ఆయనో పోలీస్‌ అధికారి.. పుట్టిన ఊరు కోసం ఆస్పత్రిని నిర్మించి.. | - | Sakshi
Sakshi News home page

ఆయనో పోలీస్‌ అధికారి.. పుట్టిన ఊరు కోసం ఆస్పత్రిని నిర్మించి..

Published Sun, May 7 2023 7:20 AM | Last Updated on Sun, May 7 2023 7:28 PM

- - Sakshi

ఆయనో పోలీస్‌ అధికారి.. ఉన్నతస్థాయి ఉద్యోగం.. అయినా గ్రామాల్లో పేదలకు కనీస వైద్యం అందించాలనేది ఆయన సంకల్పం. ఉద్యోగరీత్యా ఎక్కడ పనిచేసినా ఉద్యోగంతోపాటు సేవా కార్యక్రమాలను కొనసాగించడం ప్రవృత్తిగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఆయనే చౌటుప్పల్‌ ఏసీపీ నూకల ఉదయ్‌రెడ్డి. తాను ఎక్కడ పనిచేసినా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పనిచేసే ప్రాంతాల్లోనే కాదు.. తాను పుట్టిన ఊరు కోసం ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఆస్పత్రిని నిర్మించి ఆ గ్రామ పరిసరాల్లోని 12 గ్రామాలు,తండాలకు చెందిన పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

గ్రూప్‌–1, 2017 బ్యాచ్‌కు చెందిన నూకల ఉదయ్‌రెడ్డి మొదటగా ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో పనిచేశారు. ఆ సమయంలో పేదలు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతుండేవారు. కడుపునొప్పి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మెరుగైన వైద్యం చేయించుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలకు సంబంధించిన కేసులు తన దగ్గరకు వచ్చేవి. వాటిని విని చలించిపోయిన ఉదయ్‌రెడ్డికి అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. పేదలకు వైద్యసదుపాయం అందుబాటులోకి తేవాలని భావించారు. దాంతో అక్కడి గూడేలన్నీ తిరిగారు. ఆ సమయంలోనే ఓ పెద్ద మనిషి.. తనకు కళ్లు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియనంత అమాయకత్వంతో బతుకుతున్న గిరిజనులకు అండగా నిలవాలనుకున్నారు. వెంటనే హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి 300 మందిని అక్కడ చూపించారు. 50 మందికి ఆపరేషన్లు అవసరం ఉంటే చేయించారు. మిగిలిన 250 మందికి కళ్లద్దాలు ఇప్పించారు. ఆ తరువాత ఆదివాసిగూడేల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంతోపాటు అక్కడ యువతకు ఉద్యోగాల కోసం జాబ్‌ మేళాను నిర్వహించి 600 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించారు. అందులో అమేజాన్‌ లాంటి సంస్థల్లో ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారు.

సొంతూరుపై మమకారంతో..
ఆ తరువాత చౌటుప్పల్‌ ఏసీపీగా వచ్చిన ఉదయ్‌రెడ్డి తాను పుట్టిన ఊరికి సేవ చేయాలనుకున్నారు. తాను పుట్టి పెరిగిన మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో ఆసుపత్రి లేదు. పరిసరాల్లోని 12 గ్రామాలదీ అదే పరిస్థితి. అక్కడివారంతా వైద్య సదుపాయం కోసం మిర్యాలగూడలోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. అత్యవసర సమయంలో వైద్యం అందక ఒక్కోసారి ప్రాణాలు పోతున్న దయనీయ పరిస్థితిని చూసిన ఉదయ్‌రెడ్డి అక్కడ ఆసుపత్రి నిర్మించాలనుకున్నారు. తమకున్న 380 గజాల స్థలంలో తన తండ్రి నూకల వెంకట్‌రెడ్డి చారిటబుల్‌ ట్రస్టు పేరుతో రూ.80 లక్షలతో ఆసుపత్రి నిర్మించారు. ప్రస్తుతం అందులో 35 రకాల పరీక్షలు చేయడంతోపాటు డాక్టర్‌ను నియమించి ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్‌తోపాటు ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్టు, ఇద్దరు నర్సులు, ఆయాలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రి నిర్వహణ, వారికి వేతనాలకు ప్రతి నెలా రూ.లక్షన్నర వెచ్చిస్తున్నారు.

రూ.15 లక్షలతో పాఠశాల అభివృద్ధి
పేదలకు సేవలందిస్తే మనకు వారి ఆశీర్వాదం ఉంటుందని, ఆరోగ్యంగా ఉంటామనే నమ్మకం ఉదయ్‌రెడ్డి కుటుంబానిది. ఆయన కుటుంబ సభ్యులు కూడా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. గ్రామంలో పాఠశాల కోసం ఆయన తాత నూకల నారాయణరెడ్డి 15 గుంటల భూమి దానం చేశారు. అందులో ఉన్న పాఠశాల భవనం ప్రస్తుతం పాడైపోవడంతో రూ.15 లక్షలతో బాగుచేయించారు. టాయిలెట్లు, విద్యుదీకరణ, పాఠశాలకు రంగులు, కిటికీలు, ఫ్యాన్లతోపాటు బేంచీలను ఏర్పాటు చేశారు.

సేవలు విస్తరిస్తాం
మున్ముందు వైద్య సేవలను విస్తరిస్తాం. ప్రతినెలా హైదరాబాద్‌ నుంచి ఐదుగురు స్పెషలిస్టు డాక్టర్లను తీసుకురావాలని సంకల్పించాం. ప్రస్తుతం మందులకు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద నాస్‌ ల్యాబరేటరీస్‌ సహకారం అందిస్తోంది. పేదలకు ప్రాథమిక స్థాయిలో మంచి వైద్యం అందితే సెకండరీ వైద్యం అవసరం తక్కువ. ప్రాథమిక వైద్యానికి కూడా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే ఇక్కడ ఆ సేవలను అందిస్తున్నాం. వైద్య పరికరాలకు అయ్యే ఖర్చు మాత్రమే తీసుకుంటున్నాం.
– నూకల ఉదయ్‌రెడ్డి, ఏసీపీ, చౌటుప్పల్‌

రిటైర్డ్‌ డీజీపీ సూచనతో సర్వేల్‌ స్కూల్‌ దత్తత
సర్వేల్‌ స్కూల్‌లో చదివిన రిటైర్డ్‌ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచన మేరకు స్కూల్‌ను దత్తత తీసుకున్నారు. ఇప్పటికే ఆ స్కూల్లో జనరేటర్‌ ఏర్పాటు చేశారు. రూ.25లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు.

ఆస్పత్రి ఏర్పాటుతో బాధలు తప్పాయి
గ్రామంలో ఆస్పత్రి నిర్మించి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. చిన్న జబ్బు వచ్చినా మిర్యాలగూడకు వెళ్లాల్సిన బాధలు తప్పాయి.
– జొన్నలగడ్డ భాగ్యమ్మ

చిన్న జబ్బులన్నింటికీ ఇక్కడే చికిత్స
చిన్న జబ్బులకు ఇక్కడనే చికిత్స అందుతోంది. పెద్ద జబ్బులు వస్తేనే మిర్యాలగూడకు వెళ్తున్నాం. గ్రామంలో ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో ఖర్చులు తగ్గాయి.
– రాచమల్ల వెంకటయ్య

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement