కొల్లేరు సమస్యలు పరిష్కరిస్తాం
ఎంపీ మాగంటి
కైకలూరు, న్యూస్‌లైన్ : కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) అన్నారు. పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయిన తర్వాత గురువారం ఆయన మొదటిసారిగా కైకలూరు వచ్చారు. స్థానిక రైల్యేస్టేషన్ నుంచి భారీ ర్యాలీగా ఆయనను కార్యకర్తలు ఊరేగింపుగా తీసుకొచ్చారు. తర్వాత ఆటపాకలోని ఆయన నివాసంలో కార్యకర్తలను కలుసుకున్నారు. తన విజయానికి సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో మోడి, సీమాంధ్రాలో చంద్రబాబు పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి రానున్న రోజుల్లో ప్రణాళిక రుపొందిస్తామన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలోని కైకలూరు, మండవల్లి మండలాల్లో కొల్లేరు ఆపరేషన్ సమయంలో అధనంగా ధ్వంసం చేసిన 7500 ఎకరాల చేపల చెరువుల భూములను తిరిగి పేదలకు పంపిణీ చేసే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామన్నారు.
కొల్లేరు ఆపరేషన్ సమయంలో పనిచేసిన అప్పటి కలెక్టర్ నవీన్‌మిట్టల్‌తో సంప్రదించి పరిష్కార మార్గాలను అన్వేషించే ఆలోచన ఉందన్నారు. అదే విధంగా కొల్లేరు అభయారణ్యాన్ని కాంటూరు 5 నుంచి 3వరకు కుదించే అంశాన్ని కేంద్రానికి విన్నవిస్తామన్నారు. కొల్లేరు ప్రాంతంలో రహదారులు, తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. పోలవరం అర్డినెన్స్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
నల్లదనం వెలికితీతపై ప్రధాని మోడి సాహసోపేత నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఈడ్పుగంటి వెంకట్రామయ్య, చలమలశెట్టి రామానుజయ్య, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి జెడ్పీటీసీలు బొమ్మనబోయిన విజయలక్ష్మీ, నున్న రమాదేవి, రాష్ట్ర పార్టీ ఎస్సీసెల్ కార్యదర్శి మత్తె సూర్యచంద్రరావు, బూపతి నాగకల్యాణి, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు త్రినాథరాజు, విజయబాబు, శ్రీనివాసచౌదరి, విఠల్, పార్టీ నాయకులు కెవిఎన్‌ఎం.నాయుడు, దోనెపూడి రంగారావు, కమతం విశ్వాసం, ఎంఎ.రహీం, బీజేపీ నాయకులు లావేటి వీరశివాజీ, అమృత కమలాకరరావు తదితరులు పాల్గొన్నారు.