లేని వారు కొందరు  అయితే.. ఉన్నా తగినంత కవరేజీతో సరైన ప్లాన్‌ తీసుకోని వారే ఎక్కువ. ఇలాంటి వారికి షణ్ముఖ్‌ కేసు కనువిప్పు కలిగిస్తుంది. సరైన బీమా  పథకాన్ని, తగినంత కవరేజీతో తీసుకున్నప్పుడే దాని లక్ష్యం, ఉద్దేశం నెరవేరుతుంది. ఈ దిశగా అవగాహన కలి్పంచే కథనమే ఇది...

తమపై ఎవరైనా ఆరి్థకంగా ఆధారపడి ఉంటే, అలాంటి ప్రతి ఒక్కరూ జీవిత బీమా రక్షణను (పాలసీ) తప్పకుండా తీసుకోవాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భాల్లో వారి కుటుంబం జీవన అవసరాల కోసం ఆరి్థకంగా ఇబ్బందులు పడకుండా జీవిత బీమా పరిహారం సాయంగా నిలుస్తుంది. కానీ, ఇదంతా సరైన, సరిపడా రక్షణ తీసుకున్నప్పుడే అని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. తమ విలువైన జీవితంపై చేస్తున్న అసలైన పెట్టుబడిగా అర్థం చేసుకోవాలి.

కవరేజీ ఎంత?
ఏజెంట్‌ లేదా బ్రోకర్‌ చెప్పిన మేరకు లేదా ప్రీమియం తమకు సౌకర్యంగా అనిపించిన మేరకు జీవిత బీమా కవరేజీని ఎక్కువ మంది తీసుకుంటుంటారు. కానీ, ఇది సరైన విధానం కాదు. ఎంత లేదన్నా వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్ల మొత్తం జీవిత బీమా రక్షణగా తీసుకోవాలన్నది ప్రాథమిక సూత్రం. అలాగే, వార్షిక ఆదాయానికి 25 రెట్ల వరకు కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. 20 రెట్లు మధ్యస్థంగా ఉంటుంది. 

ఒకవేళ రుణాలు తీసుకుని ఉంటే ఆ మేరకు కవరేజీని అదనంగా ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.12 లక్షలు ఉంటే, కనీసం రూ.1.2 కోట్ల సమ్‌ అష్యూర్డ్‌తో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. ఇల్లు, కారు లేదా వ్యక్తిగత రుణాలు రూ.10 లక్షలు ఉన్నాయనుకుంటే.. అప్పుడు రూ.1.2 కోట్లకు బదులు రూ.1.3 కోట్లను ఎంపిక చేసుకోవాలి. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణించినట్టయితే బీమా సంస్థ చెల్లించే పరిహారంతో అప్పులు తీర్చి, మిగిలిన మొత్తంతో కుటుంబం సాఫీగా జీవించడానికి అవకాశం ఉంటుంది.

సరిపోతుందా..?
ఇంతకు ముందు ఉదాహరణలో వార్షిక ఆదాయం రూ. 12 లక్షలకు పది రెట్లు అంటే రూ.1.2 కోట్లకు టర్మ్‌ లైఫ్‌ ప్లాన్‌ తీసుకున్న తర్వాత.. పాలసీదారు మరణించినట్టయితే వచ్చే పరిహారం కుటుంబానికి సరిపోతుందా..? ఇక్కడ రూ.1.2 కోట్ల డిపాజిట్‌పై 6 శాతం వార్షిక రేటు ఆధారంగా వచ్చే మొత్తం రూ.7.2 లక్షలు మించదు. అంటే అప్పటి వరకు వచ్చిన వార్షికాదాయం కంటే తక్కువ. 

తమకు ఏదైనా జరిగినా.. ఎప్పటి మాదిరే కుటుంబ జీవనం సాఫీగా సాగిపోవాలంటే ఇక్కడ రూ. 2.4 కోట్లకు బీమా రక్షణను (సమ్‌ అష్యూర్డ్‌) తీసుకోవాలి. ఉదాహరణకు షణ్ముఖ్‌ వయసు 30 ఏళ్లు. ప్రస్తుత వార్షికాదాయం రూ.12 లక్షలకు 20 రెట్ల చొప్పున రూ.2.4 కోట్లకు టర్మ్‌ లైఫ్‌ కవరేజీ తీసుకున్నాడని అనుకుందాం. 40 ఏళ్లకు వచ్చే సరికి షణ్ముఖ్‌ వార్షికాదాయం రూ.24 లక్షలకు పెరిగింది. ఈ ప్రకారం చూస్తే పదేళ్ల క్రితం తీసుకున్న టర్మ్‌ ప్లాన్‌లో రక్షణ వార్షిక ఆదాయానికి పది రెట్లకు తగ్గిపోయిందని తెలుస్తోంది. 

వయసు పెరిగే కొద్దీ జీవితంలో బాధ్యతలు, ఖర్చులు పెరుగుతాయని తెలిసిందే. కనుక పెరుగుతున్న ఆదాయానికి, జీవన వ్యయాలకు అనుగుణంగా బీమా కవరేజీ కూడా పెరిగేలా చూసుకోవాలి. సొంతిల్లు, పిల్లలకు మెరుగైన విద్య అన్నవి తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమైన లక్ష్యాలు. ఇంటికి ఆధారమైన వ్యక్తి మరణించినప్పుడు వచ్చే పరిహారం కేవలం ఆ కుటుంబ జీవన అవసరాలే కాదు, ముఖ్యమైన జీవిత లక్ష్యాల సాకారానికీ తోడ్పాటునివ్వాలి. అందుకుని వాటికయ్యే వ్యయాలను కూడా కవరేజీని నిర్ణయించుకునే విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి.  

ఎప్పుడు తీసుకోవాలి..? 
‘‘వివాహం అయిన తర్వాత లేదా పిల్లలు కలిగిన తర్వాత టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవాలనే ధోరణి సరికాదు. ఎంత వీలైతే అంత ముందుగా టర్మ్‌ ప్లాన్‌ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. అంతేకాదు పాలసీ పూర్తి కాలానికి అదే కొనసాగుతుంది’’ అని ఆనంద్‌రాఠి ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌కు చెందిన దినేష్‌ దిలీప్‌ భోయ్‌ సూచించారు. వీలైనంత ముందుగా అంటే.. సంపాదన మొదలు పెట్టిన వెంటనే అని అర్థం చేసుకోవచ్చు. జీవితంలో స్థిరపడడంలో ఆలస్యమైన వారు.. కనీసం తమ సంపాదన మొదలైన మొదటి 30 రోజుల్లో అయినా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకోవడం మరిచిపోవద్దు. 

సాధారణంగా 18 సంవత్సరాల నుంచి 65 ఏళ్ల వయసు వారు టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవచ్చు. ఆలస్యం చేసిన కొద్దీ వయసుతోపాటు ప్రీమియం పెరుగుతుంది. పైగా నేటి రోజుల్లో చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌ తదితర సమస్యలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు జీవిత బీమా తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేసి, అనారోగ్య సమస్యలు పలకరించిన తర్వాత తీసుకోవాలంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఆరోగ్య వంతులతో పోలి్చతే ప్రీమియం 20–50 శాతం అధికంగా పడుతుంది. కొన్ని సందర్భాల్లో రిస్క్‌ మరీ ఎక్కువ ఉంటుందని బీమా సంస్థలు భావిస్తే బీమా కవరేజీని తిరస్కరించే అవకాశం కూడా లేకపోలేదు.

ఎంత కాలానికి? 
జీవిత బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఎంత వయసు వచ్చే వరకు ఈ రక్షణ ఉండాలన్నది కూడా ముఖ్యమైన అంశమే అవుతుంది. మనలో చాలా మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. ఎక్కువ మంది 20–25 ఏళ్ల కాలానికే రక్షణను ఎంపిక చేసుకుంటుంటారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కాలానికి జీవిత బీమా కవరేజీ తీసుకున్నారని అనుకుంటే.. అతడికి/ఆమెకు 50 ఏళ్లు వచ్చే సరికి ఆ రక్షణ ముగిసిపోతుంది. దీంతో అక్కడి నుంచి మళ్లీ కొంత కాలానికి మరో పాలసీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రీమియం భారంగా మారుతుంది. 

ప్లాన్‌ తీసుకునే నాటికి తమ వయసు ఎంతన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఎంతలేదన్నా రిటైర్మెంట్‌ వరకు (60 ఏళ్లు) జీవిత బీమా కవరేజీ ఉండాలి. కొందరికి ఆలస్యంగా వివాహం కావచ్చు. అంటే 30–45 ఏళ్ల మధ్యలో వివాహం చేసుంటే.. 60 ఏళ్లు వచ్చినా పిల్లలకు సంబంధించి, కుటుంబ బాధ్యతలు ఇంకా మిగిలి ఉంటాయి. పిల్లలకు కనీసం 23–25 ఏళ్ల వయసు వచ్చే వరకు అయినా తమకు టర్మ్‌ కవరేజీ ఉండేలా చూసుకోవడం సరైనది. రిటైర్మెంట్‌ నాటికి లేదా జీవితంలో అన్ని ముఖ్యమైన బాధ్యతలు తీరే నాటికి బీమా కవరేజీ ఉంటే సరిపోతుంది.

ఎలాంటి టర్మ్‌ ప్లాన్‌? 
టర్మ్‌ ప్లాన్‌ అంటే అచ్చమైన బీమా రక్షణతో కూడిన పాలసీ కదా? అన్న సందేహం రావచ్చు. అవును టర్మ్‌ ప్లాన్‌ ఉద్దేశంఅదే. కానీ, వినియోగదారుల ధోరణి, అంచనాలు, అవసరాలకు అనుగుణంగా ఇందులోనూ పలు రకాలు వచ్చాయి. సంప్రదాయ ఎండోమెంట్‌ ప్లాన్లలో బీమా రక్షణతోపాటు, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నా కానీ రాబడి ప్రయోజనం లభిస్తుంది. అంటే అది బీమా, పెట్టుబడి కలిసిన సాధనం. 

టర్మ్‌ ప్లాన్‌ ఎలాంటి రాబడి ఇవ్వని.. కేవలం మరణించిన సందర్భాల్లోనే (పాలసీ కాల వ్యవధిలో) పరిహారం చెల్లించేది. కానీ, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి జీఎస్‌టీ మినహాయించి మిగిలిన మొత్తాన్ని వెనక్కిచ్చే టర్మ్‌ ప్లాన్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ విత్‌ రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం (టీఆర్‌వోపీ)గా దీన్ని పిలుస్తారు.  

లెవల్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌: ఇది అందరికీ తెలిసిన ప్లాన్‌. కాల వ్యవధి పూర్తయ్యే వరకు కవరేజీ స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల కవరేజీతో ప్లాన్‌ తీసుకుంటే, కాల వ్యవధి ముగిసే వరకు రూ.50 లక్షల కవరేజీయే కొనసాగుతుంది. 
ఇంక్రీజింగ్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌: ఇందులో సమ్‌ అష్యూర్డ్‌ స్థిరంగా ఉండదు. నిరీ్ణత కాలానికోసారి పెరుగుతూ పోతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం నుంచి పరిహారానికి హెడ్జింగ్‌ లభిస్తుంది. అంతేకాదు పెరిగే వయసుకు తగ్గట్టు బాధ్యతలు కూడా అధికమవుతుంటాయి. ఈ విధంగానూ అదనపు రక్షణ అక్కరకు వస్తుంది.  
డిక్రీజింగ్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌: ఇంక్రీజింగ్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. నిరీ్ణత కాలానికోసారి కవరేజీ తగ్గుతూ వెళుతుంది. ఉదాహరణకు ఏదైనా లోన్‌ తీసుకుని, దానికి రక్షణ కోసం టర్మ్‌ ప్లాన్‌ తీసుకున్నారని అనుకుందాం. కొంత కాలానికి రుణ భారం తగ్గిపోతుంది. దీనికి అనుగుణంగా బీమా రక్షణ తగ్గేలా ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది.   
కన్వర్టబుల్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌: ఇందులో టర్మ్‌ ప్లాన్‌ను ఎండోమెంట్‌ లేదా హోల్‌లైఫ్‌ పాలసీగా మార్చుకోవచ్చు.  
హోల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌: నూరేళ్ల కాలానికి ఈ ప్లాన్‌లో రక్షణ లభిస్తుంది.  

నోట్‌: టర్మ్‌ ప్లాన్‌లో ఎన్ని రకాలున్నా.. అచ్చమైన టర్మ్‌ ప్లాన్‌ (లెవల్‌ టర్మ్‌ఇన్సూరెన్స్‌) సులభమైనది. మిగిలిన వాటిల్లో తమకు ఏదైనా మరింత ప్రయోజనం అనిపిస్తే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. లెవల్‌ టర్మ్‌ ప్లాన్‌లో కాల వ్యవధి ముగిసే వరకు ప్రీమియం మారదు. ఇంక్రీజింగ్‌ టర్మ్‌ ప్లాన్‌లో, కన్వర్టబుల్, హోల్‌లైఫ్‌ ప్లాన్లలో ప్రీమియం అధికంగా ఉంటుంది. సాధారణ లెవల్‌ టర్మ్‌ ప్లాన్‌తో పోల్చితే రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం ప్లాన్‌లోనూ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది.  

రైడర్లు..
టర్మ్‌ ప్లాన్‌కు అనుబంధంగా పలు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి.  
క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌: కేన్సర్, కాలేయ వైఫల్యం తదితర 20 నుంచి 64 వరకు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు ఈ రైడర్‌ నుంచి ఏక మొత్తంలో పరిహారం లభిస్తుంది. ఈ రైడర్‌లో ఎన్నింటికి కవరేజీ అన్నది బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. 
వేవర్‌ ఆఫ్‌ ప్రీమియం: ప్రమాదంలో అంగవైకల్యం పాలైనా లేక తీవ్ర వ్యాధుల బారిన పడినా ఇక అక్కడి నుంచి పాలసీదారు ప్రీమియం చెల్లించే అవసరాన్ని ఇది తప్పిస్తుంది. బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి ప్రీమియం చెల్లిస్తుంది.  
యాక్సిడెంటల్‌ డెత్, టోటల్, పర్మనెంట్‌ డిజేబిలిటీ రైడర్‌: ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యం పాలైనా ఈ రైడర్‌లో ఎంపిక చేసుకున్న మేర పరిహారం పొందొచ్చు.  

పరిహారం చెల్లింపు ఎలా..? 
పాలసీదారు మరణించినప్పుడు పరిహారం చెల్లింపులో పలు ఆప్షన్లను టర్మ్‌ ప్లాన్లు ఆఫర్‌ చేస్తుంటాయి.  
→ ఎంపిక చేసుకున్న సమ్‌ అష్యూర్డ్‌ మొత్తాన్ని ఒకే విడత చెల్లించడం ఇందులో ఒకటి. 
→ సమ్‌ అష్యూర్డ్‌లో 50 శాతాన్ని ఏకమొత్తంగా చెల్లించి, మిగిలిన 50 శాతాన్ని సమాన వాయిదాల్లో కొన్ని సంవత్సరాల పాటు చెల్లించడం మరో ఆప్షన్‌. 
→ సమ్‌ అష్యూర్డ్‌లో కొంత మొత్తాన్ని ఒకే విడత చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలవారీగా పెంచుతూ చెల్లించడం మూడో ఆప్షన్‌.

చిట్కాలు
→ తగినంత కవరేజీ ఎంపిక చేసుకున్న తర్వాత.. అందుకు ఏటా చెల్లించే ప్రీమియం తమ సామర్థ్యం మేరకే ఉండేలా చూసుకోవాలి. ప్రీమియం చెల్లించలేనంత భారంగా మారకూడదు. ప్రీమియం చెల్లించలేక పాలసీ మధ్య లో లాప్స్‌ అయ్యే రిస్క్‌ ఉంటుంది. అందుకని తగినంత బీమా రక్షణ ఒక్కటే కాదు, తమ చెల్లింపుల సామర్థ్యాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.   
→ ఏదో ఒక కంపెనీ నుంచి పాలసీ తీసుకోవడం కాకుండా, వివిధ కంపెనీల మధ్య ఫీచర్లు, ప్రీమియం రేట్లను పరిశీలించి చూసుకోవాలి.  
→ టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు అనుబంధంగా వచ్చే రైడర్లు, యాడాన్‌లను తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా యాక్సిడెంటల్‌ డిజేబిలిటీ రైడర్‌ను తీసుకోవడం ఎంతో అవసరం.  
→ ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటే ప్రీమియంలో కొంత తగ్గింపు లభిస్తుంది.  
→ పెరుగుతున్న జీవన అవసరాలకు అనుగుణంగా, అదనపు రుణం తీసుకున్న ప్రతి సందర్భంలో ఆ మేరకు బీమా కవరేజీని పెంచుకోవాలి.  
→ ఎంపిక చేసుకునే బీమా సంస్థ, క్లెయిమ్‌లను ఏ మేరకు ఆమోదిస్తుందో తప్పకుండా పరిశీలించాలి. దీర్ఘకాలంలో మెరుగైన చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థను ఎంపిక చేసుకోవాలి.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement