మూడేళ్లలో.. రూ.600 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశాల్లో నివసిస్తున్న వారికి ఆన్‌లైన్ ద్వారా భారతీయ టీవీ ఛానల్స్‌ను అందిస్తున్న యప్‌టీవీ మరింత వేగంగా విస్తరించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం రూ.66 కోట్లుగా ఉన్న ఆదాయం వచ్చే మూడేళ్ళలో రూ.600 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యప్‌టీవీ ఫౌండర్ సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. వ్యాపార విస్తరణ కోసం ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, ఇందులో భాగంగా తొలిసారిగా ఏంజెల్ ఇన్వెస్టర్ శశిరెడ్డి 2.5 మిలియన్ డాలర్లు (రూ.15 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపారు.
విస్తరణ, పెట్టుబడి వివరాలను తెలియచేయడానికి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీ విలువను రూ.160 కోట్లుగా మదింపు చేశారని, దీని ప్రకారం శశిరెడ్డికి 10 శాతం వాటాతో పాటు బోర్డులో సభ్యత్వం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి మరోసారి నిధులు సేకరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం యప్‌టీవీకి లక్ష లోపు ప్రీమియం చెల్లించే సభ్యులు ఉండటమే కాకుండా గతేడాది రూ.66 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. గత రెండేళ్లుగా ఆదాయం 100%పైగా పెరుగుతోందని, ప్రస్తుతం 170 భారతీయ ఛానెల్స్‌ను అందిస్తున్నట్లు తెలిపారు.
ఆన్‌లైన్ వీడియో వ్యాపారంలో అవకాశాలు బాగుండటంతో యప్‌టీవీలో సొంతగా ఇన్వెస్ట్ చేసినట్లు శశిరెడ్డి చెప్పారు. శ్రీ క్యాపిటల్ పేరుతో స్టార్ట్‌అప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి రూ.100 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను శశిరెడ్డి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అట్లాంటా కేంద్రంగా యప్‌టీవీ పనిచేస్తుండటంతో శ్రీ క్యాపిటల్ నుంచి కాకుండా సొంతంగా ఇన్వెస్ట్ శశి చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఇండియాలో రుసుము ఆధారిత కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.