- నోటిఫికేషన్ విడుదల చే సిన జీహెచ్‌ఎంసీ కమిషనర్
- 26 వరకు నామినేషన్ల స్వీకరణ
- 28న స్క్రూటినీ..ఉపసంహరణ గడువు 31
సిటీబ్యూరో, న్యూస్‌లైన్: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల గడువు త్వరలో ముగిసిపోనుండటంతో కొత్త సభ్యుల ఎన్నిక కోసం ఎన్నికల షెడ్యూలు జారీ అయింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ శనివారం షెడ్యూలు విడుదల చేశారు. వచ్చేనెల 6వ తేదీన స్టాండింగ్ కమిటీ సభ్యత్వాలకు ఎన్నిక నిర్వహిస్తారు. శనివారం నుంచే నామినేషన్ల స్వీకరణనూ ప్రారంభించారు.
ఈ నెల 26 వరకు (పనిదినాల్లో) స్టాండింగ్ కమిటీ సభ్యత్వానికి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు దాఖలు చేసినవారి జాబితా 27న వెలువరిస్తారు. 28వ తేదీన ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నామినేషన్ల స్క్రూటినీ జరిపి పోటీకి అర్హులైన వారి పేర్లు వెలువరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుంది. బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాను అదే రోజు వెలువరిస్తారు. జూన్ 6వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కార్యాలయంలో పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఆసక్తికరంగా మారనున్న ఎన్నికలు
జీహెచ్‌ఎంసీలో 150 మంది కార్పొరేటర్లుండగా.. పదిమంది కార్పొరేటర్లకు ఒక సభ్యుడు వంతున మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుత స్టాండింగ్ కమిటీ సభ్యుల్లో 8 మంది కాంగ్రెస్ సభ్యులుండగా.. ఏడుగురు మజ్లిస్ సభ్యులున్నారు. ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్య అవగాహనతో రెండు పార్టీల నుంచి సభ్యులు ఎన్నికయ్యారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య విభేదాలతోపాటు.. ఆయా పార్టీల నుంచి పలువురు ఇతర పార్టీల్లోకి ఫిరాయించడంతో ఈసారి స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
మరోవైపు టీడీపీ-బీజేపీ పొత్తు జీహెచ్‌ఎంసీలోనూ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ రెండు పార్టీలు జత క ట్టడంతోపాటు ఇతరులను కూడా తమ దారిలోకి తెచ్చుకుంటే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం వచ్చే డిసెంబర్‌లో ముగియనుండటంతో ఈసారి స్టాండింగ్ కమిటీ సభ్యులకు మరింత డిమాండ్ పెరిగింది.