ఒరిజినల్ రిటర్ను వేశారు. వెరిఫై కూడా అయింది. కానీ మీరు ఆ రిటర్నుని చెక్ చేసుకుంటే, ఏవైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు. వాటిని సరిదిద్దుకుని రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎటువంటి పొరపాట్లు జరుగుతాయంటే ..
» కూడిక, తీసివేతల్లో తప్పులు
» ఆదాయం మర్చిపోవడం.. పరిగణనలోకి తీసుకోకపోవడం
» ఆదాయం లెక్కించడంలో పొరపాటు జరగడం
» మినహాయింపులు, తగ్గింపులు మొదలైనవి మర్చిపోవడం
» ట్యాక్స్ లెక్కింపులో తప్పులు
» టీడీఎస్‌లో పొరపాట్లు
» అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినవి మర్చిపోవడం
» మినహాయింపు మొదలైనవాటిని తప్పుగా, ఎక్కువగా క్లెయిమ్ చేయడం
» బ్యాంకు అకౌంటు వివరాలు తప్పుగా ఇవ్వడం
» ఒక ఫారంనకు బదులుగా మరొక ఫారం వేయడం
సెక్షన్ 139(5) ప్రకారం మీరు మీ ఒరిజినల్ రిటర్నుని రివైజ్ చేసుకోవచ్చు. రివైజ్డ్ రిటర్న్ అంటేనే ఒరిజినల్ రిటర్న్‌కి బదులుగా అని .. మరొక రకంగా ‘రిప్లేస్‌మెంట్’ అని చెప్పవచ్చు. ఇలా వేయడంలో గతవారం చెప్పినట్లుగా రూ. 1,000/5,000 చెల్లించనవసరం లేదు. మీరు సకాలంలో వేసినట్లే. అయితే, పన్ను కట్టాల్సి ఉంటే పన్నుతో పాటు వడ్డీ చెల్లించాలి.
ఎప్పటిలోగా ఈ రిటర్ను వేయొచ్చు..
మీరు వేసిన ఒరిజినల్ రిటర్నుకి సంబంధించి అసెస్‌మెంట్ ఆర్డర్లు వచ్చేలోగా లేదా 2024 డిసెంబర్ 12లోగా .. (ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది). గడువుతేదీ తర్వాత రిటర్ను వేసిన వాళ్లు కూడా రివైజ్డ్ రిటర్ను వేయొచ్చు. ఇలా ఎన్నిసార్లు రివైజ్ చేయొచ్చు .. అంటే ఎన్నిసార్లయినా రివైజ్ చేయొచ్చు. ఎటువంటి ఆంక్షలు, పరిమితులు లేవు. అలా అని మాటిమాటికీ చేయకండి.
రివైజ్ చేయాల్సిన అవసరం వస్తే ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి సుమా..
» మళ్లీ పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకోండి
» సమగ్రంగా అన్ని వివరాలు సేకరించండి
» రివైజ్ రిటర్న్ ఆప్షన్‌ను ఎంచుకోండి
» సరైన ఐటీఆర్‌ను ఎంచుకోండి
» ఒరిజినల్ రిటర్ను వివరాలన్నీ ఇవ్వాలి లేదా అప్‌లోడ్ చేయాలి
» మిగతా పద్ధతంతా షరా మామూలే
మనంతట మనమే రివైజ్ చేస్తున్నాం. మళ్లీ మళ్లీ చేయడం సబబు కాదు. సమంజసం కాదు. రివైజ్ చేయడానికి కారణాలు సాంకేతికపరమైనవి, చిన్న చిన్నవైతే ఫర్వాలేదు. కానీ పెద్దవి అయితే మాత్రం మీ రివైజ్డ్ రిటర్నుని స్క్రూటినీ కోసం సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోండి.
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment