బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు
- రూ.10 కోట్లతో పనులు
- 30 వేల బతుకమ్మలతో ప్రదర్శన
- జాతీయ స్థాయి మహిళా ప్రముఖులకు ఆహ్వానం
- జీహెచ్‌ఎంసీ కమిషనర్ వెల్లడి
- హుస్సేన్ సాగర్‌ను సందర్శించిన సోమేశ్‌కుమార్
కవాడిగూడ: బతుకమ్మ వేడుకలను నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ట్యాంక్‌బండ్, రోటరీ పార్కు సమీపంలోని హుస్సేన్‌సాగర్‌ను సందర్శించారు.
కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత తొలి బతుకమ్మ వేడుకలు కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇందులో భాగంగా హుస్సేన్ సాగర్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు మూడు ఘాట్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రోటరీ పార్కు వద్ద శాశ్వత ప్రాతిపదికన బతుకమ్మ ఘాట్‌ను నిర్మిస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన పనులను తక్షణమే ప్రారంభించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ వేడుకలకు దేశంలో వివిధ హోదాల్లో ఉన్న మహిళా ప్రజాప్రతినిధులు, నేతలను ప్రభుత్వం ఆహ్వానిస్తుందన్నారు. ఉత్సవాల చివరి రోజైన అక్టోబరు 2న బషీర్‌బాగ్ ఎల్బీస్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు సుమారు 30 వేల బతుకమ్మలతో భారీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు.
ఇందుకోసం ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు రోడ్లు, ఫుట్‌పాత్‌లు, బతుకమ్మ ఘాట్‌ల నిర్మాణం తదితర పనులు చేపడతామన్నారు. సాగర్ తీరాన్ని సందర్శించిన వారిలో జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ ప్రద్యుమ్న, సెంట్రల్ జోనల్ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్.ధన్‌సింగ్, చీఫ్ ఇంజినీర్ కె.సురేశ్, అడిషనల్ కమిషనర్లు ఎన్.రవికిరణ్, ఎల్.వందన్‌కుమార్ ఉన్నారు.