![Snap Digital Well-Being Index Third Edition Released](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/iStock-1200200188sana.jpg.webp?itok=PSIc8ZGF)
నేడు సేఫర్ ఇంటర్‌నెట్ డే
తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంటర్‌నెట్ ప్రపంచంలో ఉంటాం. మనకు అన్నీ తెలిసినట్లుగానే ఉంటుంది. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉన్నట్లుగానే ఉంటుంది. అయినా సరే... ఏ ప్రమాదం ఎటు నుంచి వచ్చిపడుతుందో తెలియదు.
ఇంటర్‌నెట్ వినియోగించడం ఎంత ముఖ్యమో, మనకు ఎలాంటి చేటు, నష్టాలు జరగకుండా ఉపయోగించడం అంతకంటే ముఖ్యం...
‘సేఫర్ ఇంటర్‌నెట్ డే’ ను పురస్కరించుకొని మల్టీ మీడియా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్’ డిజిటల్ వెల్–బీయింగ్ ఇండెక్స్ (డిడబ్ల్యూబిఐ) మూడవ ఎడిషన్‌ను విడుదల చేసింది. మన దేశంలో డిజిటల్ విషయాలకు సంబంధించి అవగాహన ఉన్నప్పటికీ ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయి అని ఈ నివేదిక తెలియజేసింది.
మన దేశంతో సహా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, యూఎస్‌లో నిర్వహించిన డిజిటల్ సేఫ్టీపై నిర్వహించిన సర్వేలో టీనేజర్‌లు, వారి తల్లిదండ్రులు, యువత... ఇలా ఎంతోమంది పాల్గొన్నారు.
మన దేశం హైయెస్ట్ డిజిటల్ వెల్‌బీయింగ్ స్కోర్‌ను 67తో సాధించింది. ఇంటర్‌నెట్ భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్న తల్లిదండ్రుల సంఖ్య పెరిగింది. డిజిటల్ శ్రేయస్సు (డిజిటల్ వెల్–బీయింగ్)కు సంబంధించి సానుకూల సూచికలు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్లాక్‌మెయిల్ లాంటివి మన దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత, సన్నిహిత, ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తామని బెదిరించడం లాంటివి ఎక్కువ అవుతున్నాయి, ఆన్‌లైన్ భద్రతకు సంబంధించి పురోగతి, సవాళ్లను రెండిటినీ నివేదిక నొక్కి చెప్పింది.
డిజిటల్ సేఫ్టీలో మన దేశం మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ బెదిరింపుల ప్రాబల్యం పెరగడంతో యువ యూజర్‌లు ప్రమాదాల బారినపడకుండా నిరంతర అవగాహన కలిగించాల్సిన అవపరం గురించి నివేదిక నొక్కి చెప్పింది. ఈ సంవత్సరం సేఫర్ ఇంటర్‌నెట్ డేకి సంబంధించిన థీమ్... ‘టుగెదర్, ఫర్ ఎ బెటర్ ఇంటర్‌నెట్’.
Comments
Please login to add a commentAdd a comment