సాక్షి, ఢిల్లీ: సార్వత్రిక సమరం నేటి(బుధవారం, మార్చి 20) నుంచి ప్రారంభమైంది. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు లెజిస్లేటివ్ కౌన్సెల్ జాయింట్ సెక్రటరీ దివాకర్ సింగ్ పేరుతో బుధవారం ఉదయం ఒక గెజిట్ విడుదలయ్యింది. దీంతో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.
తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో.. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనట్లేనని ఈసీ ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 27. ఆపై 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4వ తేదీన అన్ని దశల ఎన్నికల ఫలితాలతో పాటే విడుదల కానుంది.
తొలి విడత ఎన్నికలు జరగనున్న వాటిలో తమిళనాడులోని 39, రాజస్థాన్‌లోని 12, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలలోని ఐదేసి, బిహార్‌లోని 4, పశ్చిమ బెంగాల్‌లోని 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయల్లో రెండేసి, ఛత్తీస్‌గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కొక్కటి ఉన్నాయి.
తొలి దశ వివరాలు
- నోటిఫికేషన్ తేదీ: మార్చి 20
- నామినేషన్ల గడువు: మార్చి 27
- నామినేషన్ల పరిశీలన: మార్చి 28
- ఉపసంహరణకు ఆఖరు తేదీ: మార్చి 30
- పోలింగ్ తేదీ: ఏప్రిల్ 19
కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 19న మొదలు జూన్ 1 వరకు మొత్తం 44 రోజులపాటు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనుంది. స్వతంత్ర భారతంలో 1951-52లో తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం సాగనున్నవి ఇవే.
Comments
Please login to add a commentAdd a comment