57 సీట్లకు జూన్ 1న పోలింగ్
సగం బీజేపీ సిట్టింగ్ స్థానాలే
లోక్‌సభ ఎన్నికల పోరు చివరి అంకానికి చేరుతోంది. ఇప్పటిదాకా ఆరు విడతల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. మిగతా 57 సీట్లకు ఆఖరిదైన ఏడో విడతలో శనివారం పోలింగ్ జరగనుంది. ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిధిలో 904 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం సీట్లకూ ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశి్చమ బెంగాల్‌లోని మిగిలిన సీట్లలో ఎన్నికల క్రతువు ముగియనుంది. చివరి విడత నియోజకవర్గాలను విశ్లేషిస్తే గత ఫలితాలకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు తెరపైకొచ్చాయి...
చివరి విడతలో పోలింగ్ జరగనున్న 57 స్థానాల్లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీయే చక్రం తిప్పింది. ఈ 57 స్థానాల్లో రెండుసార్లూ 25 సీట్ల చొప్పున కొల్లగొట్టింది. కాంగ్రెస్ 2014లో కేవలం 3, 2019లో 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఓట్లపరంగానూ బీజేపీదే పైచేయి. బీజేపీకి 28 సీట్లలో 40 శాతం ఓట్లు రాగా 12 సీట్లలో 30 నుంచి 40 శాతం దక్కాయి. కాంగ్రెస్‌కు 18 సీట్లలో 10 శాతం ఓట్లు కూడా రాలేదు.
మొత్తమ్మీద ఈ 57 సీట్లలో 24 చోట్ల పలు పారీ్టలు పటిష్టంగా ఉన్నాయి. తృణమూల్, బీజేపీలకు చెరో 8 సీట్లు కంచుకోటలు. మూడింట బిజూ జనతాదళ్, రెండేసి చోట్ల కాంగ్రెస్, అకాలీదళ్, ఒక చోట జేడీ(యూ) పటిష్టంగా ఉన్నాయి. ఈ స్థానాల్లో గత మూడు ఎన్నికల్లోనూ ఆ పారీ్టలే గెలిచాయి. మరో 14 సీట్లలో ప్రత్యర్థులకు బీజేపీ గట్టి సవాలు విసురుతోంది. వాటిలో 2009 నుంచి కనీసం రెండుసార్లు బీజేపీ గెలిచింది. ఆ లెక్కన 22 చోట్ల బీజేపీదే జోరు. కాంగ్రెస్ బలంగా ఉన్న సీట్లు 6 మాత్రమే.
క్లీన్‌స్వీప్‌లన్నీ కమలానివే...
ఏడో విడత పోలింగ్ జరిగే స్థానాల్లో గత ఎన్నికల్లో ఐదు చోట్ల క్లీన్‌స్వీప్‌లు నమోదయ్యాయి. అంటే గెలిచిన, ఓడిన పార్టీ మధ్య ఓట్ల తేడా 35 శాతం పైగా నమోదైంది. వీటిలో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, హమీర్‌పూర్, సిమ్లా, కాంగ్రా, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ ఖాతాలోనే పడటం విశేషం. ప్రధాని మోదీ గత ఎన్నికల్లో వారణాసిలో 45.2 శాతం ఓట్ల మెజారిటీ సాధించారు!
ఆ స్థానాల్లో హోరాహోరీ...
ఏడో విడత స్థానాల్లో గత ఎన్నికల్లో పలు స్థానాల్లో నువ్వానేనా అనేలా టఫ్ ఫైట్ జరిగింది. అవి జలంధర్ (పంజాబ్), బలియా, చందౌలీ (యూపీ), బాలాసోర్ (ఒడిశా), జహానాబాద్ (బిహార్). ఈ స్థానాల్లో గెలుపు మార్జిన్ 2 శాతం లోపే! వీటితో పాటు ఏ పారీ్టకీ స్పష్టమైన మొగ్గు లేని స్వింగ్ సీట్లు 11 ఉన్నాయి. గడచిన మూడు ఎన్నికల్లో వీటిలో ఏ పార్టీ కూడా రెండోసారి గెలవకపోవడం విశేషం. గాజీపూర్, ఘోసి, రాబర్ట్స్‌గంజ్, మీర్జాపూర్ (యూపీ), ఆనంద్‌పూర్ సాహిబ్, ఫరీద్‌కోట్, ఫతేగఢ్ సాహిబ్, పటియాలా (పంజాబ్), బాలాసోర్ (ఒడిశా), జహానాబాద్, కరాకట్ (బిహార్) ఈ స్వింగ్ సీట్ల జాబితాలో ఉన్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment