- రాజకీయ పార్టీలకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి
- ఎన్నికల నిర్వహణపై సమీక్ష
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ కోరారు. అందుకుగాను స్థానిక పోలింగ్ ఏజెంట్లకు తగిన శిక్షణ నివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి శుక్రవారం జీహెచ్‌ఎంసీలో ఆయా రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలింగ్ శాతాన్ని కనీసం 75 శాతానికి పెంచాలనే లక్ష్యాన్ని సాధించేందుకు మీదే ముఖ్యభూమిక అని వారి నుద్దేశించి అన్నారు. ఈనెల 20న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు ‘నో యువర్ పోలింగ్ స్టేషన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా చివరి క్షణంలో తమ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదన్నారు.
‘నో యువర్ పోలింగ్ స్టేషన్’ ద్వారా
20వ తేదీన (ఆదివారం) జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్‌లెవెల్ అధికారులు అందుబాటులో ఉంటారని, కుటుంబంలోని కనీసం ఒకరు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటర్ల జాబితాలో తమ పేర్లున్నదీ.. క్రమసంఖ్య నిర్ధారించుకోవాలన్నారు. దాంతోపాటు అప్పటిలోగా ఫొటోఓటరు స్లిప్స్(పీవీఎస్) తమ ఇళ్లకు రానట్లయితే పోలింగ్ కేంద్రంలో వాటిని అడిగి తీసుకోవచ్చన్నారు.
అధికార యం త్రాంగమే ఇళ్లకు వెళ్లి పీవీఎస్‌లు అందజేసే పద్థతిని దేశంలోనే తొలిసారిగా ప్రారంభించామన్నారు. తగిన ఆధారాలుంటే కుటుంబసభ్యులందరి పీవీఎస్ లు కుటుంబంలోని ఒకరు తీసుకోవచ్చునని చెప్పారు. అంతే తప్ప ఎవరికి పడితే వారికి పీవీఎస్‌లు ఇవ్వరని చెప్పారు.