- త్వరలో సర్కార్‌కు నివేదిక
- జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని 169 చెరువులకు సంబంధించి బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌ల గుర్తింపు పూర్తయిందని, త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించనున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌ల పరిధిలో కొత్త ఆక్రమణలు రాకుండా చూడటంతోపాటు ప్రస్తుతం జరుగుతోన్న నిర్మాణాలను కూల్చివేస్తామని పునరుద్ఘాటించారు. గతంలో, మునిసిపాలిటీల నుంచి భవన నిర్మాణ అనుమతులు పొంది చెరువు ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకున్న వారి భవితవ్యంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ వాటిపై ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు.
రెవెన్యూ, నీటిపారుదల, జీహెచ్‌ఎంసీ విభాగాలు ఎఫ్‌టీఎల్‌లు, బఫర్ జోన్‌లపై సర్వే నిర్వహించినట్టు చెప్పారు. శిథిల భవనాలపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న కార్మికుల పీఎఫ్‌లో గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలపై స్పందిస్తూ, పీఎఫ్, ఈఎస్‌ఐలపై తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానని, ఇప్పటివరకు పీఎఫ్ పుస్తకాలు అందని వారుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇంకా ఎవరికైనా పీఎఫ్ పుస్తకాలు అందని పక్షంలో సంబంధిత అధికారులు వచ్చే మంగళవారంలోగా వాటిని అందజేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీఎఫ్ వ్యవహారాలు చూస్తున్న ప్రస్తుత ప్రైవేటు సంస్థ గడువు తీరిపోయిందని, త్వరలోనే కొత్త టెండర్లు పిలవనున్నట్టు చెప్పారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు కూడా దోమలు వ్యాప్తి చెందకుండా తగిన అవగాహన కలిగి ఉండాలని సూచించారు.