
న్యూఢిల్లీ: 2024–25 అసెస్‌మెంట్ సంవత్సరానికి కార్పొరేట్లకు ఐటీఆర్ ఫైలింగ్ గడువును నవంబర్ 15 వరకు పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అక్టోబర్ 31 గడువు తేది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ 15 రోజులు పొడిగిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.
సీబీడీటీ ఇప్పటికే ఆడిట్ నివేదికల దాఖలు తేదీని సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అవసరమైన నివేదికలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమర్పించడంలో పన్ను చెల్లింపుదారులు, ఇతర వాటాదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకున్న సీబీడీటీ ఈ తాజా నిర్ణయం తీసుకుంది.
గడువు తేదీ లోపు ఆడిట్ నివేదికలను దాఖలు చేయడానికి చాలా మంది ట్యాక్స్‌పేయర్స్, సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గడవు పొడిగింపు వారికి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇప్పుడు అదనపు సమయం లభించడంతో ఎలాంటి ఒత్తిడి, జరిమానాలు లేకుండా ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లను పూర్తి చేయవచ్చు.