ఆస్తిపన్ను వసూళ్లకు టార్గెట్
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం చేరుకోవాలంటే రోజుకు రూ.8.31 కోట్లు వంతున వసూలు చేయాలని, దీన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు వసూళ్లపై దృష్టి సారించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సూచించారు. శనివారం స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్‌తో కలిసి ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. గ్రేటర్‌కు ఈ ఏడాది వసూలు కావాల్సిన ఆస్తిపన్నులో 80 శాతం సొమ్ము 20 శాతం మంది డిఫాల్టర్ల నుంచే రావాల్సి ఉందన్నారు. టాప్ 1000 బకాయిదారుల నుంచి రూ. 243 కోట్లు వసూలు కావాల్సి ఉందని వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొండి బకాయిదారులపై అధికారులు, సిబ్బంది దృష్టి సారించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను డిమాండ్ రూ.1779 కోట్లు కాగా, అందులో రూ.1232 కోట్లు వసూలు చేయాలన్నది లక్ష్యగా నిర్ణయించినట్టు చెప్పారు.
ఇప్పటి వరకు రూ.500 కోట్లు మాత్రమే వసూలైందని, సగటున ఇది 41 శాతమన్నారు. జీహెచ్‌ఎంసీలోని సగం సర్కిళ్లు (సర్కిళ్ల నెంబర్లు 3 నుంచి 10, 17) సగటుకన్నా వెనుకబడి ఉన్నాయని, సంబంధిత సర్కిళ్ల అధికారులు కొత్త అసెస్‌మెంట్లపై దృష్టి సారించాలని సూచించారు. వసూళ్లకు 86 రోజుల సమయం మాత్రమే ఉందని, మార్చి నెలాఖరు వరకు గడువుందనుకోకుండా ఫిబ్రవరి 15 వరకే డెడ్‌లైన్‌గా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వసూళ్లపై కొందరు జోనల్ కమిషనర్లు తగిన శ్రద్ధ చూపడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏవైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. సోమవారానికి ఆ వివరాలు అందజేయాలని సిబ్బందికి ఆయన సూచించారు.