టౌన్‘ప్లానింగ్’వికేంద్రీకరణ
- భవన నిర్మాణ అనుమతులికసులభం
- జోనల్ స్థాయిలోనే పరిష్కారం
- జీ ప్లస్ ఐదంతస్తుల వరకు అనుమతులు
సాక్షి, సిటీబ్యూరో : భవన నిర్మాణ అనుమతుల కోసం.. నిర్మాణం తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం సిటీజనులు పడే ఇబ్బందులు తొలగనున్నాయి. సమస్యలన్నీ జోనల్ స్థాయిలోనే పరిష్కారమయ్యే విధంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చర్యలు తీసుకున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో వికేంద్రీకరణ చేపట్టారు. దీనిలో భాగంగానే ప్రధాన కార్యాలయంలోని అడిషనల్ చీఫ్ సిటీప్లానర్లను (ఏసీసీపీలను) జోనల్ స్థాయి టౌన్‌ప్లానింగ్ చీఫ్ ప్లానర్లు(సీపీలు)గా నియమించారు.
అంటే.. ప్రధాన కార్యాలయంలో చీఫ్ సిటీప్లానర్ (సీసీపీ) పర్యవేక్షించే బాధ్యతల్ని జోనల్ స్థాయి వరకు సీపీలు పర్యవేక్షిస్తారు. జోనల్ స్థాయిలో అనుమతులిచ్చే అధికారాన్ని సైతం విస్తృతం చేశారు. ఇప్పటివరకు జీ ప్లస్ నాలుగంతస్తుల వరకు మాత్రమే జోనల్ స్థాయిలో అనుమతిలిచ్చేవారు. ఇప్పుడు దానిని జీ ప్లస్ ఐదంతస్తుల వరకు పెంచారు. సంబంధిత జోనల్ సీపీ స్థాయిలోనే వాటికి అనుమతులు మంజూరు చేస్తారు. బహుళ అంతస్తుల భవనాల అనుమతులు, రోడ్డు వెడల్పులో స్థలం కోల్పోతే పొందే నష్టపరిహారాలు వంటి ప్రత్యేక అనుమతులకు మాత్రమే ప్రజలు ప్రధాన కార్యాలయం దాకా రావాల్సి ఉంటుంది. మిగతావన్నీ జోనల్ స్థాయిలోనే పరిష్కారమవుతాయి.
జోనల్‌లోనూ బిల్డింగ్ కమిటీ మీట్
ఇప్పటివరకు ప్రధాన కార్యాలయంలో మాత్రమే నిర్వహిస్తున్న బిల్డింగ్ కమిటీ సమావేశాలు ఇకపై జోనల్ స్థాయిలోనూ నిర్వహించాల్సి ఉంది.
బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులిచ్చేందుకు ఈ బిల్డింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బిల్డింగ్ కమిటీలో టౌన్‌ప్లానింగ్‌లోని వివిధ స్థాయిల అధికారులు, సంబంధిత విభాగం అడిషనల్ కమిషనర్, ఫైర్‌సేఫ్టీ అధికారులతోపాటు కమిషనర్ సైతం ఉంటారు.
ఇప్పటివరకు ఉన్న నిబంధనల మేరకు జోనల్ స్థాయిలోని అనుమతులకు బిల్డింగ్ కమిటీ సమావేశం కావాల్సిన అవసరం లేదు.
ఇకపై జోనల్ స్థాయిలోనూ.. బిల్డింగ్ కమిటీ సమావేశం కావాల్సి ఉంది.
కాగా, ప్రధాన కార్యాలయంలో కమిషనర్ స్థానే జోనల్‌స్థాయి బిల్డింగ్ కమిటీలో జోనల్ కమిషనర్ పాల్గొంటారు.
సీపీలను జోన్లలో నియమించడం ద్వారా క్షేత్రస్థాయి తనిఖీలకూ వీలుంటుందని భావిస్తున్నారు.
భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించినందున.. ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు గ్రేటర్‌లోని అన్ని దరఖాస్తులను ఎప్పుడు ఏదశలో ఉందో పరిశీలించే వీలుంది.
తద్వారా టౌన్‌ప్లానింగ్ విభాగంలోని ఆరోపణలకు ఆస్కారం లేకుండా, పారదర్శకంగా ఉంటుందన్నది కమిషనర్ యోచన.
స్థాయి తగ్గిందా..?
ఇప్పటివరకు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించిన ఏసీసీపీలను జోనల్ కార్యాలయాలకు పరిమితం చేయడంతో తమ స్థాయిని తగ్గించారని ఏసీసీపీలు కలత చెందుతున్నారు.
హోదా రీత్యా అడిషనల్ డెరైక్టర్లయిన తాము.. హోదా రీత్యా తమకంటే తక్కువైన జోనల్ కమిషనర్లకు రిపోర్టు చేయాల్సి రావడం.. వారి అజమాయిషీలో పనిచేయాల్సి రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
తమ కంటే తక్కువ స్థాయిలోని (హోదా రీత్యా డిప్యూ టీ డైరక్టర్లయిన వారిని) సిటీప్లానర్లను ప్రధాన కార్యాలయానికి మార్చి.. తమను జోనల్ కార్యాలయాలకు బదిలీ చేయడం వారికి మింగుడు పడటం లేదు.
కాగా.. ప్రధాన కార్యాలయంలో నియమించినంత మాత్రాన.. అడిషనల్ డైరక్టర్ల స్థాయి తగ్గదని, సీసీపీకి సహాయంగా ఉండేందుకే ఇప్పటివరకు జోన్లలో ఉన్న సిటీప్లానర్ల(డిప్యూటీ డెరైక్టర్ స్థాయి) ను ప్రధాన కార్యాలయానికి కమిషనర్ బదిలీ చేశారని మరికొందరు చెబుతున్నారు.
అనుమతుల్లో అవకతవకలు జరుగకుండా ఉండేం దుకు.. అందరినీ భాగస్వాములను చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నారని వారు చెబుతున్నారు.