యప్ టీవీ నుంచి.. 'బ్రియన్ లారా ఈజ్ నాటౌట్'
యప్ టీవీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ రోజు(శుక్రవారం) నుంచి క్రికెట్ లెజెండ్ బ్రియాన్ లారా నటించిన వెబ్ సిరీస్ను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి 'బ్రియన్ లారా ఈజ్ నాటౌట్' గా నామకరణం చేశారు. మొత్తం ఐదు ఎపిసోడ్లుగా రానున్న ఈ కార్యక్రమం కేవలం యప్ టీవీలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. యప్ టీవీ స్థాపకుడు, సీఈఓ ఉదయ్ రెడ్డి తొలిసారిగా మధుర శ్రీధర్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్మించారు.
స్టార్ ఆటగాళ్లతో ఈ నెలలో జరగనున్న మూడు మ్యాచ్ల సిరీస్లో లారా ఆడనున్నారు. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెట్ దిగ్గజాలందరూ కలిసి తమ ఇష్టమైన క్రికెట్ని మళ్లీ అమెరికాలో జరగనున్న మ్యాచ్లలో ఆడనున్నారు. సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ రెండు టీంల మధ్య ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
ఈ వెబ్ సిరీస్లో లారా వ్యక్తిగత జీవితంతో పాటు, క్రికెట్ పై అతనికున్న ప్రేమ, క్రికెట్ ఆటపై మక్కువ ఉన్నవారికి ఆయన సూచనలు ఇవ్వనున్నారు. నలభై ఆరేళ్ల వయసులో స్టార్ మ్యాచ్లలో మళ్లీ క్రికెట్ ఆడటానికి మానసికంగా, శారీరకంగా ఏవిధంగా సన్నద్ధమయ్యాడో వివరించనున్నారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమాలను వీక్షించవచ్చు. యప్ టీవీ ఆప్ ద్వారా ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్ టీవీ, ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, బ్లూరే ప్లేయర్స్ లాంటి వాటిలో బ్రియాన్ లారా నాటౌట్ చూడొచ్చు. ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ 'బ్రియన్ లారా ఈజ్ నాటౌట్'.. యప్ టీవీ యూజర్స్ కోసం నాణ్యతతో రూపొందించిన మరో మంచి కార్యక్రమం అని అన్నారు.
'మరో సారి క్రికెట్ ఆడుతుండటం ఎంతో ఆనందంగా ఉంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడే అభిమానులు ఎక్కువగా నన్ను ఇష్టపడుతున్నారు. బ్రియాన్ లారా ఈజ్ నాటౌట్‌కు వస్తున్న భారీ స్పందన చూస్తే సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన యప్ టీవీకి, ఉదయ్ రెడ్డికి నా కృతజ్ఞతలు' అని బ్రియాన్ లారా అన్నారు.
ప్రపంచంలో ఉన్న ఎందరో క్రికెటర్లకు బ్రియన్ లారా అదర్శప్రాయమని మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ వీడియో సిరిస్ను లారాతో రూపొందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, కర్టన్ రైజర్కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. జార్జియాలోని అట్లాంటా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యప్ టీవీ 13 భాషల్లో 200కు పైగా టీవీ చానళ్లు, 5000 పైగా సినిమాలు, వందలాది టీవీ షోలు, లైవ్ ఈవెంట్స్ ఇంకా మరెన్నో అందిస్తోంది.