court trial
-
కోర్టు విచారణ: మరో కీలక ముందడుగు!
న్యూఢిల్లీ: కోర్టు విచారణల్లో పారదర్శకతకు మరో కీలక ముందడుగు పడింది. రాజ్యాంగ, జాతీయ ప్రయోజనాలున్న కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అనుమతించింది. కోర్టుల్లో పెట్టే కెమెరాలను సూర్యకాంతితో పోల్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. సూర్యుడి వెలుగు అత్యుత్తమ క్రిమిసహారిణి, ఈ కెమరాలు పారదర్శకత తెచ్చేందుకు సాయపడతాయని పేర్కొంది. ప్రయోగాత్మకంగా తొలుత జాతీయ, రాజ్యాంగ ప్రయోజనాలున్న కేసును రాజ్యాంగ ధర్మాసనాలు విచారిస్తున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారానికి అనుమతిస్తున్నామని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. వివాహ వివాదాలు, లైంగిక దాడుల వంటి సున్నితమైన కేసులను ఎప్పటికీ ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ అంశంలో జస్టిస్ మిశ్రా, జస్టిస్ ఖన్విల్కర్‌లు కలిసి ఒక తీర్పును, జస్టిస్ చంద్రచూడ్ మరో తీర్పును ఇచ్చినప్పటికీ, ఈ రెండు తీర్పుల సారాంశం దాదాపుగా ఒక్కటే. 10 నిమిషాలు ఆలస్యంగా.. కోర్టు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను కోర్టు నిర్దేశించింది. ప్రత్యక్ష ప్రసారాల కోసం ముందుగా విచారణ జరుపుతున్న కోర్టు అనుమతిని లిఖితపూర్వకంగా తీసుకోవాలి. పరిస్థితులకు తగ్గట్లుగా లేదా ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంలో విచారణ మధ్యలోనైనా ప్రత్యక్ష ప్రసారాలను నిలుపుదల చేసేందుకు కోర్టుకు అధికారం ఉంది. కోర్టులో జరుగుతున్న విచారణను నిర్దిష్ట సమయం (దాదాపు పది నిమిషాలు) ఆలస్యంగా ప్రసారం చేయాలని సూచించింది. బయటకు వెళ్లకూడని సమాచారం ఏదైనా ఉంటే దానిని ఎడిటింగ్‌లో తీసేసేందుకే ఈ ఏర్పాటు. ఏ కోణంలో కెమెరాలు ఉంచాలన్న దానిపైనా కోర్టు పరిమితులు విధించింది. బహిరంగ కోర్టుల స్ఫూర్తితోనే.. బహిరంగ కోర్టుల స్ఫూర్తితోనే ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతిస్తున్నామనీ, దీని వల్ల కేసుకు సంబంధించిన సమాచారం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని జస్టిస్ చంద్రచూడ్ తీర్పులో పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని, విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ మరో అడుగు ముందుకేసే సమయం ఈ కోర్టుకు వచ్చిందని వివరించారు. జస్టిస్ మిశ్రా, జస్టిస్ ఖన్విల్కర్లకు కలిపి జస్టిస్ ఖాన్విల్కరే తీర్పు రాశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఇంగ్లండ్, జర్మనీ, ఐర్లాండ్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం ఉంది. -
సుప్రీం జోక్యంతో ‘కథువా’ కేసులో విచారణ ప్రారంభం
-
‘కథువా’ కేసు; కోర్టు విచారణ ప్రారంభం
జమ్ము: ‘ఆ పసిమొగ్గను చిదిమేసిన కీచకులను కఠినంగా శిక్షించాలం’టూ నినాదాలు మిన్నంటుతున్నవేళ కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారి అపహరణ, అత్యాచారం, హత్య కేసుపై సోమవారం కోర్టు విచారణ ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఏడుగురు నిందితులపై మోపిన అభియోగాలను పరిశీలించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేశారు. ఎనిమిదో నిందితుడు.. బాలికపై అకృత్యంలో ప్రధాన పాత్రధారి అయిన బాలనేరస్తుడిపై విచారణను విడిగా చేపట్టనున్నారు. ఇక ఇదే కేసుకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను నేడు సుప్రీంకోర్టు ముందుకురానున్నాయి. నిందితులు వివరాలివే: బాలికపై కీచకపర్వం కేసును దర్యాప్తు చేసిన జమ్ముకశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. బక్వారా ముస్లింలను గ్రామం నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా కుట్రలు చేసి, పాపపై అకృత్యం జరగడానికి అసలు సూత్రధారి, రిటైర్డ్ ఉద్యోగి సాంజీ రామ్‌ను ఏ1గా పేర్కొన్నారు. చిన్నారిని అపహరించి, తొలుత అత్యాచారం చేసిన సాంజీరామ్ మేనల్లుడు మైనర్(15 ఏళ్లు) కావడంతో అతనిని విడిగా విచారించనున్నారు. నాలుగు రోజుల నరకం తర్వాత బాలికను కర్రతో కొట్టి చంపిందికూడా ఈ బాలనేరస్తుడే కావడం గమనార్హం. ఇక మైనర్ నేరస్తుడి స్నేహితుడు పర్వేశ్ కుమార్, సాంజీరామ్ కొడుకు విశాల్, మీరట్ స్పెషల్ పోలీసులు దీపక్ ఖజూరియా, సురేంద్ర వర్మలు కూడా బాలికపై అత్యాచారం జరిపారన్న ఆధారాలు లభించడంతో వారినీ ప్రధాన నిందితులజాబితాలో చేర్చారు. లంచం తిన్న ఆ ఇద్దరు పోలీసులు కూడా: కథువా బాలికపై అకృత్యం జరిగింది జనవరిలోనే అయినా ఆ కేసును బయటికి రానీయకుండా తొక్కిపెట్టడంలో పోలీసులదే కీలక పాత్ర. బాలిక హత్యకు గురైన తర్వాత కేసు నమోదు కాకుండా ఉండేందుకు సాంజీరామ్.. ఎస్సై ఆనంద్ దత్తా, హెడ్‌కానిస్టేబుల్ తిలక్ రాజ్‌లకు రూ.4 లక్షలు లంచం ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకున్న పోలీసులు.. కీలక సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేప్రయత్నం చేశారు. ఈ విషయాలన్నీ క్రైమ్ బ్రాంచ్ విచారణలో తేటతెల్లం అయ్యాయి. దీంతో ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ ఇద్దరిని కూడా నిదితుల జాబితాలో చేర్చారు. అడ్వొకేట్ దీపికకు మళ్లీ బెదిరింపులు: హిందూ-ముస్లిం విబేధాల పొడచూసిన నేపథ్యంలో కథువా బాలిక హత్యాచారం కేసు విచారణ కోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఇద్దరు సిక్కు మతస్తులైన లాయర్లను పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమించింది. కాగా, బాధితురాలి కుటుంబ తరఫున వాదిస్తానని అడ్వొకేట్ దీపికా సింగ్ రజావత్ ఇదివరకే ముందుకొచ్చారు. సోమవారం నాటి విచారణలో ఆమె వాదనే కీలకం కానుంది. దీపికా ఈ కేసును అంగీకరించింది మొదలు ఆమెకు పెద్ద ఎత్తున బెదింపులు వస్తుండం తెలిసిందే. ఆదివారం కూడా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేశారని, ఈ కేసు వాదిస్తే రేప్‌చేసి చంపేస్తామని బెదిరించారని ఆమె మీడియాతో చెప్పారు. ‘బహుశా ఈ విచారణ పూర్తయ్యేలోపు నేను ప్రాణాలు కోల్పోవచ్చు లేదా మరొకటి జరగొచ్చు. అయితే బెదిరింపులకు భయపడి విచారణనుంచి మాత్రం తప్పుకోబోను. నాకు, బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆశ్రయిస్తా’ అని దీపిక తెలిపారు. -
ఐటీ రిటర్నుల కేసులో జయలలితపై విచారణ: సుప్రీం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఎదురుదెబ్బ తగిలింది. శశి ఎంటర్ప్రైజెస్ భాగస్వామిగా ఉన్న ఆమె, మూడు సంవత్సరాలుగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయనందుకు ఆమెపై విచారణ జరపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నాలుగు నెలల్లోగా ఈ విచారణ పూర్తి చేయాలని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం దిగువ కోర్టుకు తెలిపింది. తన స్నేహితురాలు శశికళతో కలిసి జయలలిత శశి ఎంటర్ప్రైజెస్ సంస్థను స్థాపించారు. అయితే, 1991-92, 1992-93, 1993-94 ఆర్థిక సంవత్సరాలకు గాను భాగస్వాములిద్దరిలో ఎవరు గానీ, సంస్థ గానీ ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయలేదు. అయితే, తనకు ఆ సంస్థ నుంచి ఎలాంటి ఆదాయం లభించడం లేదని, అందువల్ల పన్ను ఎగవేసే ప్రశ్నే తలెత్తదని, అందుకే ఆదాయపన్ను రిటర్నులు కూడా దాఖలు చేయలేదని జయలలిత అంటున్నారు. పైగా రిటర్నులు దాఖలు చేయకపోవడం నేరం కాదని ఆమె చెప్పారు. కానీ, చెన్నైలోని ఆర్థిక నేరాల కోర్టు మాత్రం ఆమె వాదనను కొట్టి పారేసింది. ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడం నేరమేనని, అందుకు విచారణ ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. హైకోర్టు కూడా ఆ కోర్టు వాదనను అంగీకరించింది. జయలలితతో పాటు శశికళ కూడా విచారణను ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది.