కార్పొరేషన్.. అవినీతికి అడ్డా
► ప్రభుత్వ ఆదాయానికి రూ.2 కోట్ల గండి
► టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారుల మాయాజాలం
► ఆన్‌లైన్ దరఖాస్తుల్లో కూడా చేతివాటం
► బిల్డింగ్ ప్లాన్ ఫీజు 14శాతంలో సగభాగం
► అధికారుల జేబుల్లోకి
నెల్లూరు నగర పాలక సంస్థ అవినీతికి అడ్డాగా మారింది. ఇందులో ఆదాయ వనరుల్లో ఒకటైన టౌన్‌ప్లానింగ్ విభాగం ప్రథమస్థానంలో ఉంది. అయితే ఈ విభాగంలోని అధికారులు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు తమ ఆదాయమే ముఖ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో టీపీఎస్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ నెలకు రూ.5లక్షల నుంచి రూ.10లక్షలు వరకు అక్రమం గా సమకూర్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
నెల్లూరు, సిటీ: భవన నిర్మాణాల అనుమతుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. అయితే కొంత మంది టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆన్‌లైన్‌లో ఉండే కొన్ని సాంకేతిక లోపాలను తమ ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో బిల్డింగ్‌ప్లాన్‌ల కోసం గత రెండు నెలలు నుంచి 520 వరకు దరఖాస్తులు వచ్చాయి. 400 ప్లాన్‌లు మంజూరు చేశారు. వీటిలో 40శాతం భవనాలకు సంబంధించిన ఫీజులో ప్రభుత్వానికి 14 శాతం కట్టాల్సి ఉంది. కొంతమంది టీపీఎస్‌లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 14 శాతం ప్రభుత్వానికి కట్టాల్సి ఉండగా, అలా కట్టకుండా రెండు నెలల వ్యవధిలో రూ.2కోట్లు వరకు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని తెలుస్తోంది.
14 శాతం ఎందుకు కట్టాలంటే..
నగర పాలక సంస్థ పరిధిలో అనధికారిక లేఅవుట్‌లలో భవన నిర్మాణాలు చేపట్టాలంటే ప్రభుత్వానికి స్థలం ఖరీదులో 14 పర్సంట్ ఫీజు ప్రభుత్వానికి కట్టాల్సి ఉంది. ఉదాహరణకు స్థలం ఖరీదు రూ.10 లక్షలు ఉంటే ప్రభుత్వానికి రూ.1.40లక్షలు కట్టాల్సి ఉంది. ఈ విధంగా కార్పొరేషన్‌కు కట్టాల్సిన 14పర్సంట్‌లో సగభాగాన్ని బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు.
కథ, స్క్రీన్ ప్లే అంతా ఓ టీపీఎస్ ద్వారానే..
టౌన్‌ప్లానింగ్ విభాగంలో అక్రమ కట్టడాలకు ప్లాన్‌లు మంజూరు చేయాలన్నా,14 పర్సంట్ ఎగవేత వేయాలన్నా ఓ టీపీఎస్(టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్) ముఖ్య పాత్ర వహిస్తున్నారని కార్పొరేషన్ వర్గాలు అంటున్నాయి. ఆ టీపీఎస్ అనుకుంటే ఎంతటి అక్రమ కట్టడానికైనా అనుమతులు ఇవ్వడంలో సమర్థుడు. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలకు ప్లాన్‌లు ఇవ్వడం, 14 శాతం ఫీజు ఎగవేత కు కావలసిన మార్గాలు అన్వేషించి భవన యజమానులకు సలహాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి.
ఈ టీపీఎస్ ఉన్నతాధికారులను తన ఆధీనంలో పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా అధికార పార్టీలో మేయర్ షాడోగా వ్యవహరిస్తున్న కార్పొరేటర్‌కు అనుచరుడిగా ఉంటున్నారు. ఆ కార్పొరేటర్ చెప్పిన విధంగా నడుచుకుంటూ టౌన్‌ప్లానింగ్ విభాగంలో చక్రం తిప్పుతున్నారు.
మధ్యవర్తులుగా ఎల్‌బీఎస్‌లు
అక్రమ భవన యజమానులకు, అధికారులకు మధ్య ఎల్‌బీఎస్(లెసైన్స్ బిల్డింగ్ సర్వేయర్లు)లు ఉన్నారు. బిల్డింగ్‌ప్లాన్‌లను ఆన్‌లైన్ పద్ధతిన జరుగుతుండడంతో కొంతమంది ఎల్‌బీఎస్‌లదే హవాగా మారింది. బిల్డింగ్‌ప్లాన్‌లను ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అవినీతి తగ్గుతుందని, టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఇవ్వాల్సిన పని ఉండదని అందరూ అనుకున్నారు. అయితే కథ అడ్డం తిరిగింది. గతంలో కన్నా ఆన్‌లైన్ చేసిన తరువాతే అక్రమాలు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. కొన్ని సాంకేతిక లోపాలను ఉపయోగించుకుని ఆన్‌లైన్‌ను వారి ఆర్థిక ఆదాయం పెంచుకునేందుకు ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలు..
► నగరంలోని మాగుంట లేఅవుట్‌లోని నారాయణ స్కూల్‌కు సమీపంలో ఐదు అంతస్తుల ఓ భవన నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉంది. టౌన్‌ప్లానింగ్ అధికారులకు భారీగా ముడుపులు అందాయని సమాచారం.
► స్టౌన్‌హౌస్‌పేటలోని ఓ కమర్షియల్ భవనాన్ని రెసిడెన్షియల్‌గా చూపి నిర్మాణాలు చేపడుతున్నారు. సన్నటి వీధి కావడంతో నిర్మాణం రోడ్డు పైకి వచ్చింది. అనుమతులు తీసుకున్న విధంగా నిర్మాణం చేపట్టడం లేదు.
► వేదాయపాళెంలోని ఓ రెండు అంతస్తుల భవనానికి సంబంధించి 14 శాతం అంటే.. దాదాపు రూ.4 లక్షలు కట్టాల్సి ఉంది. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఓ అధికారి రూ.2 లక్షలు తీసుకుని భవనానికి అనుమతులిచ్చారని ఆరోపణలున్నాయి.