navinmittal
-
సీవీ ఆనంద్ నియామకంపై ఐఏఎస్‌ల అసంతృప్తి
సీఎంకు మెమోరాండం ఇవ్వాలని నిర్ణయం హైదరాబాద్: పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను నియమించడంపై ఐఏఎస్‌లు అసంతృప్తితో ఉన్నారు. దీనిపై ఐఏఎస్ అసోసియేషన్ సీఎం కేసీఆర్‌ను కలసి మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించింది. సీఎంతో అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యతను ఐ అండ్ పీఆర్ కమిషనర్ నవీన్‌మిట్టల్‌కు కట్టబెట్టారు. పౌర సరఫరాల శాఖ పరిధిలో అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు పనిచేయాల్సి ఉంటుం ది, జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి ఆనవాయితీ లేకపోవడం, ఐపీఎస్‌ల పరిధిలో ఐఏఎస్‌లు పనిచేయడం సమంజసంగా లేదని, ఎవరి జాబ్ చార్ట్‌లు వారికి ఉన్నాయని అసోసియేషన్ సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలున్నాయి. త్వరలో రవాణాశాఖకు కమిషనర్‌గా ఐపీఎస్‌ని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్‌ల అసోసియేషన్ తమ అభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం తప్పనిసరని భావిస్తోంది. -
‘విధి’ లేక...
కొందరు విధులకు దూరం ఉన్న వారికి శాఖలేవో తెలియదు మరికొందరికి అదనపు భారం దిక్కుతోచని స్థితిలో అధికారులు జీహెచ్ఎంసీలో వింత పరిస్థితి సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో విచిత్రపరిస్థితి నెలకొంది. కొందరు అధికారులకు ఏ విభాగాలూ లేకపోగా... మరికొందరు ‘అదనపు’ భారం మోయాల్సి వస్తోంది. వారు ఖాళీగా కూర్చోడానికి ఇబ్బంది పడుతుంటే... వీరు అన్ని శాఖల పనులూ ఒక్కొక్కరే చేయలేక సతమతమవుతున్నారు. దీనికి పరిష్కారమేమిటో తెలియక ఇరువర్గాల వారూ తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే... ప్రభుత్వం ఈ నెల రెండోవారంలో ఐదుగురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఇద్దరిని స్పెషల్ కమిషనర్లుగా... ముగ్గురిని అడిషనల్ కమిషనర్లుగా నియమిస్తూ బదిలీ చేసింది. ఇద్దరు స్పెషల్ కమిషనర్లలో నవీన్‌మిట్టల్ మాత్రం విధుల్లో చేరారు. వీరబ్రహ్మయ్య చేరలేదు. ముగ్గురు అడిషనల్ కమిషనర్లలో డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాత్రమే చేరారు. మిగతా ఇద్దరు జి.కిషన్, దాసరి హరిచందనలు విధుల్లో చేరలేదు. వీరిలో వీరబ్రహ్మయ్య నెలరోజుల సెలవులో ఉన్నారు. ఆ తర్వాతైనా చేరతారా? లేక సెలవు పొడిగిస్తారా? అన్నది తెలియడం లేదు. మిగిలిన ఇద్దరు అడిషనల్ కమిషనర్లు సైతం సెలవులో ఉన్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో విధుల్లో చేరని వీరి సంగతలా ఉండగా... విధుల్లో చేరిన స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్, అడిషనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌కు ఇంతవరకు ఏ విభాగాలూ అప్పగించలేదని సమాచారం. మరో ఇద్దరు అడిషనల్ కమిషనర్లు శంకరయ్య, అన్నపూర్ణలకూ విభాగాలు లేవు. గతంలో క్రీడా విభాగాన్ని అన్నపూర్ణ పర్యవేక్షించగా... ఇటీవల దానిని కోఆర్డినేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్న మరో అదనపు కమిషనర్ వెంకట్రామిరెడ్డికి అప్పగించారు. సుమారు మూడు నెలల క్రితం బదిలీపై వచ్చిన శంకరయ్యకూ ఏ విభాగాన్నీ కేటాయించలేదు. ఇక మూడు జోన్లకు జోనల్ కమిషనర్లు లేరు. కీలకమైన వెస్ట్‌జోన్‌కు కమిషనర్ లేకపోవడంతో ఈస్ట్‌జోన్ కమిషనర్ రఘుప్రసాద్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. వీఐపీలతో పాటు రాజకీయ నేతలు, ఐఏఎస్‌ల తాకిడి ఎక్కువగా ఉండే సెంట్రల్‌జోన్‌కు రెగ్యులర్ కమిషనర్ లేరు. జీహెచ్ఎంసీలో పనిఒత్తిడి ఎక్కువగా ఉండే ఆరోగ్యం-పారిశుద్ధ్యం, రవాణా విభాగాలు చూస్తున్న రవికిర ణ్‌కు సెంట్రల్ జోన్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. కీలక మైన రె వెన్యూ- ప్రకటనలు, ఎన్నికల విభాగాలను పర్యవేక్షిస్తున్న హరికృష్ణకే నార్త్‌జోన్ బాధ్యతలు కట్టబెట్టారు. ఫైనాన్స్, యూసీడీ, ఐటీ శాఖలను జయరాజ్ కెన్నెడీ పర్యవేక్షిస్తున్నారు. ఇలా కీలక విభాగాలను పర్యవేక్షించే వారికి...అదనపు భారం పడుతుంటే... అస్సలు పని లేని వారిది గోళ్లు గిల్లుకోవాల్సిన పరిస్థితి. పెద్దగా పని ఉండని విద్యుత్ విభాగాన్ని మరో అడిషనల్ క మిషనర్ వందన్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీలోని ఇతర విభాగాలతో పోలిస్తే విద్యుత్ శాఖలో పని ఒకింత తక్కువే. ఇక పరిపాలన, న్యాయ శాఖలను అడిషనల్ కమిషనర్ రామకృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు. గ తంలో ఇక్కడున్న ఐఏఎస్‌లు అహ్మద్‌బాబు, ప్రద్యుమ్నలు విభజన కేటాయింపుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. గతంలో వారు పర్యవేక్షించిన శాఖలను ఇంకా ఎవరికీ అప్పగించలేదు. ఆస్తిపన్ను వసూలుకూ... మరోవైపు, అందరికీ ఆస్తిపన్ను వసూళ్ల సూపర్వైజర్లుగా అదనపు బాధ్యతలున్నాయి. ప్రతిరోజూ వాటి నివేదికలు అందజేయడంతోపాటు అడపాదడపా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లతో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులెలా ముందుకు సాగుతాయో... ప్రజల ఫిర్యాదులెలా పరిష్కారమవుతాయో... కమిషనర్ ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
కొల్లేరు సమస్యలు పరిష్కరిస్తాం
ఎంపీ మాగంటి కైకలూరు, న్యూస్‌లైన్ : కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) అన్నారు. పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయిన తర్వాత గురువారం ఆయన మొదటిసారిగా కైకలూరు వచ్చారు. స్థానిక రైల్యేస్టేషన్ నుంచి భారీ ర్యాలీగా ఆయనను కార్యకర్తలు ఊరేగింపుగా తీసుకొచ్చారు. తర్వాత ఆటపాకలోని ఆయన నివాసంలో కార్యకర్తలను కలుసుకున్నారు. తన విజయానికి సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో మోడి, సీమాంధ్రాలో చంద్రబాబు పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి రానున్న రోజుల్లో ప్రణాళిక రుపొందిస్తామన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలోని కైకలూరు, మండవల్లి మండలాల్లో కొల్లేరు ఆపరేషన్ సమయంలో అధనంగా ధ్వంసం చేసిన 7500 ఎకరాల చేపల చెరువుల భూములను తిరిగి పేదలకు పంపిణీ చేసే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో పనిచేసిన అప్పటి కలెక్టర్ నవీన్‌మిట్టల్‌తో సంప్రదించి పరిష్కార మార్గాలను అన్వేషించే ఆలోచన ఉందన్నారు. అదే విధంగా కొల్లేరు అభయారణ్యాన్ని కాంటూరు 5 నుంచి 3వరకు కుదించే అంశాన్ని కేంద్రానికి విన్నవిస్తామన్నారు. కొల్లేరు ప్రాంతంలో రహదారులు, తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. పోలవరం అర్డినెన్స్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నల్లదనం వెలికితీతపై ప్రధాని మోడి సాహసోపేత నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఈడ్పుగంటి వెంకట్రామయ్య, చలమలశెట్టి రామానుజయ్య, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి జెడ్పీటీసీలు బొమ్మనబోయిన విజయలక్ష్మీ, నున్న రమాదేవి, రాష్ట్ర పార్టీ ఎస్సీసెల్ కార్యదర్శి మత్తె సూర్యచంద్రరావు, బూపతి నాగకల్యాణి, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు త్రినాథరాజు, విజయబాబు, శ్రీనివాసచౌదరి, విఠల్, పార్టీ నాయకులు కెవిఎన్‌ఎం.నాయుడు, దోనెపూడి రంగారావు, కమతం విశ్వాసం, ఎంఎ.రహీం, బీజేపీ నాయకులు లావేటి వీరశివాజీ, అమృత కమలాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తిపన్ను వసూళ్లకు టార్గెట్
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం చేరుకోవాలంటే రోజుకు రూ.8.31 కోట్లు వంతున వసూలు చేయాలని, దీన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు వసూళ్లపై దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సూచించారు. శనివారం స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్‌తో కలిసి ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. గ్రేటర్‌కు ఈ ఏడాది వసూలు కావాల్సిన ఆస్తిపన్నులో 80 శాతం సొమ్ము 20 శాతం మంది డిఫాల్టర్ల నుంచే రావాల్సి ఉందన్నారు. టాప్ 1000 బకాయిదారుల నుంచి రూ. 243 కోట్లు వసూలు కావాల్సి ఉందని వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొండి బకాయిదారులపై అధికారులు, సిబ్బంది దృష్టి సారించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను డిమాండ్ రూ.1779 కోట్లు కాగా, అందులో రూ.1232 కోట్లు వసూలు చేయాలన్నది లక్ష్యగా నిర్ణయించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు రూ.500 కోట్లు మాత్రమే వసూలైందని, సగటున ఇది 41 శాతమన్నారు. జీహెచ్ఎంసీలోని సగం సర్కిళ్లు (సర్కిళ్ల నెంబర్లు 3 నుంచి 10, 17) సగటుకన్నా వెనుకబడి ఉన్నాయని, సంబంధిత సర్కిళ్ల అధికారులు కొత్త అసెస్మెంట్లపై దృష్టి సారించాలని సూచించారు. వసూళ్లకు 86 రోజుల సమయం మాత్రమే ఉందని, మార్చి నెలాఖరు వరకు గడువుందనుకోకుండా ఫిబ్రవరి 15 వరకే డెడ్‌లైన్‌గా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వసూళ్లపై కొందరు జోనల్ కమిషనర్లు తగిన శ్రద్ధ చూపడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏవైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. సోమవారానికి ఆ వివరాలు అందజేయాలని సిబ్బందికి ఆయన సూచించారు.