
రిలయన్స్ జియో 26 గిగాహెర్ట్జ్ మిల్లీమీటర్ వేవ్ (ఎంఎంవేవ్) బ్యాండ్‌లో హై-ఫ్రీక్వెన్సీ 5జీ సేవలను ప్రారంభించింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటికే దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉన్న మిడ్-బ్యాండ్ 3.3 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో జియో ప్రస్తుత 5జీ కవరేజీని ఎంఎంవేవ్ రోల్అవుట్ భర్తీ చేస్తుంది.
ప్రస్తుత మిడ్-బ్యాండ్ 5జీ బలమైన పనితీరు, విస్తృత కవరేజీని అందిస్తూ వినియోగదారుల అవసరాలను చాలా వరకూ తీరుస్తుండగా, ఎంఎంవేవ్ బ్యాండ్ లేదా 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ప్రత్యేక ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్లు అంటే వాణిజ్య అవసరాల కోసం తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.
ఏమిటీ ఎంఎంవేవ్ 5జీ?
మిల్లీమీటర్ వేవ్ 5 జి సాంప్రదాయ మొబైల్ నెట్‌వర్క్‌ల కంటే చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తుంది. ఇది అల్ట్రా-ఫాస్ట్ డేటా ట్రాన్స్‌మిషన్, చాలా తక్కువ లేటెన్సీని అనుమతిస్తుంది. అయితే దీని పరిధి పరిమితంగా ఉంటుంది. ఇది భవనాలలోకి చొచ్చుకువెళ్లలేదు. అలాగే విస్తృత ప్రాంతాలను కవర్ చేయలేదు. అందుకే ఎంఎంవేవ్ 5జీకి మరింత దట్టమైన మౌలిక సదుపాయాలు, బేస్ స్టేషన్లు, చిన్న సెల్స్, కచ్చితమైన ప్లేస్‌మెంట్ అవసరమవుతాయి. దీని వల్ల ఖరీదు కూడా ఎక్కువే.
దేశవ్యాప్త వినియోగదారుల రోల్అవుట్ల కంటే నిర్దేశిత ప్రదేశాలల్లో ఏర్పాటుకే ఇవి అనుకూలంగా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, రెగ్యులర్ మొబైల్ బ్రౌజింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్ చేసేవారికి ఎంఎంవేవ్ నుండి పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే స్మార్ట్ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, రిమోట్ సర్జరీలు వంటి ఎంటర్‌ప్రైజ్ సంబంధిత వినియోగానికి మాత్రం అత్యధిక వేగం, తక్కువ జాప్యంతో ఇది సేవలందిస్తుంది.
ఎంఎంవేవ్ 5జీ లాంచ్ ఎక్కడెక్కడంటే..
జియో ఎంఎంవేవ్ 5జీ ఇప్పుడు దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉంది. వీటిలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, బిహార్ ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జియో ఎంఎంవేవ్ 5జీ అందుబాటులోకి వచ్చింది. ఇక తూర్పు, ఈశాన్య భారతదేశం విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.