![Kolleru is only wetland area in Telugu states](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/chittadi.jpg.webp?itok=XKQZ4AsI)
తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు
కైకలూరు: ఉపరితలంపై ఏడాది పొడవునా ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండే భూములను చిత్తడి నేలలు అంటారు. ఇవి జీవరాశుల మనుగడకు అనువైనవి. ఇరాన్‌లోని రామ్‌సర్ నగరంలో 1971 ఫిబ్రవరి 2న నిర్వహించిన అంతర్జాతీయ చిత్తడి నేలల సదస్సులో ప్రపంచవ్యాప్తంగా వీటి ఆవశ్యతను గుర్తించారు.
దేశవ్యాప్తంగా 23 రాష్ట్రల్లో 85 రామ్‌సర్ సైట్లలో 13,688.0903 హెక్టర్లలో చిత్తడి నేలలు ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 3,719.08 హెక్టర్లలో విస్తరించి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే చిత్తడి నేలలగా రామ్‌సర్ గుర్తించిన ఏకైక కొల్లేరు సరస్సు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వ్యాపించి ఉంది.
కొల్లేరు నిలయం
కొల్లేరు ప్రాంతంలో 2,22,689 ఎకరాల విస్తీర్ణాన్ని 2002 ఆగస్టు 19న రామ్‌సర్ సైట్‌గా గుర్తించారు. చిత్తడి నేలల నిలయమైన కొల్లేరుకు ఆస్ట్రేలియా, నైజీరియా, ఈజిప్టు, ఇండోనేషియా వంటి దేశాల నుంచి వలస పక్షులు విడిదికి వస్తున్నాయి. ప్రపంచ పెలికాన్ పక్షుల్లో 40 శాతం శీతాకాలంలో కొల్లేరుకు రావడానికి చిత్తడి నేలలే కారణం. కొల్లేరులో దాదాపు 182 రకాల పక్షులు సంచరిస్తున్నాయి.
కృష్ణా, గోదావరి, తుంగభద్ర, కావేరి, హిమాలయాలు వంటి ప్రాంతాల్లో సరస్సులు, మడ అడవులు, పరీవాహక ప్రాంతాలు చిత్తడి నేలల కోవలోకి వస్తాయి. ఈ ఏడాది ‘భవిష్యత్తు కోసం చిత్తడి నేలలను రక్షించడం’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు చేపడు తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 56.25 హెక్టార్లు పైగా విస్తీర్ణంలో 1,943 చిత్తడి నేలలు 3,719.08 చరుపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి.
ప్రమాదంలో చిత్తడి నేలలు
ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్–పాలసీ ప్లాట్‌ఫాం ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకో సిస్టమ్ సర్వీసెస్ (ఐపీబీఈఎస్) గ్లోబల్ అంచనా ప్రకారం చిత్తడి నేలలు అడువుల కంటే మూడు రెట్లు వేగంగా కనుమరుగవుతున్నాయి. చిత్తడి నేలలు భూ ఉపరితలంపై 6 శాతం మాత్రమే ఉన్నా మొత్తం వృక్ష, జంతు జాతులలో 40 శాతం చిత్తడి నేలల్లోనే నివసిస్తున్నాయి.
అడవుల నరికివేత, రసాయనాల వాడకం, ఆక్రమణలు వల్ల చిత్తడి నేలలు సహజత్వాన్ని కోల్పోతున్నాయి. కొల్లేరు సరస్సులో ఆక్రమణలను మూడు నెలల్లో తొలగించాలని సుప్రీంకోర్టు రాష్ట్రం ప్రభుత్వానికి ఆదేశించడానికి కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం కావడమే ప్రధాన కారణం.
చిత్తడి నేలలు.. ఉపయోగాలు
» వరదలను నియంత్రిస్తాయి.
» ఫిల్టర్ మాదిరిగా నీటిని శుద్ధి చేస్తాయి. అందుకే వీటిని ప్రకృతి మూత్ర పిండాలుగా వర్ణిస్తారు.
»మట్టిలోని ఉత్పాదక సారాన్ని పెంచుతాయి.
»సున్నితమైన ప్రకృతి వనరులతో పాటు, జీవరాశులన్నింటికీ అనువైన వాతావరణం.
» ఔషధ గుణాలున్న మొక్కల పెరుగుదలకు తోడ్పడతాయి.
» రసాయనిక, జెనెటిక్ పదార్థాలను ఇముడ్చుకుని, తిరిగి నేలను మార్పు చేస్తాయి.
» అత్యధిక జీవరాసులకు ప్రధాన ఆవాస కేంద్రంగా ఉంటాయి.
» ఎక్కువ కాలం నీటి నిల్వకు, భూమి లోపలి నీటి శాతాన్ని పెంచేందుకు దోహదపడతాయి.
» సున్నితమైన ప్రకృతి వనరులకు, పక్షులకు నిలయాలుగా ఉన్నాయి.
» చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత అని రామ్‌సర్ సదస్సు పిలుపునిచ్చింది.
పరిరక్షణ అందరి బాధ్యత
చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరును పరిరక్షించుకోవడం అందరి బాధ్యత. కొల్లేరు ప్రాంతానికి ఈ ఏడాది ఎక్కువగా వలస పక్షులు వచ్చాయి. –బి.విజయ, జిల్లా అటవీశాఖ అధికారి, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment