అంతా ఆన్‌లైన్
భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తు ప్రక్రియ..
=నిబంధనలు సరళీకరణ
=ప్రజలకు అర్థమయ్యేలా అందుబాటులోకి..
=జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్
సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నారు. ఈ విధానం ద్వారా దరఖాస్తు ఏ దశలో ఉందో.. ఎవరివద్ద ఉందో కూడా ఆన్‌లైన్ ద్వారానే భవన యజమానులు/ఆర్కిటెక్టులు తెలుసుకోవచ్చు. భవననిర్మాణ అనుమతుల్లో జాప్యాన్ని నివారించేందుకు, సంబంధిత టౌన్‌ప్లానింగ్ ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంచేం దుకు.. పారదర్శకంగా సేవలందించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు.
సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ‘ప్రజావాణి’ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20 నుంచి నెలాఖరు వరకు ట్రయల్న్ ్రనిర్వహిస్తామని, సంబంధిత ఉద్యోగులందరికీ తగిన శిక్షణ ఇస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. కావాలని జాప్యం చేసే వారికి రోజుకు రూ. 50 వంతున జరిమానా విధిస్తామన్నారు. దరఖాస్తుల్ని పీడీఎఫ్ రూపంలో అప్‌లోడ్ చేసి, తగిన పత్రాలను జతపరచి, క్రెడిట్ కార్డుద్వారా కానీ, డీడీ ద్వారా మీసేవా కేంద్రాల్లో కానీ, సీఎస్సీల ద్వారా కానీ ఫీజు చెల్లించవచ్చన్నారు.
దరఖాస్తు అందినట్లు దరఖాస్తుదారులకు ఎస్‌ఎంఎస్ ద్వారా, ఈ మెయిల్ ద్వారా సమాచారం చేరుతుందన్నారు. తమ దరఖాస్తు ఎప్పుడు ఎవరి వద్ద ఉందో.. ఏ దశలో ఉందో కూడా ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే సదుపాయం ఉంటుందన్నారు. పై అధికారులకు సైతం ఈ సమాచారం అందుబాటులో ఉంటున్నందున.. లోపాలెక్కడున్నాయో తెలుసుకొని సరిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ప్రజలకు అర్థమయ్యేలా..
భవన నిర్మాణ అనుమతుల నిబంధనలు సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యేలా చిన్న పుస్తకంలో ముద్రించి పంపిణీ చేస్తామన్నారు. ఎంత సెట్‌బ్యాక్‌లు ఉండాలి.. తదితర వివరాలను అందరికీ అర్థమయ్యేలా పుస్తకంలో పొందుపరుస్తామన్నారు. తద్వారా తమ దృష్టికి వచ్చిన అక్రమనిర్మాణాలను సైతం ప్రజలు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసేందుకు వీలవుతుందన్నారు. సామాజిక బాధ్యతగా ప్రజలు తమ దృష్టికి వచ్చిన అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. అక్రమ నిర్మాణాలు జరిపితే.. ఎల్లకాలం ఆస్తిపన్నుపై భారీ పెనాల్టీ ఉంటుందనే అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. త్వరితంగా అనుమతులిచ్చేందుకు ప్రధాన కార్యాలయంలో మాదిరిగా వారానికి ఓరోజు సర్కిల్, జోనల్ కార్యాలయాల్లోనూ బిల్డింగ్‌కమిటీ సమావేశాలు నిర్వహించే ఆలోచన ఉందని చెప్పారు.
కాల్‌సెంటర్‌కు ప్రచారం కావాలి
70 లక్షలకు పైగా జనాభా ఉన్న గ్రేటర్‌లో ప్రజల నుంచి జీహెచ్‌ఎంసీకి రోజుకు కేవలం 300 ఫిర్యాదులు మాత్రమే వస్తున్నాయని, కాల్‌సెంటర్ టోల్‌ఫ్రీ (నెంబరు 155304) గురించి పెద్దయెత్తున ప్రచారం చేయాల్సిన అవసరముందని కమిషనర్ అభిప్రాయపడ్డారు. ప్రజలు తమ సమస్యల గురించి ఫిర్యాదు చేసేందుకు వీలుగా పత్రికలు సైతం కాల్‌సెంటర్ నెంబరును ‘సమాచారం కాలమ్’ల లో ప్రచారం చేయాలని కోరారు. దీని గురించి చాలామందికి తెలియనందునే తక్కువ ఫిర్యాదులొస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
ప్రజావాణికి 34 ఫిర్యాదులు
ప్రధాన కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ ‘ప్రజావాణి’కి మొత్తం 34 ఫిర్యాదులు రాగా, అందులో 15 టౌన్‌ప్లానింగ్‌వి, 3 ఆరోగ్యం- పారిశుధ్యంవి, 6 ఇంజినీరింగ్‌వి, 2 పార్కులవి, 1 యూసీడీవి కాగా, మిగతావి ఆయా విభాగాలవి ఉన్నాయని కమిషనర్ తెలిపారు.