మెట్రో కారిడార్లలో రోడ్ల విస్తరణ వేగవంతం
- అధికారులను ఆదేశించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో మైట్రో రైలు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రహదారుల విస్తరణ వేగవంతం చేయాలని, ఆస్తుల సేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణ పనులపై శుక్రవారం హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డితో కలిసి బల్దియా కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్వీఎస్‌రెడ్డి మాట్లాడుతూ ..రహదారి విస్తరణకు వీలుగా కారిడార్-1 పరిధిలో మూసాపేట్,అమీర్‌పేట్,నాంపల్లిలో 38, ఉస్మానియా మెడికల్ కళాశాల, న్యూ మలక్‌పేట్‌లలో 25 ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. కారిడార్-2 పరిధిలో క్లాక్‌టవర్, బోయిగూడ వై-జంక్షన్‌లో 5, ముషీరాబాద్ ఎక్స్‌రోడ్స్ నుంచి కాచిగూడా ఎక్స్‌రోడ్స్ వరకు ఉన్న 51 ఆస్తులు, ఎంజీబీఎస్ నుంచి శాలిబండ వరకు 445 ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. కారిడార్-3 పరిధిలో మెట్టుగూడ-గ్రీన్‌ల్యాండ్స్ మార్గంలో 10, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి శిల్పారామం వరకు 12 ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు.
సెల్లార్లు ప్రమాదకరంగా ఉంటే చర్యలు: సోమేష్‌కుమార్
నగరంలో నిర్మాణంలో ఉన్న భవంతుల సెల్లార్లు ప్రమాదకరంగా ఉంటే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పాటు నోటీసులు జారీ చేయాలని క మిషనర్ సోమేష్‌కుమార్ టౌన్‌ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం 18 సర్కిళ్ల పరిధిలో 58 భవంతుల సెల్లార్లు ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
పురాతన భవంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
గ్రేటర్ పరిధిలో సుమారు 1538 పురాతన భవంతులున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్‌కు తెలిపారు. వర్షాకాలంలో ఇవి కూలి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత యజమానులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో సదరు యజమానులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జీహెచ్‌ఎంసీకి చెందిన ఖాళీ స్థలాల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భవన నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని సూచించారు. ఆక్యుపెన్సీ పత్రాల జారీని వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు వెంకటరామిరెడ్డి, టౌన్‌ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.