న్యూఢిల్లీ: కోర్టు విచారణల్లో పారదర్శకతకు మరో కీలక ముందడుగు పడింది. రాజ్యాంగ, జాతీయ ప్రయోజనాలున్న కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అనుమతించింది. కోర్టుల్లో పెట్టే కెమెరాలను సూర్యకాంతితో పోల్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. సూర్యుడి వెలుగు అత్యుత్తమ క్రిమిసహారిణి, ఈ కెమరాలు పారదర్శకత తెచ్చేందుకు సాయపడతాయని పేర్కొంది. ప్రయోగాత్మకంగా తొలుత జాతీయ, రాజ్యాంగ ప్రయోజనాలున్న కేసును రాజ్యాంగ ధర్మాసనాలు విచారిస్తున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారానికి అనుమతిస్తున్నామని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. వివాహ వివాదాలు, లైంగిక దాడుల వంటి సున్నితమైన కేసులను ఎప్పటికీ ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ అంశంలో జస్టిస్ మిశ్రా, జస్టిస్ ఖన్విల్కర్‌లు కలిసి ఒక తీర్పును, జస్టిస్ చంద్రచూడ్ మరో తీర్పును ఇచ్చినప్పటికీ, ఈ రెండు తీర్పుల సారాంశం దాదాపుగా ఒక్కటే.
10 నిమిషాలు ఆలస్యంగా..
కోర్టు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను కోర్టు నిర్దేశించింది. ప్రత్యక్ష ప్రసారాల కోసం ముందుగా విచారణ జరుపుతున్న కోర్టు అనుమతిని లిఖితపూర్వకంగా తీసుకోవాలి. పరిస్థితులకు తగ్గట్లుగా లేదా ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంలో విచారణ మధ్యలోనైనా ప్రత్యక్ష ప్రసారాలను నిలుపుదల చేసేందుకు కోర్టుకు అధికారం ఉంది. కోర్టులో జరుగుతున్న విచారణను నిర్దిష్ట సమయం (దాదాపు పది నిమిషాలు) ఆలస్యంగా ప్రసారం చేయాలని సూచించింది. బయటకు వెళ్లకూడని సమాచారం ఏదైనా ఉంటే దానిని ఎడిటింగ్‌లో తీసేసేందుకే ఈ ఏర్పాటు. ఏ కోణంలో కెమెరాలు ఉంచాలన్న దానిపైనా కోర్టు పరిమితులు విధించింది.
బహిరంగ కోర్టుల స్ఫూర్తితోనే..
బహిరంగ కోర్టుల స్ఫూర్తితోనే ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతిస్తున్నామనీ, దీని వల్ల కేసుకు సంబంధించిన సమాచారం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని జస్టిస్ చంద్రచూడ్ తీర్పులో పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని, విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ మరో అడుగు ముందుకేసే సమయం ఈ కోర్టుకు వచ్చిందని వివరించారు. జస్టిస్ మిశ్రా, జస్టిస్ ఖన్విల్కర్‌లకు కలిపి జస్టిస్ ఖాన్విల్కరే తీర్పు రాశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఇంగ్లండ్, జర్మనీ, ఐర్లాండ్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం ఉంది.
కోర్టు విచారణ: మరో కీలక ముందడుగు..
Published Thu, Sep 27 2018 3:49 AM | Last Updated on Thu, Sep 27 2018 9:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment