
సాక్షి ‘ఫోన్ ఇన్’కు అనూహ్య స్పందన
- పచ్చ‘ధనం’ కోసం నినదించిన సిటీ‘జనం’
- విలువైన సలహాలు, సూచనలు
- ఆద్యంతం అర్థవంతంగా సాగిన కార్యక్రమం
- కార్యాచరణకు కమిషనర్ సంసిద్ధత
రోడ్డు తవ్వి వదిలేశారు...
మా ప్రాంతంలో ఎక్కడి చెత్త అక్కడే ఉంటోంది. చెత్త ఎత్తడం లేదు. రోడ్డు తవ్వి వదిలేశారు. మెడికల్ ఆఫీసర్, సూపర్‌వైజర్లకు ఫోన్ చేసినా స్పందన లేదు.
- మహేశ్, తుకారాం గేట్, అడ్డగుట్ట
కమిషనర్ సోమేశ్‌కుమార్ : రేపట్నుంచి 24 గంటల్లోగా చెత్త తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. తిరిగి మళ్లీ సమస్యలు తలెత్తితే 21111111కి ఫోన్ చేయండి. ఇలాంటి ఫిర్యాదుల కోసం కొత్త నెంబర్ ప్రారంభిస్తున్నాం.
ఖాళీ స్థలాలకు ప్రహరీలు నిర్మించాలి
బృందావన్‌కాలనీలో ఉంటాం. భూగర్భ డ్రైనేజీ కోసం దరఖాస్తు చేసుకున్నాం. కాలనీలో ఖాళీగా ఉన్న ప్లాట్లలో పరిసరాల వారు చెత్తాచెదారం వేస్తూ, బహిరంగ యూరినల్స్‌గా మార్చేశారు. పారిశుధ్య సిబ్బంది ఈ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
- ఎం.ఎస్.శర్మ, ఏఎస్‌రావు నగర్
కమిషనర్: నగరమంతా భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సదుపాయం కోసం బడ్జెట్‌లో రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
రోడ్డు కటింగ్‌లతో ఇబ్బంది
చైతన్యపురి ప్రభాత్‌నగర్ పెట్రోలుబంక్ దగ్గర తరచూ రోడ్డు కటింగ్‌లు చేస్తున్నారు. ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేరు.
- శంకర్, కొత్తపేట
కమిషనర్: ధన్యవాదాలు. రెండంశాలు దృష్టికి తెచ్చారు. రెండు మూడు రోజుల్లో మీ
సమస్యలు పరిష్కరిస్తాం.
మట్టికుప్పలతో ట్రాఫిక్ జాం
మల్లేపల్లి, ఆగాపురా ప్రాంతాల్లో మట్టికుప్పలతో ట్రాఫిక్‌జాంలవుతున్నాయి. చర్యలు తీసుకోండి.
- ఎం.ప్రసాద్, ఆగాపురా
కమిషనర్: మూడు నాలుగు రోజుల్లో పరిష్కరిస్తాం.
పేరుకుపోతున్న చెత్త
కూకట్‌పల్లి దాయార్‌గూడలో 400 గుడిసెలున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్నారు. దుర్వాసన భరించలేకున్నాం. విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు.
- ఎ.రాము, కూకట్‌పల్లి
కమిషనర్: రెండు మూడు రోజుల్లో సమస్య క్లియర్ చేస్తాం.
అదనపు చెత్త డబ్బాలు కావాలి
రాజీవ్ గృహకల్ప కాలనీలో ఇందిరమ్మ స్కూల్ వెనుక ఒకే చెత్త డబ్బా ఉండటంతో చాలడం లేదు. వారానికి రెండుసార్లే డబ్బాల నుంచి చెత్త తొలగిస్తున్నారు. రోజూ తొలగించేలా చర్యలు తీసుకోవాలి. మీరు పేదల కోసం ప్రారంభించనున్న సబ్సిడీ భోజనంతో ఎందరికో మేలు జరుగుతుంది. ధన్యవాదాలు సార్.
- టి.శివరామయయ,చందానగర్
కమిషనర్: మీ సమస్యలు కొన్ని రోజుల్లోనే పరిష్కరిస్తాం.
డ్రైనేజీ సమస్య తీవ్రం
రెండున్నర నెలలుగా రోడ్డు మీద పారుతున్న డ్రైనేజీతో తీవ్ర సమస్యగా ఉంది. రోడ్డు మధ్య టూ వీలర్ కూడా వెళ్లలేదు. ఫొటో మెయిల్ చేయమన్నా చేస్తాను.
- మదు, చంపాపేట
కమిషనర్: మా అధికారులు వచ్చి సమస్య పరిశీలిస్తారు.
రోడ్డు పక్కనే చెత్త డంప్
బైపాస్ రోడ్డు పక్క చెత్త మొత్తం డంప్ చేశారు. అధికారులు కొంతమేర పని చేశారు. కానీ సమస్య తీరలేదు.
- రంగారెడ్డి, వివేక్‌నగర్, రామంతాపూర్
కమిషనర్: రెండు రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తాం.
ఫిర్యాదు చేసినా పరిష్కారమేదీ?
ప్రియదర్శిని అపార్ట్‌మెంట్ పరిసరాల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. ఫిర్యాదులిచ్చినా స్పందనలేదు.
- రాంనారాయణరెఇ్డ,ఉప్పర్‌పల్లి, రాజేంద్రనగర్
కమిషనర్: వీలైనంత త్వరితంగా పరిష్కరిస్తాం.
డ్రైనేజీ సమస్య తీవ్రం
దాదాపు 30 సంవత్సరాల క్రితం ఏర్పాటైన మా కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. - బంగార్రాజు, చంపాపేట
కమిషనర్: డిప్యూటీ కమిషనర్, ఇంజినీర్లు వచ్చి పరిశీలి స్తారు. లేదంటే 21111111 నెంబరుకుఫోన్ చేయండి.
మామూళ్లే తప్ప పనులు నిల్
పారిశుధ్య కార్మికులు దుకాణాల వారి నుంచి మామూళ్లు వసూలు చేయడం తప్ప పనులు చేయడం లేదు. పేరుకు బంగారం బజార్ అయినా చెత్తకుప్పలతో నిండిపోతోంది.
- మాణిక్యప్రభు, జనరల్‌బజార్, సికింద్రాబాద్
కమిషనర్: ఏ డోర్ నుంచి ఏ డోర్‌నెంబరు వరకు పారిశుధ్య పనులకు ఎవరు బాధ్యులో తెలియజేసేలా బోర్డులు రాస్తాం. వారి పనితీరు కోసం బీట్‌బుక్ పెడతాం. దుకాణదారులు సర్టిఫై చేస్తేనే పనిచేసినట్లు గుర్తిస్తాం.
చెత్త ఎవరు తొలగిస్తారు?
రెండు కాంప్లెక్స్‌ల మధ్య చెత్త వేస్తున్నారు. దానిని ఎవరూ తొలగించడం లే దు. జీహెచ్‌ఎంసీ వారు మా పని కాదంటున్నారు. దోమలు తీవ్రమై జ్వరాలు వస్తున్నాయి.
- భాగ్యలక్ష్మి, జ్యోతినగర్, బోరబండ
కమిషనర్: చర్యలు తీసుకుంటాం. సమస్య పరిష్కరిస్తాం
సిబ్బంది సరిగా పనిచేయట్లేదు
పారిశుధ్యసిబ్బందిలో ఏడుగురికి ఇద్దరు ముగ్గురే పనిచేస్తున్నారు. వీధిదీపాలకు అడ్డొచ్చే చెట్ల కొమ్మలు నరికేయాలి.
- నజీర్ అహ్మద్, జనరల్‌సెక్రటరీ, సుందర్‌నగర్‌కాలనీ
కమిషనర్: అలాగే చేస్తాం. మీ సమస్య పరిష్కరిస్తాం.
చెరువులోనే వ్యర్థాలు
నాగోలు - బండ్లగూడ దారిలో కుడివైపు చెరువులో చెత్త వేస్తున్నారు. పశువుల కళేబరాలు ఇతరత్రా వ్యర్థాలు వేస్తున్నారు. దాంతో తీవ్ర దుర్వాసనతో అల్లాడుతున్నాం.
- లక్ష్మి, వెంకటరెడ్డి నగర్, నాగోల్.
కమిషనర్: మీ సమస్య అర్థమైంది. చర్యలు తీసుకుంటాం.
కబ్జాను అడ్డుకోండి
పీపుల్స్ పార్కు స్థలంలో వాణిజ్య భవన నిర్మాణానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. స్థలం కబ్జాను అడ్డుకోవాలి.
- రాఘవేంద్రరావు, చిక్కడపల్లి
కమిషనర్: అది ప్రభుత్వ ఓపెన్‌ల్యాండ్ అయితే ఎలాంటి నిర్మాణాలకు అనుమతించం.
చెత్తకుండీ పెట్టరూ
అన్నానగర్‌లో ఒక్క చెత్తకుండీ కూడా లేదు. రోడ్లపైనే వేస్తున్న చెత్తతో తీవ్ర దుర్గంధంతో పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. దోమల బెడద ఉంది.
- మహేశ్వరి, బోరబండ
కమిషనర్: అధికారులను పంపి వెంటనే క్లీన్ చేయిస్తాం. భవిష్యత్‌లో తిరిగి ఇలాంటి సమస్య రాకుండా చూస్తాం.
ఎక్కడ చెత్త అక్కడే
మట్టికుప్పలు. చెత్త ఎక్కడిదక్కడే ఉంటున్నాయి.
- రాములమ్మ, రైల్ నిలయం, సికింద్రాబాద్
కమిషనర్: తప్పకుండా పరిష్కరిస్తాం.
పార్కు పనులు పెండింగ్
ఎస్‌బీహెచ్ ఎదురుగా పార్కు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పరిసరాల్లో చెత్త పేరుకుపోయి తీవ్ర ఇబ్బందిగా ఉంది. వేసవిలో మొక్కలకు నీటి సదుపాయం లేదు.
- కృష్ణారెడ్డి, జెట్‌కాలనీ, సనత్‌నగర్
కమిషనర్: మా అధికారులు తగు చర్యలు తీసుకుంటారు.
పేరుకుపోతున్న చెత్త
చెత్తపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.
- సతీష్‌గౌడ్, కందికల్ గేట్, ఉప్పుగూడ
కమిషనర్: ఇకపై 21111111 నెంబరుకు ఫిర్యాదు చేయండి. మీ సమస్య 24 గంటల్లో పరిష్కారమవుతుంది.
పొంగుతున్న భూగర్భ డ్రైనేజీ
శివారు ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ పొంగి పొరలుతోంది
గుర్నాథ్, చింతకుంట, ఎల్‌బీనగర్
కమిషనర్: శివారు ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సమస్యలు తీర్చే పనులు చేస్తాం.
పగిలిన పైప్‌లైన్
నెలరోజులుగా డ్రైనేజీ లీకేజీ. పైప్‌లైన్ పగిలిందంటున్నారు.
- రంగనాథ్, చందానగర్
కమిషనర్: మీ సమస్య పరిశీలించి పరిష్కరిస్తాం.
కార్మికులకు రక్షణ ఏర్పాట్లు చేయండి
చెత్తబండ్ల ద్వారా చెత్త కళ్లలో పడుతుంది. కార్మికుల రక్షణ కోసం మేం రూపొందించిన ప్రొటెక్ట్‌కేర్ వల్ల ప్రయోజనం ఉంటుందేమో పరిశీలించండి.
- శివశంకర్, లంగర్‌హౌస్
కమిషనర్: మీరు చేసినవి చూపించండి. లేదా ఫొటోలు పంపండి. పరిశీలిస్తాం.
చెత్తకుండీలకు మరమ్మతులు చేయండి
చెత్తకుండీలు పాడై పోవడం వల్ల లారీల్లో తరలిస్తుండగా, వాటి నుంచి చెత్త రోడ్లపై పడుతోంది.
- ఎం. రవినాయక్, షాపూర్‌నగర్ ,జీడిమెట్ల
కమిషనర్: ప్రైవేట్ ఏజెన్సీ ఇంటింటి నుంచి చెత్తను తరలించడంతోపాటు కాంపాక్టర్ల ద్వారా చెత్తను శాస్త్రీయంగా తరలిస్తారు. త్వరలో ఈ విధానం అమల్లోకి వస్తుంది.
పార్కులు ఏర్పాటు చేయండి
మా దగ్గర రెండు ఖాళీ ప్రదేశాలున్నాయి. మొక్కలు నాటితే బాగుంటుంది. ఇక్కడ పార్కులు ఏర్పాటుచేస్తే కాలనీసంఘాల వాళ్లం శ్రద్ధ తీసుకుంటాం. ఇళ్ల నిర్మాణం చేసేవారు తప్పనిసరిగా కొన్ని మొక్కలైనా నాటాలనే నిబంధన పెడితే బాగుంటుంది సార్.
- నాగార్జున, స్వరూప్‌నగర్, ఉప్పల్
కమిషనర్: జీహెచ్‌ఎంసీలో మొత్తం 385 ఖాళీ ప్రదేశాలు గుర్తించాం. మీరు చెప్పిన ఖాళీ స్థలాల్ని గుర్తించని పక్షంలో వాటి వివరాలు తెలపండి. మా జీవవైవిధ్య విభాగం అడిషనల్ కమిషనర్ చంద్రమోహన్‌రెడ్డి నా పక్కనే ఉన్నారు. వారి సిబ్బందిని పంపి ప్రహరీ ఉన్న స్థలంలో చెట్లు పెంచి పార్కును అభివృద్ధి చేస్తారు. ఈ పార్కును ఈ సంవత్సరం చేస్తాం. అలాగే మీవద్ద రోడ్డు పక్కన చెట్లు పెంచే అవకాశాలుంటే చెప్పండి. పెంచుతాం. మంచి సూచన చేశారు. థాంక్యూ!
పరిశ్రమల బారి నుంచి రక్షించండి
గగన్‌పహడ్‌లో 4 పరిశ్రమల నుంచి వెలువడే వరిపొట్టు బూడిద కళ్లలో పడి పలువురి చూపు పోతోంది. పరిసరాల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. స్థానికుల ఫిర్యాదులతో కొద్దికాలం క్రితం తొలగించిన ఎముకల ఫ్యాక్టరీని ప్రస్తుతం మళ్లీ తెరిచారు. ఎయిర్‌పోర్ట్ సమీపంలోని రహదారిపై నాలా పనులు పూర్తికాక అస్తవ్యస్తంగా ఉంది. మంత్రి ఆదేశించినా చర్యల్లేవు.
- ధనంజయ, రాజేంద్రనగర్
కమిషనర్: సిటీలో పారిశుధ్య పనులు నిర్ణీత దూరం వరకు ఎవరు చేయాలో వివరాలు బోర్డులపై లేదా గోడలపై రాస్తాం. అక్కడ పనులు జరగకపోతే ఏ అధికారికి ఫోన్ చేయాలో నెంబరూ రాస్తాం. కార్మికులు తాము పనిచేసినట్లు రాసేం దుకు కాలనీసంఘాల వద్ద బీట్ పుస్తకాలు ఉంచుతాం.
ప్రజలకు కౌన్సెలింగ్ నిర్వహించాలి
గతంలో ఇళ్లు, కాలనీల చెత్తను నిర్ణీత ప్రదేశంలో వేసేవారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే చెత్త వేస్తున్నారు. దీనిపై ప్రజలకు కౌన్సెలింగ్ నిర్వహించాలి. చెత్త డబ్బాలోనే చెత్త వేసేలా అవగాహన కల్పించాలి. జీహెచ్‌ఎంసీ లారీల్లో చెత్తను తెచ్చి శ్మశానవాటికలో సమాధులపైనే వేస్తుండటంతో మృతుల సంబంధీకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ సమస్యలు తీరుస్తారని ఆశిస్తున్నాం.
- పాలడుగు అనిల్‌కుమార్,
హిందూశ్మశానవాటిక అధ్యక్షుడు.
కమిషనర్: నగరంలోని అన్ని శ్మశానవాటికల్లో దశలవారీగా సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. అనేకచోట్ల ఆక్రమణలు జరుగుతున్నాయి. వీటన్నిటిపై తగు శ్రద్ధ తీసుకుంటాం.