సంపద వెలికితీద్దాం పదండి..! | Rs 6 lakh crore lying in unclaimed bank account and life insurance and mutual funds: How to get your money back | Sakshi
Sakshi News home page

సంపద వెలికితీద్దాం పదండి..!

Published Mon, Mar 17 2025 3:48 AM | Last Updated on Mon, Mar 17 2025 2:44 PM

Rs 6 lakh crore lying in unclaimed bank account and life insurance and mutual funds: How to get your money back

క్లెయిమ్‌ చేయని పెట్టుబడులు రూ.6 లక్షల కోట్లు 

బ్యాంక్‌ల్లో డిపాజిట్లు, కంపెనీల్లో వాటాలు 

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు 

పదేళ్లపాటు యాక్టివ్‌గా లేకపోతే అంతే 

పెట్టుబడిదారు సంరక్షణ నిధికి బదిలీ 

వాటి జాడ పట్టుకుంటే సొంతం చేసుకోవచ్చు

ఎప్పుడో పది, ఇరవై ఏళ్ల క్రితం బ్యాంకులో డిపాజిట్‌ చేసి మర్చిపోయారా..? తల్లిదండ్రులు లేదా పూర్వికుల పేరిట స్టాక్, మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు మరుగున పడి ఉన్నాయా?.. ఏమో ఎవరు చూసొచ్చారు. ఓసారి విచారిస్తేనే కదా తెలిసేది..! రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు క్లెయిమ్‌ లేకుండా, నిష్ప్రయోజనంగా ఉండిపోయినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో సుమారు రూ.78,200 కోట్లు బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.

ఫిజికల్‌ షేర్ల రూపంలో ఉన్న మొత్తం సుమారు రూ.3.8 లక్షల కోట్లు. రూ.36 వేల కోట్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో ఉంటే, క్లెయిమ్‌ చేయని డివిడెండ్‌లు రూ.5 వేల కోట్ల పైమాటే. ఉలుకూ, పలుకూ లేకుండా ఉండిపోయిన ఈ పెట్టుబడులకు అసలు యజమానులు ఎవరు, నిజమైన వారసులు ఎవరు?.. ఏమో అందులో మన వాటా కూడా ఉందేమో..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...      – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌  

కుటుంబ యజమాని తాను చేసిన పెట్టుబడుల వివరాలను జీవిత భాగస్వామితో పంచుకునే అలవాటు గతంలో అతి కొద్ద మందిలోనే ఉండేది. స్టాక్‌ మార్కెట్‌ ఆరంభంలో ఇన్వెస్ట్‌ చేసి, కాలం చేసిన వారి పేరిట పెట్టుబడుల వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు కూడా. ఇంట్లో ఆధారాలుంటే తప్పించి ఆయా పెట్టుబడుల గురించి తెలిసే అవకాశం లేదు. అవేవో పత్రాలనుకుని, పక్కన పడేసిన వారు కూడా ఉండొచ్చు.

లేదా భౌతిక రూపంలోని షేర్‌ సర్టీఫికెట్లు కనిపించకుండా పోవచ్చు. ఎక్కడో పెట్టి మర్చిపోవచ్చు. ఏళ్లకేళ్లకు క్లెయిమ్‌ లేకుండా ఉండిపోయిన పెట్టుబడులు ‘ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ అథారిటీ’ (ఐఈపీఎఫ్‌ఏ/పెట్టుబడిదారుల అక్షరాస్యత, సంరక్షణ నిధి)కు బదిలీ అయిపోతాయి. ఐఈపీఎఫ్‌ఏ కిందకు ఇలా చేరిపోయిన లిస్టెడ్‌ కంపెనీల షేర్ల విలువ ఎంతన్నది అధికారిక సమాచారం లేదు. సెబీ నమోదిత ‘ఫీ ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ ఎల్‌ఎల్‌పీ’ అంచనా ప్రకారం.. ఈ మొత్తం 2024 మార్చి నాటికి సుమారు రూ.77,033 కోట్లుగా ఉంటుంది.    

ఐఈపీఎఫ్‌ఏ కిందికి..
లిస్టెడ్‌ కంపెనీలకు సంబంధించి వాటాదారులు వరుసగా ఏడు సంవత్సరాలు, అంతకుమించి డివిడెండ్‌ క్లెయిమ్‌ చేయకపోతే కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 124 కింద ఆయా వాటాలను ఐఈపీఎఫ్‌ఏ కిందకు కంపెనీలు బదిలీ చేయాలి. గతంలో డివిడెండ్‌లు ఎన్‌క్యాష్‌ (నగదుగా మార్చుకోవడం) కాకపోవడం, చిరునామాలో మార్పులతో అవి కంపెనీకి తిరిగి వచ్చేవి. నేటి రోజుల్లో డీమ్యాట్‌ ఖాతాతో అనుసంధానమై ఉన్న బ్యాంక్‌ ఖాతా ఇనాపరేటివ్‌ (కార్యకలాపాల్లేని స్థితి)గా మారిన సందర్భాల్లో వాటాదారులకు డివిడెండ్‌ చేరదు. ఇలా పదేళ్ల పాటు కొనసాగితే, ఆయా వాటాలు ఐఈపీఎఫ్‌ఏ కిందకు వెళ్లిపోతాయి.   

గుర్తించడం ఎలా..? 
కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కింద ఐఈపీఎఫ్‌ఏ పనిచేస్తుంటుంది. అన్‌ క్లెయిమ్డ్‌ షేర్ల వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు వీలుగా gov. in/ login పోర్టల్‌లో డేటాబేస్‌ అందుబాటులో ఉంది. ఇన్వెస్టర్లు తమ మొబైల్‌ నంబర్, ఈమెయిల్‌ వివరాలతో రిజిస్టర్‌ చేసుకోవాలి. అనంతరం లాగిన్‌ అయి, పాన్‌ నంబర్‌ ఆధారంగా తమ పేరు, తమ తల్లిదండ్రులు, వారి పూర్వికులలో ఎవరి పాన్‌ నంబర్‌ లేదా పేరుమీద షేర్లు ఐఈపీఎఫ్‌ఏ కింద ఉన్నాయేమో పరిశీలించుకోవచ్చు.

ఒకవేళ ఐఈపీఎఫ్‌ఏకు ఇంకా బదిలీ కాకుండా, కంపెనీ వద్దే ఉండిపోయిన అన్‌క్లెయిమ్డ్‌ షేర్లు, డివిడెండ్‌ల వివరాలు కూడా పోర్టల్‌లో లభిస్తాయి. ఫోలియో నంబర్‌తోనూ చెక్‌ చేసుకోవచ్చు. దీనికంటే ముందు ఒకసారి ఇల్లంతా వెతికి ఒకవేళ భౌతిక పత్రాలుంటే, వాటిని డీమ్యాట్‌ చేయించుకోవడం సులభమైన పని. ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్‌ సంస్థలు ఇన్వెస్టర్లకు పాన్‌ నంబర్‌ ఆధారంగా కన్సాలిడేటెడ్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ (సీఏఎస్‌)ను నెలవారీగా పంపిస్తుంటాయి.

ఇన్వెస్టర్‌ ఈమెయిల్స్‌ను పరిశీలించడం ద్వారా వారి పేరిట పెట్టుబడులను తెలుసుకోవచ్చు. తమ తల్లిదండ్రులు లేదా సమీప బంధువు ఇటీవలి కాలంలో మరణించినట్టయితే, వారి పేరిట పెట్టుబడులను తెలుసుకునేందుకు మరో మార్గం ఉంది. వారి ఆదాయపన్ను రిటర్నులను పరిశీలిస్తే వివరాలు తెలియొచ్చు. ఎన్‌ఎస్‌డీఎల్‌ లేదా సీడీఎస్‌ఎల్‌కు లేఖ రాస్తూ, తమ వారి పేరిట ఉన్న పెట్టుబడుల సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. తాము వారికి చట్టబద్ధమైన వారసులమన్న రుజువును లేఖకు జత చేయాలి.   

రికవరీ ఎలా..? 
ఐఈపీఎఫ్‌ఏ నుంచి షేర్లు, డివిడెండ్‌ను రికవరీ చేసుకోవడానికి కొంత శ్రమించక తప్పదు. ‘షేర్‌ సమాధాన్‌’ వంటి కొన్ని సంస్థలు ఫీజు తీసుకుని ఇందుకు సంబంధించి సేవలు అందిస్తున్నాయి. ఐఈపీఎఫ్‌ఏ వద్ద క్లెయిమ్‌ దాఖలు చేసి, షేర్లు, డివిడెండ్‌లను వెనక్కి తెప్పించుకోవడానికి చాలా సమయం పడుతుందని షేర్‌ సమాధాన్‌ చెబుతోంది.

ప్రస్తుతం క్లెయిమ్‌ ఆమోదం/తిరస్కారానికి ఆరు నెలల నుంచి మూడేళ్ల సమయం తీసుకుంటున్నట్టు షేర్‌ సమాధాన్‌ డైరెక్టర్‌ శ్రేయ్‌ ఘోషల్‌ తెలిపారు. కొన్ని కంపెనీలు, ఆర్‌టీఏలు ఈ విషయంలో మెరుగ్గా స్పందిస్తుంటే.. కొన్నింటి విషయంలో ఒకటికి రెండు సార్లు సంప్రదింపులు నిర్వహించాల్సి వస్తున్నట్టు చెప్పారు. ఏదైనా కంపెనీలో వాటాలున్నట్టు గుర్తించి, అవి ఇంకా ఐఈపీఎఫ్‌ఏ కిందకు బదిలీ కాకపోతే.. కంపెనీ ఆర్‌టీఏను సంప్రదించాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను సమర్పించి, వాటిని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 

డీమ్యాట్‌ చేసుకోవాలి..? 
2019 ఏప్రిల్‌ నుంచి షేర్ల క్రయ, విక్రయాలకు అవి డీమ్యాట్‌ రూపంలో ఉండడాన్ని సెబీ తప్పనిసరి చేసింది. వాటాదారులు మరణించిన కేసుల్లో వారి వారసుల పేరిట బదిలీకి మాత్రం మినహాయింపు ఉంది. ఇప్పటికీ పత్రాల రూపంలో షేర్లు కలిగి ఉంటే, ఆయా కంపెనీల ఆర్‌టీఏలను సంప్రదించి డీమెటీరియలైజేషన్‌ (డీమ్యాట్‌) చేయించుకోవాలి. షేర్‌ హోల్డర్‌ పేరు, ఫోలియో నంబర్‌ వివరాలతో ఆర్‌టీఏను సంప్రదిస్తే.. ఏయే పత్రాలు సమర్పించాలన్నది తెలియజేస్తారు.

నిబంధనల మేరకు దరఖాస్తును పూర్తి చేసి, కేవైసీ, ఇతర పత్రాలను జోడించి ఆర్‌టీఏకి పంపించాలి. దరఖాస్తును ఆమోదిస్తే, ధ్రువీకరణ లేఖను ఆర్‌టీఏ జారీ చేస్తుంది. అప్పుడు దీన్ని డీమ్యాట్‌ ఖాతా కలిగిన డిపాజిటరీ పార్టీసిపెంట్‌ (సీడీఎస్‌ఎల్‌/ఎన్‌ఎస్‌డీఎల్‌)కు సమర్పించిన అనంతరం షేర్లు జమ అవుతాయి. ఈ విషయంలో కొందరు బ్రోకర్లు, కన్సల్టెన్సీ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. వాటి సాయం తీసుకునే ముందు ఆయా సంస్థల వాస్తవికతను నిర్ధారించుకోవడం అవసరం.  

బ్యాంక్‌ డిపాజిట్లు.. 
బ్యాంక్‌ ఖాతాలో రెండేళ్లకు పైగా ఎలాంటి లావాదేవీ లేకపోతే అది ఇనాపరేటివ్‌గా మారిపోతుంది. ఖాతాదారు మరణించిన సందర్భంలో ఇలా జరగొచ్చు. అటువంటప్పుడు మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు నామినీ తన కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంక్‌ శాఖలో సమర్పించాలి. ఖాతాను మూసేసి, అందులోని బ్యాలన్స్‌ను నామినీకి బదిలీ చేస్తారు. ఒకవేళ నామినీ లేకపోయినప్పటికీ, ఇనాపరేటివ్‌ ఖాతాలో బ్యాలన్స్‌ రూ.25 వేల లోపు ఉంటే బ్యాంక్‌ స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చు.

అంతకుమించి బ్యాలన్స్‌ ఉంటే చట్టబద్ధమైన వారసులు (జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు/సోదరీమణులు) కోర్టుకు వెళ్లి సక్సెషన్‌ సర్టీఫికెట్‌ తెచ్చుకోవాలి. క్లెయిమ్‌ కోసం ఒకరికి మించి ముందుకు వస్తే, అప్పుడు ఇండెమ్నిటీ సర్టి ఫికెట్‌ను సైతం బ్యాంక్‌ కోరొచ్చు. డిపాజిట్‌ అయినా, ఖాతాలో బ్యాలన్స్‌ అయినా 10 ఏళ్లపాటు క్లెయిమ్‌ లేకుండా ఉండిపోతే, ఆ మొత్తాన్ని డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ ఫండ్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది. అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల వివరాలను తమ పోర్టల్‌లో అందుబాటులో ఉంచాలని ఆర్‌బీఐ గతంలో బ్యాంక్‌లను ఆదేశించింది. కనుక పేరు, పుట్టిన తేదీ, పాన్‌ తదితర వివరాలతో తమ పేరు, తమ వారి పేరిట డిపాజిట్లు ఉన్నాయేమో బ్యాంక్‌ పోర్టల్‌కు వెళ్లి పరిశీలించుకోవచ్చు. లేదంటే బ్యాంక్‌ శాఖకు వెళ్లి విచారణ చేయాలి.  

అన్‌క్లెయిమ్డ్‌ షేర్లు డీమ్యాట్‌ రూపంలో ఉంటే..?
అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా వాటిని తమ పేరిట బదిలీ చేయించుకోవచ్చు.
డీపీ వద్ద దరఖాస్తు దాఖలు చేయాలి.  

షేర్లు పత్రాల రూపంలో ఉంటే? 
విడిగా ప్రతి కంపెనీ ఆర్‌టీఏ వద్ద డీమెటీరియలైజేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. అవన్నీ కచ్చితమైనవని నిర్ధారించుకున్న తర్వాత, అప్పుడు డీమ్యాట్‌ ఖాతాకు బదిలీ అవుతాయి.  .

ఐఈపీఎఫ్‌ఏకు బదిలీ అయిపోతే..? 
వాటాలున్న ప్రతి కంపెనీ ఆర్‌టీఏ నుంచి ఎంటైటిల్‌మెంట్‌ లెటర్‌ను పొందాలి.  
ఐఈపీఎఫ్‌–5 ఈ–ఫారమ్‌ను ఐఈపీఎఫ్‌ఏ వద్ద దాఖలు చేయాలి. 
కంపెనీ ఆమోదం తర్వాత క్లెయిమ్‌ను ఐఈపీఎఫ్‌ఏ ఆమోదిస్తుంది. దాంతో షేర్లు అసలైన యజమానులు లేదా వారసులకు బదిలీ అవుతాయి.  
సర్వీస్‌ రిక్వెస్ట్‌ నంబర్‌ (ఎస్‌ఆర్‌ఎన్‌) జారీ అవుతుంది. దీని ఆధారంగా ఆయా కంపెనీల ఆర్‌టీఏ వద్ద 7–10 రోజుల్లోగా డాక్యుమెంట్లను సమర్పించాలి.

ఫండ్స్‌ పెట్టుబడుల సంగతి..? 
బ్యాంక్‌ డిపాజిట్లకు, బీమా పాలసీలకు మెచ్యూరిటీ ఉంటుంది. కానీ ఓపెన్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు అలాంటిదేమీ ఉండదు. అయినప్పటికీ పదేళ్లకు పైగా ఒక ఫోలియోపై ఎలాంటి లావాదేవీలు లేకుండా, కేవైసీ అప్‌డేట్‌ చేయకపోతే వాటిని అన్‌క్లెయిమ్డ్‌గా పరిగణించొచ్చు. డివిడెండ్‌ ఈల్డ్‌ ఫండ్స్‌కు సంబంధించి డివిడెండ్‌లు క్లెయిమ్‌ కాకపోయి ఉండొచ్చు.

చిరునామా, కాంటాక్ట్‌ వివరాలు మారిపోయి, ఇన్వెస్టర్‌ మరణించిన సందర్భాలు, బ్యాంక్‌ ఖాతా ఇనాపరేటివ్‌గా మారిపోయిన కేసుల్లోనూ ఇది చోటు చేసుకోవచ్చు. ఇలాంటి పెట్టుబడులను ఐఈపీఎఫ్‌ఏ కిందకు బదిలీ చేసినట్టయితే, షేర్ల మాదిరే నిర్దేశిత ప్రక్రియలను అనుసరించి వాటిని సొంతం చేసుకోవచ్చు. ఫండ్స్‌ పెట్టబడుల వివరాలను గుర్తించేందుకు క్యామ్స్, కే–ఫిన్‌టెక్‌ సాయం తీసుకోవచ్చు.

యాక్టివ్‌గా లేని ఫండ్స్‌ పెట్టుబడులను తెలుసుకునేందుకు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) ‘మిత్రా’ పేరుతో (ఎంఎఫ్‌ పెట్టుబడుల గుర్తింపు, రికవరీ) ఒక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. అప్పుడు, తమ పేరు, తమ వారి పేరిట ఉన్న ఫండ్స్‌ పెట్టుబడి వివరాలను సులభంగా గుర్తించొచ్చు.

ఇలా చేస్తే సమస్యలకు దూరం..
ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సంబంధించి (ట్రేడింగ్‌ ఖాతాకు అనుసంధానంగా ఉన్న) బ్యాంక్‌ ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవాలి. 
పెట్టుబడుల వివరాలను జీవిత భాగస్వామితో పంచుకోవాలి. లేదంటే ఒక డైరీలో అన్ని పెట్టుబడులు, ఆర్థిక వివరాలను నమోదు చేసి, ఇంట్లో భద్రపరచాలి.  
ప్రతి పెట్టుబడికి నామినీని నమోదు చేయాలి.  
వీలునామా లేదా ఎస్టేట్‌ ప్లానింగ్‌ చేసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో వారసులకు క్లెయిమ్‌ సమస్యలు ఎదురుకావు.  
చిరునామా, ఫోన్‌ నంబర్, బ్యాంక్‌ ఖాతా ఇలా కేవైసీకి సంబంధించి ముఖ్యమైన వివరాల్లో మార్పులు జరిగితే వెంటనే బ్యాంక్‌లు, మ్యూచువల్‌ ఫండ్స్, డీపీలు, బీమా కంపెనీల వద్ద అప్‌డేట్‌ చేసుకోవాలి.  

బీమా ప్రయోజనాలూ అంతే..
ఎల్‌ఐసీ సహా కొన్ని బీమా సంస్థల పరిధిలో మెచ్యూరిటీ (గడువు) ముగిసినా, ఎలాంటి క్లెయిమ్‌ చేయని పాలసీలు చాలానే ఉన్నాయి. ఒక పాలసీదారు పేరిట క్లెయిమ్‌ చేయని మొత్తం రూ.1,000కి మించి ఉంటే, ఆ వివరాలను తమ వెబ్‌సైట్లలో బీమా సంస్థలు ప్రదర్శించాలని ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. పాలసీదారు పేరు, పాలసీ నంబర్, పాన్, పుట్టిన తేదీ వివరాలతో వీటి గురించి తెలుసుకోవచ్చు. క్లెయిమ్‌ బ్యాంక్‌ డిపాజిట్ల మాదిరే ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement