ఐటీ రిటర్నుల కేసులో జయలలితపై విచారణ: సుప్రీం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఎదురుదెబ్బ తగిలింది. శశి ఎంటర్ప్రైజెస్ భాగస్వామిగా ఉన్న ఆమె, మూడు సంవత్సరాలుగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయనందుకు ఆమెపై విచారణ జరపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నాలుగు నెలల్లోగా ఈ విచారణ పూర్తి చేయాలని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం దిగువ కోర్టుకు తెలిపింది. తన స్నేహితురాలు శశికళతో కలిసి జయలలిత శశి ఎంటర్ప్రైజెస్ సంస్థను స్థాపించారు. అయితే, 1991-92, 1992-93, 1993-94 ఆర్థిక సంవత్సరాలకు గాను భాగస్వాములిద్దరిలో ఎవరు గానీ, సంస్థ గానీ ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయలేదు.
అయితే, తనకు ఆ సంస్థ నుంచి ఎలాంటి ఆదాయం లభించడం లేదని, అందువల్ల పన్ను ఎగవేసే ప్రశ్నే తలెత్తదని, అందుకే ఆదాయపన్ను రిటర్నులు కూడా దాఖలు చేయలేదని జయలలిత అంటున్నారు. పైగా రిటర్నులు దాఖలు చేయకపోవడం నేరం కాదని ఆమె చెప్పారు. కానీ, చెన్నైలోని ఆర్థిక నేరాల కోర్టు మాత్రం ఆమె వాదనను కొట్టి పారేసింది. ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడం నేరమేనని, అందుకు విచారణ ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. హైకోర్టు కూడా ఆ కోర్టు వాదనను అంగీకరించింది. జయలలితతో పాటు శశికళ కూడా విచారణను ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది.