Uday Reddy
-
ఆయనో పోలీస్ అధికారి.. పుట్టిన ఊరు కోసం ఆస్పత్రిని నిర్మించి..
ఆయనో పోలీస్ అధికారి.. ఉన్నతస్థాయి ఉద్యోగం.. అయినా గ్రామాల్లో పేదలకు కనీస వైద్యం అందించాలనేది ఆయన సంకల్పం. ఉద్యోగరీత్యా ఎక్కడ పనిచేసినా ఉద్యోగంతోపాటు సేవా కార్యక్రమాలను కొనసాగించడం ప్రవృత్తిగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఆయనే చౌటుప్పల్ ఏసీపీ నూకల ఉదయ్‌రెడ్డి. తాను ఎక్కడ పనిచేసినా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పనిచేసే ప్రాంతాల్లోనే కాదు.. తాను పుట్టిన ఊరు కోసం ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఆస్పత్రిని నిర్మించి ఆ గ్రామ పరిసరాల్లోని 12 గ్రామాలు,తండాలకు చెందిన పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. గ్రూప్–1, 2017 బ్యాచ్‌కు చెందిన నూకల ఉదయ్‌రెడ్డి మొదటగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పనిచేశారు. ఆ సమయంలో పేదలు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతుండేవారు. కడుపునొప్పి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మెరుగైన వైద్యం చేయించుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలకు సంబంధించిన కేసులు తన దగ్గరకు వచ్చేవి. వాటిని విని చలించిపోయిన ఉదయ్‌రెడ్డికి అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. పేదలకు వైద్యసదుపాయం అందుబాటులోకి తేవాలని భావించారు. దాంతో అక్కడి గూడేలన్నీ తిరిగారు. ఆ సమయంలోనే ఓ పెద్ద మనిషి.. తనకు కళ్లు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియనంత అమాయకత్వంతో బతుకుతున్న గిరిజనులకు అండగా నిలవాలనుకున్నారు. వెంటనే హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి 300 మందిని అక్కడ చూపించారు. 50 మందికి ఆపరేషన్లు అవసరం ఉంటే చేయించారు. మిగిలిన 250 మందికి కళ్లద్దాలు ఇప్పించారు. ఆ తరువాత ఆదివాసిగూడేల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంతోపాటు అక్కడ యువతకు ఉద్యోగాల కోసం జాబ్ మేళాను నిర్వహించి 600 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించారు. అందులో అమేజాన్ లాంటి సంస్థల్లో ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారు. సొంతూరుపై మమకారంతో.. ఆ తరువాత చౌటుప్పల్ ఏసీపీగా వచ్చిన ఉదయ్‌రెడ్డి తాను పుట్టిన ఊరికి సేవ చేయాలనుకున్నారు. తాను పుట్టి పెరిగిన మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో ఆసుపత్రి లేదు. పరిసరాల్లోని 12 గ్రామాలదీ అదే పరిస్థితి. అక్కడివారంతా వైద్య సదుపాయం కోసం మిర్యాలగూడలోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. అత్యవసర సమయంలో వైద్యం అందక ఒక్కోసారి ప్రాణాలు పోతున్న దయనీయ పరిస్థితిని చూసిన ఉదయ్‌రెడ్డి అక్కడ ఆసుపత్రి నిర్మించాలనుకున్నారు. తమకున్న 380 గజాల స్థలంలో తన తండ్రి నూకల వెంకట్‌రెడ్డి చారిటబుల్ ట్రస్టు పేరుతో రూ.80 లక్షలతో ఆసుపత్రి నిర్మించారు. ప్రస్తుతం అందులో 35 రకాల పరీక్షలు చేయడంతోపాటు డాక్టర్‌ను నియమించి ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్‌తోపాటు ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు, ఇద్దరు నర్సులు, ఆయాలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రి నిర్వహణ, వారికి వేతనాలకు ప్రతి నెలా రూ.లక్షన్నర వెచ్చిస్తున్నారు. రూ.15 లక్షలతో పాఠశాల అభివృద్ధి పేదలకు సేవలందిస్తే మనకు వారి ఆశీర్వాదం ఉంటుందని, ఆరోగ్యంగా ఉంటామనే నమ్మకం ఉదయ్‌రెడ్డి కుటుంబానిది. ఆయన కుటుంబ సభ్యులు కూడా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. గ్రామంలో పాఠశాల కోసం ఆయన తాత నూకల నారాయణరెడ్డి 15 గుంటల భూమి దానం చేశారు. అందులో ఉన్న పాఠశాల భవనం ప్రస్తుతం పాడైపోవడంతో రూ.15 లక్షలతో బాగుచేయించారు. టాయిలెట్లు, విద్యుదీకరణ, పాఠశాలకు రంగులు, కిటికీలు, ఫ్యాన్లతోపాటు బేంచీలను ఏర్పాటు చేశారు. సేవలు విస్తరిస్తాం మున్ముందు వైద్య సేవలను విస్తరిస్తాం. ప్రతినెలా హైదరాబాద్ నుంచి ఐదుగురు స్పెషలిస్టు డాక్టర్లను తీసుకురావాలని సంకల్పించాం. ప్రస్తుతం మందులకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద నాస్ ల్యాబరేటరీస్ సహకారం అందిస్తోంది. పేదలకు ప్రాథమిక స్థాయిలో మంచి వైద్యం అందితే సెకండరీ వైద్యం అవసరం తక్కువ. ప్రాథమిక వైద్యానికి కూడా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే ఇక్కడ ఆ సేవలను అందిస్తున్నాం. వైద్య పరికరాలకు అయ్యే ఖర్చు మాత్రమే తీసుకుంటున్నాం. – నూకల ఉదయ్‌రెడ్డి, ఏసీపీ, చౌటుప్పల్ రిటైర్డ్ డీజీపీ సూచనతో సర్వేల్ స్కూల్ దత్తత సర్వేల్ స్కూల్లో చదివిన రిటైర్డ్ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచన మేరకు స్కూల్‌ను దత్తత తీసుకున్నారు. ఇప్పటికే ఆ స్కూల్లో జనరేటర్ ఏర్పాటు చేశారు. రూ.25లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆస్పత్రి ఏర్పాటుతో బాధలు తప్పాయి గ్రామంలో ఆస్పత్రి నిర్మించి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. చిన్న జబ్బు వచ్చినా మిర్యాలగూడకు వెళ్లాల్సిన బాధలు తప్పాయి. – జొన్నలగడ్డ భాగ్యమ్మ చిన్న జబ్బులన్నింటికీ ఇక్కడే చికిత్స చిన్న జబ్బులకు ఇక్కడనే చికిత్స అందుతోంది. పెద్ద జబ్బులు వస్తేనే మిర్యాలగూడకు వెళ్తున్నాం. గ్రామంలో ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో ఖర్చులు తగ్గాయి. – రాచమల్ల వెంకటయ్య -
ముగిసిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి సీబీఐ కస్టడీ..
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డిహత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల సీబీఐ కస్టడీ ముగిసింది. అనంతరం నాంపల్లి సీబీఐ కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం ఇద్దరిని నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 29 వరకు వైఎస్ భాస్కర్‌రెడ్డికి.. 26 వరకు ఉదయ్‌కు సీబీఐ కోర్టు జ్యూడిషియల్ రిమాండ్‌ను విధించింది. కోర్టు ఆదేశాలతో భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డిలను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు అధికారులు తరలించారు. -
ఫిషింగ్ కట్టడికి తాన్లా పరిష్కారం
బార్సిలోనా: ఈ–మెయిల్స్, మొబైల్‌కు సైబర్ నేరగాళ్లు పంపే లింక్స్‌ను ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్న ఘటనలు రోజూ చూస్తున్నాం. ఇలాంటి ఫిషింగ్ సందేశాలు సబ్స్క్రైబర్లకు చేరకుండా నిరోధించే టెక్నాలజీని క్లౌడ్ కమ్యూనికేషన్స్ సేవల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ తాన్లా ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లో పరీక్షలు జరుగుతున్నాయి. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్–2023 సందర్భంగా ఈ సాంకేతికతను ట్రాయ్ చైర్మన్ పి.డి.వాఘేలా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘యాంటీ–ఫిషింగ్‌కు పరిష్కారాన్ని భారత్‌లో అభివృద్ధి చేశాం. సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. తాన్లా యాంటీ–ఫిషింగ్ ప్లాట్‌ఫామ్ ఒక నిమిషంలో మోసాన్ని గుర్తిస్తుంది. ఈ సాంకేతికత కోసం అంతర్జాతీయంగా ఆసక్తి కనబరుస్తున్నారు’ అని తాన్లా ప్లాట్‌ఫామ్స్ ఫౌండర్, చైర్మన్, సీఈవో డి.ఉదయ్ రెడ్డి తెలిపారు. మోసగాళ్లను ఏరివేయడానికి నియంత్రణ సంస్థలకు ఇది సాయపడుతుందని అన్నారు. వాయిస్ కాల్ ఆధారిత మోసాలకు చెక్ పెట్టేందుకు సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దీనిని వచ్చే రెండు త్రైమాసికాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. 30 కోట్ల మందికి ముప్పు.. భారత్‌లో కంపెనీ అంచనాల ప్రకారం దాదాపు 30 కోట్ల మంది ఫిషింగ్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని ఉదయ్ రెడ్డి వెల్లడించారు. ‘వీరిలో 5 లక్షల మంది మోసపోయే చాన్స్ ఉంది. బాధితుల్లో 7% మంది మాత్రమే వివిధ కారణాల వల్ల నేరం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఫేక్ ఎలక్ట్రిసిటీ బిల్ అలర్ట్, నో యువర్ కస్టమర్ వెరిఫికేషన్ వంటి 10–11 పద్ధతుల్లో ఫిషింగ్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సిమ్, యాప్స్‌ను మోసగాళ్లు వేదికగా చేసుకుంటున్నారు. స్కామ్ సందేశాలు వినియోగదారులకు చేరకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఈ టెక్నాలజీని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతో మాత్రమే కాకుండా గూగుల్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్స్‌తో కూడా అనుసంధానించాం. ఫిషింగ్ సైట్స్‌ను నిరోధించే కొన్ని సర్వీస్ ఏజెన్సీలతో కూడా భాగస్వామ్యం చేసుకున్నాం’ అని వివరించారు. -
‘బ్లాక్‌చెయిన్’పై తాన్లా దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ సీపాస్ (కమ్యూనికేషన్ ప్లాట్‌ఫాం యాజ్ ఏ సర్వీస్) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్.. కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేకంగా బ్లాక్‌చెయిన్, ఆర్టీఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీ న్ లెర్నింగ్ (ఎంఎల్), క్రిప్టోగ్రఫీ తదితర అంశాల్లో ఆవిష్కరణల కోసం దీన్ని ఉపయోగించనుంది. సుమారు 92,000 చ.అ. విస్తీర్ణంలో దాదాపు రూ. 70 కోట్లతో ఈ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు క్యూ2 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ వ్యవస్థాపక చైర్మన్, సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. దీనికోసం 300 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్న ట్లు, మార్చి నాటి కల్లా ఇది అందుబాటులోకి రానున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి అందిస్తున్న వైజ్లీ ప్లాట్‌ఫామ్‌ను నాలుగో త్రైమాసికంలో అంతర్జాతీయ మార్కెట్లలో పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోందని ఉదయ్ రెడ్డి వివరించారు. దీనికి సంబంధించి ఒక అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ అడ్వైజరీ సర్వీసులు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గేమింగ్, ఫిన్‌టెక్‌తో సీపాస్కు ఊతం.. కొన్నాళ్లుగా నెలకొన్న పరిస్థితులతో డిజిటలైజేషన్ జోరందుకుందని, దీంతో సీపాస్ విభాగానికి మరింత ఊతం లభిస్తోందని ఉదయ్ రెడ్డి తెలిపారు. బ్యాంకింగ్, బీమా, ఎడ్టెక్, గేమింగ్, ఫిన్‌టెక్ తదితర విభాగాలు ఇందుకు గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ మొదలైన వాటి రూపంలో వినియోగదారులకు కంపెనీలు సందేశాలు పంపేందుకు అవసరమైన సీపాస్ సర్వీసులకు డిమాండ్ భారీగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఆటో–డెబిట్ నిబంధనల్లో మార్పులు వంటి నియంత్రణ సంస్థలపరమైన చర్యలు, వాట్సాప్ లాంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లకు కావాల్సిన సర్వీసులు మొదలైనవి సంస్థ వ్యాపార వృద్ధికి దోహదపడుతున్నాయని ఉదయ్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తాన్లా అవకాశాలను అందిపుచ్చుకుని, వేగంగా వృద్ధి చెందుతోందని ఉదయ్ రెడ్డి చెప్పారు. దేశీ రెవెన్యూ మార్కెట్లో తమ వాటా 45 శాతం పైగా ఉందని ఆయన వివరించారు. కోవిడ్ టీకాల విషయంలో ఓటీపీలు మొదలైనవి పంపేందుకు సంబంధించి ప్రభుత్వానికి కూడా తమ సంస్థ సరీ్వసులు అందిస్తోందని పేర్కొన్నారు. క్యూ2లో లాభం 67% జూమ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తాన్లా ప్లాట్‌ఫామ్స్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 67% ఎగిసి రూ. 136 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం రూ. 81 కోట్లు. ఆదాయం 44% వృద్ధితో రూ. 842 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 583 కోట్లు. ప్రస్తుత కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్ల చేరిక, మార్కెట్ వాటా పెంచుకోవడం తదితర అంశాల ఊతంతో ఇది సాధ్యపడిందని ఉదయ్ రెడ్డి వివరించారు. సమీక్షాకాలంలో కొత్తగా 87 కస్టమర్లు జతయ్యారని ఆయన పేర్కొన్నారు. క్యూ4లో 111 మంది ఉద్యోగులు చేరారు. పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ (ఈఎస్జీ) లక్ష్యాలకు సంబంధించి తెలంగాణ విద్యా శాఖతో తాన్లా ఫౌండేషన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
వైఎస్సార్సీపీలోకి ఉదయ్‌రెడ్డి
ఆల్విన్‌కాలనీ: ఏబీవీపీ మాజీ నాయకుడు బి.ఉదయ్‌రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.గత 20 ఏళ్లుగా ఏబీవీపీలో పనిచేసిన ఉదయ్‌రెడ్డి పలు సమస్యలపై పోరాటం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆశయాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్టు చెప్పారు. రాజన్న సువర్ణ యుగం రావాలంటే తిరిగి జగన్మోన్రెడ్డి నాయకత్వం అవసరమన్నారు. ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నవరత్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరి పుఫుల్లారెడ్డి తదితరులు ఉన్నారు. -
తాన్లా చేతికి కారిక్స్ మొబైల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లౌడ్ కమ్యూనికేషన్స్ కంపెనీ తాన్లా సొల్యూషన్స్... ముంబైకి చెందిన కారిక్స్ మొబైల్‌ను (గతంలో ఎమ్గేజ్ ఇండియా) ౖకైవసం చేసుకుంది. ఈ డీల్ ద్వారా కారిక్స్ అనుబంధ కంపెనీ యూనిసెల్ కూడా తాన్లా సొంతమవుతుంది. దీన్ని బ్లాక్‌స్టోన్‌కు చెందిన జీఎస్ఓ క్యాపిటల్ పార్ట్నర్స్ నుంచి రూ.340 కోట్లకు తాన్లా కొనుగోలు చేసింది. తాజా డీల్‌తో దేశంలోని ఎంటర్ప్రైస్ క్లౌడ్ కమ్యూనికేషన్స్ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా నిలుస్తామని తాన్లా సీఎండీ ఉదయ్ రెడ్డి వెల్లడించారు. ఈ డీల్ నగదు– ఈక్విటీ రూపంలో ఉంటుంది. రూ.112 కోట్ల నగదును తమ అంతర్గత వనరుల నుంచి సమీకరించి జీఎస్ఓ క్యాపిటల్‌కు తాన్లా అందజేస్తుంది. ఇక కారిక్స్కు చెందిన రూ.103 కోట్ల రుణాన్ని కూడా తాన్లా టేకోవర్ చేస్తుంది. మిగిలిన రూ.125 కోట్లకు గాను ఒక్కొక్కటీ రూ.56.79 చొప్పున తన ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. కారిక్స్ మొబైల్ తమకు వ్యూహాత్మకంగా చక్కగా పనికొస్తుందని, అధిక బిల్లింగ్ చేసే కస్టమర్లు, డైవర్సిఫికేషన్ సాధ్యమవుతాయని, సమర్థులైన టెక్నోక్రాట్లు కూడా తమకు జతవుతారని ఉదయ్ రెడ్డి వివరించారు. 18 ఏళ్లుగా మొబైల్ ఎంగేజ్మెంట్, కమ్యూనికేషన్ సేవలందిస్తున్న కారిక్స్కు దేశంలోని నాలుగు నగరాల్లో కార్యాలయాలతో పాటు బీఎఫ్ఎస్ఐ, డీటీహెచ్, ప్రభుత్వ, ఆటో, రిటైల్, ఎఫ్ఎంసీజీ,ఈ–కామర్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 1,500 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. 2017–18లో రూ.540 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. 250 మంది ఉద్యోగులున్నారు. -
తాన్లా సొల్యూషన్స్ లాభం రూ. 10 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తాన్లా సొల్యూషన్స్ నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 9.7 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇది రూ. 4.06 కోట్లు. తాజా క్యూ2లో ఆదాయం రూ. 106 కోట్ల నుంచి రూ. 135 కోట్లకు పెరిగింది. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో సేవలందించడంతో మెరుగైన ఫలితాలు సాధించగలిగామని సంస్థ సీఎండీ ఉదయ్ రెడ్డి తెలిపారు. మూడో త్రైమాసికంలో ఆదాయం రూ.144 కోట్ల నుంచి రూ.148 కోట్ల దాకా, లాభం రూ. 9.3 కోట్ల నుంచి రూ. 9.9 కోట్ల దాకా ఉండొచ్చని సంస్థ గెడైన్స్ ఇచ్చింది. పూర్తి ఆర్థిక సంవత్సర కాలానికి మొత్తం ఆదాయాలు రూ.509.7 కోట్ల నుంచి రూ. 532.8 కోట్ల దాకా, లాభం రూ. 32.6 కోట్ల నుంచి రూ. 35.1 కోట్ల దాకా ఉండగలవని కంపెనీ అంచనా. -
ఆన్ డిమాండ్ సినిమాల కోసం యప్‌ఫ్లిక్స్
ఇంటర్నెట్ ఆధారిత టీవీ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ యప్ టీవీ తాజాగా ఆన్ డిమాండ్ సినిమాల కోసం 'యప్ ఫ్లిక్స్'ను ప్రారంభించింది. ఇందులో 12 భారతీయ భాషల్లోని 5వేలకు పైగా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. కామెడీ, థ్రిల్లర్, రొమాన్స్, యాక్షన్, డ్రామా, భక్తి.. ఇలా అన్నిరకాల సినిమాలను తాము వినియోగదారులకు అందించనున్నట్లు యప్ టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల కోసం ఈ సేవలు అందిస్తున్నామన్నారు. తాజా హిట్ సినిమాలు అన్నింటినీ యప్ ఫ్లిక్స్ ద్వారా యూజర్లు చూసుకోవచ్చని ఆయన అన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయులకు ప్రాంతీయభాషల్లోని సినిమాలు చట్టబద్ధంగా చూసే అవకాశం తక్కువగా ఉంటుందని, ఇప్పటికే యప్ టీవీ ద్వారా వివిధ రకాల సేవలు అందిస్తున్న తాము.. తాజాగా యప్ ఫ్లిక్స్‌తో ఆన్ డిమాండ్ డిజిటల్ సినిమాలను కూడా అందిస్తామని చెప్పారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మళయాళం, పంజాబీ, బెంగాలీ... ఇలా అన్ని భాషలకు చెందిన సినిమాలు హై క్వాలిటీ డిజిటల్ కాపీలు అందుబాటులో ఉంటాయని ఉదయ్ రెడ్డి వివరించారు. -
యప్ టీవీ నుంచి.. 'బ్రియన్ లారా ఈజ్ నాటౌట్'
యప్ టీవీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ రోజు(శుక్రవారం) నుంచి క్రికెట్ లెజెండ్ బ్రియాన్ లారా నటించిన వెబ్ సిరీస్‌ను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి 'బ్రియన్ లారా ఈజ్ నాటౌట్' గా నామకరణం చేశారు. మొత్తం ఐదు ఎపిసోడ్లుగా రానున్న ఈ కార్యక్రమం కేవలం యప్ టీవీలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. యప్ టీవీ స్థాపకుడు, సీఈఓ ఉదయ్ రెడ్డి తొలిసారిగా మధుర శ్రీధర్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్మించారు. స్టార్ ఆటగాళ్లతో ఈ నెలలో జరగనున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో లారా ఆడనున్నారు. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెట్ దిగ్గజాలందరూ కలిసి తమ ఇష్టమైన క్రికెట్‌ని మళ్లీ అమెరికాలో జరగనున్న మ్యాచ్‌లలో ఆడనున్నారు. సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ రెండు టీంల మధ్య ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ వెబ్ సిరీస్‌లో లారా వ్యక్తిగత జీవితంతో పాటు, క్రికెట్ పై అతనికున్న ప్రేమ, క్రికెట్ ఆటపై మక్కువ ఉన్నవారికి ఆయన సూచనలు ఇవ్వనున్నారు. నలభై ఆరేళ్ల వయసులో స్టార్ మ్యాచ్‌లలో మళ్లీ క్రికెట్ ఆడటానికి మానసికంగా, శారీరకంగా ఏవిధంగా సన్నద్ధమయ్యాడో వివరించనున్నారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమాలను వీక్షించవచ్చు. యప్ టీవీ ఆప్ ద్వారా ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్ టీవీ, ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, బ్లూరే ప్లేయర్స్ లాంటి వాటిలో బ్రియాన్ లారా నాటౌట్ చూడొచ్చు. ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ 'బ్రియన్ లారా ఈజ్ నాటౌట్'.. యప్ టీవీ యూజర్స్ కోసం నాణ్యతతో రూపొందించిన మరో మంచి కార్యక్రమం అని అన్నారు. 'మరో సారి క్రికెట్ ఆడుతుండటం ఎంతో ఆనందంగా ఉంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడే అభిమానులు ఎక్కువగా నన్ను ఇష్టపడుతున్నారు. బ్రియాన్ లారా ఈజ్ నాటౌట్‌కు వస్తున్న భారీ స్పందన చూస్తే సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన యప్ టీవీకి, ఉదయ్ రెడ్డికి నా కృతజ్ఞతలు' అని బ్రియాన్ లారా అన్నారు. ప్రపంచంలో ఉన్న ఎందరో క్రికెటర్లకు బ్రియన్ లారా అదర్శప్రాయమని మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ వీడియో సిరిస్‌ను లారాతో రూపొందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, కర్టన్ రైజర్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. జార్జియాలోని అట్లాంటా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యప్ టీవీ 13 భాషల్లో 200కు పైగా టీవీ చానళ్లు, 5000 పైగా సినిమాలు, వందలాది టీవీ షోలు, లైవ్ ఈవెంట్స్ ఇంకా మరెన్నో అందిస్తోంది. -
మూడేళ్లలో.. రూ.600 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశాల్లో నివసిస్తున్న వారికి ఆన్లైన్ ద్వారా భారతీయ టీవీ ఛానల్స్‌ను అందిస్తున్న యప్‌టీవీ మరింత వేగంగా విస్తరించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం రూ.66 కోట్లుగా ఉన్న ఆదాయం వచ్చే మూడేళ్ళలో రూ.600 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యప్‌టీవీ ఫౌండర్ సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. వ్యాపార విస్తరణ కోసం ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, ఇందులో భాగంగా తొలిసారిగా ఏంజెల్ ఇన్వెస్టర్ శశిరెడ్డి 2.5 మిలియన్ డాలర్లు (రూ.15 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపారు. విస్తరణ, పెట్టుబడి వివరాలను తెలియచేయడానికి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీ విలువను రూ.160 కోట్లుగా మదింపు చేశారని, దీని ప్రకారం శశిరెడ్డికి 10 శాతం వాటాతో పాటు బోర్డులో సభ్యత్వం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి మరోసారి నిధులు సేకరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం యప్‌టీవీకి లక్ష లోపు ప్రీమియం చెల్లించే సభ్యులు ఉండటమే కాకుండా గతేడాది రూ.66 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. గత రెండేళ్లుగా ఆదాయం 100%పైగా పెరుగుతోందని, ప్రస్తుతం 170 భారతీయ ఛానెల్స్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ వీడియో వ్యాపారంలో అవకాశాలు బాగుండటంతో యప్టీవీలో సొంతగా ఇన్వెస్ట్ చేసినట్లు శశిరెడ్డి చెప్పారు. శ్రీ క్యాపిటల్ పేరుతో స్టార్ట్అప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి రూ.100 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను శశిరెడ్డి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అట్లాంటా కేంద్రంగా యప్‌టీవీ పనిచేస్తుండటంతో శ్రీ క్యాపిటల్ నుంచి కాకుండా సొంతంగా ఇన్వెస్ట్ శశి చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఇండియాలో రుసుము ఆధారిత కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. -
స్టార్ ప్లస్, లైఫ్ ఓకే ఛానెల్స్ ప్రారంభించిన యాప్ టీవీ
ప్రపంచ ప్రఖ్యాత యాప్ టీవీ యూఎస్‌లోని భారతీయ టీవీ ప్రేక్షకుల కోసం భారతీయ ఛానెళ్ల ప్రసారానికి శ్రీకారం చుట్టినట్లు యాప్ టీవీ ముఖ్యకార్యనిర్వహాణాధికారి ఉదయ్ రెడ్డి పేర్కొన్నారు. అందులోభాగంగా స్టార్ ప్లస్, లైఫ్ ఓకే హిందీ ఛానెల్స్ ప్రసారాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. శుక్రవారం ఉదయ్ రెడ్డి అట్లాంటాలో మీడియాతో మాట్లాడుతూ... యాప్ టీవీ ద్వారా యూఎస్‌లోని దక్షిణాసియా ప్రాంత వాసులంతా భారతీయ టీవీ సీరియళ్లను వీక్షించే అవకాశం కలుగుతుందని చెప్పారు. స్టార్ ప్లస్, లైఫ్ ఓకే చానెల్స్ రెండు పెయిడ్ ప్యాకేజీ కింద వీక్షించేందుకు యూఎస్‌లోని భారతీయ టీవీ ప్రేక్షకులకు అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా యాప్ టీవీ ఇప్పటికే తన ప్రసారాలను 170 ఛానెల్స్‌లను వివిధ భారతీయ భాషలలో ప్రసారం చేస్తున్నట్లు ఉదయ్ రెడ్డి వివరించారు. యూఎస్‌లో టీవీ ప్రేక్షకులకు భారతీయ టెలివిజన్ ఛానల్స్ అంటే అత్యంత ప్రీతి పాత్రమమని ఆయన గుర్తు చేశారు. యాప్ టీవీ ద్వారా ప్రసారాలను స్మార్ట్ టీవీలు, ఎస్టీబ్సీ, టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్, పీసీలు ద్వారా వీక్షించవచ్చని చెప్పారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా చూసే ప్రత్యేకత యాప్ టీవీ సొంతమని ఉదయ్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. -
యప్ టీవీ నుంచి లైవ్ కవరేజి సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రవాసీలు లక్ష్యంగా ఇంటర్నెట్ టీవీ సేవలు అందించే యప్‌టీవీ తాజాగా లైవ్ కవరేజి సర్వీసులను ప్రారంభించింది. కార్పొరేట్ ఫంక్షన్లు, వివాహాది శుభకార్యాలు మొదలైన వాటిని ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ మాధ్యమంలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ‘యప్‌టీవీ లైవ్’ సర్వీసులు ఉపయోగపడతాయని సంస్థ సీఈవో ఉదయ్ రెడ్డి శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో తెలిపారు. లైవ్ టెలికాస్ట్ మధ్యలో అంతరాయం కలగకుండా ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు వివరించారు. అలాగే, వీడియో ఆన్ డిమాండ్ సదుపాయం ద్వారా ఈ కార్యక్రమాలను సుమారు నెల రోజుల దాకా వీక్షించే వెసులుబాటు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన డివైజ్‌లను వీడియోగ్రాఫర్లకు అద్దెకు ఇవ్వనున్నట్లు, నెలవారీ అద్దె సుమారు రూ. 13,000 నుంచి ఉంటుందని (డేటా స్టోరేజి మొదలైనవన్నీ కలిపి) ఉదయ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఇది అందుబాటులో ఉండగలదన్నారు. వీడియోగ్రాఫర్లే కాకుండా.. ఈ సర్వీసులు పొందదల్చుకునే వినియోగదారులూ నేరుగా సంప్రదించవచ్చని చెప్పారు. యప్టీవీలో ప్రస్తుతం 170 పైగా టీవీ చానళ్లను అందిస్తున్నామని చెప్పారు. మొత్తం మీద వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల్లో 70-80 మిలియన్ డాలర్ల ఆదాయాలను అంచనా వేస్తున్నట్లు ఉదయ్ రెడ్డి వివరించారు.