- ఈ నెల 31లోగా చెల్లిస్తే వర్తింపు
- 21 వరకు వసూళ్లపై స్పెషల్ డ్రైవ్
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తిపన్ను బకాయిలపై పెనాల్టీలు(వడ్డీలు) రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. ఈ నెల 31 లోగా ఆస్తిపన్ను చెల్లించేవారికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రతియేటా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నప్పటికీ.. మార్చి నెలాఖరులో దీనికి సంబంధించిన జీవోను జారీ చేసేది. దాని బదులు త్వరితంగా జీవో జారీ చేస్తే వసూళ్లలో గణనీయ ప్రగతి ఉంటుందని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈ అంశంపై చొరవ తీసుకోవాల్సిందిగా కమిషనర్‌ను కోరింది.
త్వరలోనే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున సంబంధిత జీవోను త్వరితంగా జారీ చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో తాజా జీవో జారీ అయింది. దీని ప్రకారం.. పాత బకాయిల్ని.. ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఆస్తిపన్నును ఏక మొత్తంలో కానీ.. వాయిదాల్లో కానీ మార్చి 31 లోగా చెల్లిస్తే వడ్డీ నుంచి మినహాయింపు ఉంటుంది.
ఇక వసూళ్లపై దృష్టి..
పెనాల్టీలను ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఇక ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించారు. మార్చి 21 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకనుగుణంగా తగిన నియమ నిబంధనలు పొందుపర్చారు. వసూళ్ల కోసం సర్కిల్‌స్థాయిల్లో ప్రత్యేక బృందాలను నియమించారు. బృందాలకు అవసరమైన వాహనాలు సమకూరుస్తున్నారు. ఆస్తిపన్ను చెల్లించని వారి ఆస్తులు జప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ వాహనాలతోపాటు జీహెచ్‌ఎంసీ టిప్పర్లను వినియోగించుకోవచ్చునన్నారు.
సర్కిల్ స్థాయిలో టాప్ 200 బకాయిలున్న వారిపై ప్రత్యేక శ్రద్ధతో వసూళ్లు చేపడతారు. వారిలో రోజుకు పదిమంది నుంచి ఆస్తిపన్ను వసూళ్లు చేయాలి. ఎవరి వద్ద నుంచైనా ఆస్తిపన్ను వసూలు చేయని పక్షంలో ఉన్నతాధికారులకు వివరణ ఇవ్వాలి. వివరణ సంతృప్తికరంగా లేనట్లయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఆస్తిపన్ను వసూళ్ల పర్యవేక్షణ కోసం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ స్థాయిల్లో సీనియర్ అధికారులను నియమించారు.
ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ. 1250 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ. 605 కోట్లు వసూలైనట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.. నెలరోజులే గడువున్నందున స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో మేయర్ పదవి బీసీకిస్తూ ప్రభుత్వం జీవో తేవడాన్ని ప్రస్తావించారు.