Wetlands
-
చిత్తడినేలలు.. జీవవైవిధ్య నిధులు
సాక్షి, అమరావతి: విలువైన చిత్తడినేలలు జీవవైవిధ్యానికి అత్యంత అవసరం. జీవవైవిధ్య సంరక్షణలో చిత్తడి నేలలది ముఖ్యపాత్ర. అందుకే వాటిని అనేక ప్రత్యేకతలున్న జీవావరణ వ్యవస్థలుగా పరిగణిస్తారు. గురువారం ప్రపంచ చిత్తడినేలల దినోత్సవం కావడంతో వాటి ఆవశ్యకత, సంరక్షణపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సంవత్సర కాలంలో పూర్తిగాగానీ, చాలా భాగంగానీ నీటితో కప్పి ఉండే ప్రాంతాలను చిత్తడినేలలుగా పిలుస్తారు. మన రాష్ట్రంలో వివిధ రకాల చిత్తడినేలలున్నాయి. మంచినీటితో ఏర్పడిన కొల్లేటి సరస్సు, సముద్రపు నీటితో ఏర్పడిన పులికాట్ సరస్సు వాటిలో ముఖ్యమైనవి. మంచినీరు, ఉప్పునీరు కలవడం వల్ల ఏర్పడే ప్రత్యేక జీవావరణ వ్యవస్థలైన కాకినాడ సముద్రతీరంలోని కోరింగ మడ అడవులు, కృష్ణాతీరంలో కృష్ణ మడ అడవులు ప్రధానమైనవి. నేలపట్టు, సోమశిల బ్యాక్‌వాటర్‌లోని నరసింహ అభయారణ్యాలు కూడా చిత్తడినేలలే. మడ అడవులు పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో, వాతావరణంలోని కర్బన పదార్థాలను గ్రహించి జీవపదార్థాలుగా మార్చడంలో, వాటిని నిల్వ ఉంచడంలో విలువైనపాత్ర పోషిస్తాయి. ఇవి మామూలు చెట్ల కంటే కనీసం 4, 5 రెట్లు ఎక్కువ కర్బన పదార్థాలను గ్రహించి నిల్వచేస్తాయి. అనేక రకాల చేపలు, సముద్ర జీవులకు మడ అడవులు పునరుత్పత్తి ప్రదేశాలు. ఎంతో విలువైన పులసజాతి చేపలు, మాగా, బుడతమాగా చేపలకు మడ అడవులు చాలా అవసరం. కలుషితమవుతున్న చిత్తడినేలలు ప్రతి సంవత్సరం శీతాకాలంలో సైబీరియా తదితర ప్రాంతాల నుంచి కొల్లేరు, పులికాట్, నేలపట్టు వంటి చిత్తడినేలల వద్దకు అనేకరకాల పక్షులు వచ్చి జీవిస్తాయి. తిరిగి వేసవికాలంలో వాటి ప్రాంతాలకు తిరిగి వెళతాయి. అనేకరకాల నత్తలు, రొయ్యల జాతులు, క్రిమికీటకాలు ఈ చిత్తడి నేలల్లో జీవిస్తూ జీవవైవిధ్య సంపదని పరిపుష్టం చేస్తున్నాయి. వరదలను నివారించడం, వ్యవసాయ భూములను సంరక్షించడం, లక్షలాదిమంది తీరప్రాంత ప్రజల జీవనోపాధికి ఈ నేలలు ఉపయోగపడుతున్నాయి. కానీ ఆక్రమణలు, చేపలు, రొయ్యల అక్రమ చెరువులు, అశాస్త్రీయ సాగుపద్ధతులు, పురుగుమందుల వినియోగం, పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల వల్ల చిత్తడినేలలు కలుషితమవుతున్నాయి. కొన్నిచోట్ల క్రమంగా అంతరించి పోతున్నాయి. దీనివల్ల అక్కడి జీవవైవిధ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ప్రత్యేక జీవావరణ వ్యవస్థలు సమతుల్యతను కోల్పోతుండడంతో అనేక జీవజాతులు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తడినేలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు విలువైన చిత్తడినేలల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ చిత్తడినేలల దినోత్సవాన్ని అటవీశాఖ ఆధ్వర్యంలో పలుచోట్ల నిర్వహించి వాటి ఆవశ్యకత, ప్రభావం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిత్తడినేలలను గుర్తించి వాటిని పరిరక్షించే కార్యక్రమం జరుగుతోంది. – డాక్టర్ శాంతిప్రియ పాండే, ఏపీసీసీఎఫ్ (వన్యప్రాణుల విభాగం), ఏపీ అటవీశాఖ జీవవైవిధ్య సంరక్షణకు వ్యవస్థాపరమైన ఏర్పాట్లు చిత్తడినేలలను సంరక్షించడానికి ప్రభుత్వం ఈ ప్రాంతాలను అభయారణ్యాలుగా ప్రకటించి రక్షణ చర్యలు తీసుకుంటోంది. జీవవైవిధ్య సంరక్షణ చట్టం ప్రకారం ఏపీ జీవవైవిధ్య సంస్థ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో జీవవైవిధ్య సంరక్షణకు అవసరమైన వ్యవస్థాపరమైన ఏర్పాట్లు చేసింది. చిత్తడినేలలున్న ప్రాంతాలన్నింటిలో జీవవైవిధ్య యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వాములుగా చేసింది. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిది. – డి.నళినీమోహన్, అటవీశాఖ పూర్వ పీసీసీఎఫ్, బయో డైవర్సిటీ బోర్డు రిటైర్డ్ సభ్య కార్యదర్శి -
చిత్తడి నేలల సమాచారానికి కమిటీ
సాక్షి, అమరావతి: చిత్తడి నేలల గురించి నిర్దిష్టమైన సమాచారం రూపొందించేందుకు రెవెన్యూ, వ్యవసాయ, అటవీశాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో కూడిన వెట్ ల్యాండ్ బోర్డ్ తొలి సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండునెలల్లో ఈ కమిటీ ప్రాథమిక నివేదికను వెట్ ల్యాండ్ బోర్డుకు సమర్పిస్తుందని తెలిపారు. ప్రజల జీవనోపాధికి విఘాతం లేకుండా అలాగే చిత్తడి నేలల్లో జీవజాలం మనుగడకు ముప్పులేకుండా వెట్ ల్యాండ్ బోర్డ్ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని 30 వేల ఎకరాల్లో చిత్తడి నేలలు ఉన్నట్లు గుర్తించిందన్నారు. వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ నేలల్లో కొంతమేర ఆక్రమణలు జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. కొల్లేరు ప్రాంతంలో 5 నుంచి 2వ కాంటూరు వరకు చేపల చెరువులు విస్తరించాయన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సీజనల్‌గా వ్యవసాయం, ఇతర పంటలు సాగుచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని చిత్తడి నేలల్లో జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ అనేక రకాల జంతువులు, పక్షులు, జీవజాలం మనుగడ సాగిస్తున్నాయని చెప్పారు. కొల్లేరు, నేలపట్టు, పులికాట్, కోరింగ, శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో చిత్తడి నేలలున్నట్లు తెలిపారు. అరుదైన విదేశీపక్షులు వేల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి వచ్చి కొల్లేరు, పులికాట్ ప్రాంతాల్లోని చిత్తడి నేలల్లో సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయని చెప్పారు. చిత్తడి నేలల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేసిందని, వాటి ఆధారంగా రాష్ట్రంలోను వెట్ ల్యాండ్ బోర్డు ఏర్పాటైందని తెలిపారు. అటవీ అధికారులు చిత్తడి నేలల సంరక్షణపై ప్రత్యేకదృష్టి సారించాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ప్రసాద్, అటవీదళాల అధిపతి మధుసూదన్‌రెడ్డి, అటవీ శాఖ ఉన్నతాధి కారులు ఎ.కె.ఝా, శాంతిపాండే తదితరులు పాల్గొన్నారు. -
గ్రాసం లేక గ్రామం విడిచి.. బతుకు జీవుడా..!
పల్నాట దుర్భిక్షం నీరింకిన కుంటలు, చెరువులు మచ్చుకైనా కనిపించని పచ్చిక బయళ్లు మేత, నీరు కోసం వెంపర్లాడుతున్న జీవాలు వలసబాట పడుతున్న పోషకులు కారంపూడి/గురజాల రూరల్: పల్నాడు ప్రాంతం.. జరీబు భూములు లేకున్నా జీవాలకు బాగా మేత దొరుకుతుందని పేరు. ఇతర జిల్లాల నుంచే కాదు, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా మేకలు, గొర్రెలకాపరులు మేత కోసం వాటిని ఇక్కడికి తోలుకొచ్చేవారు. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు మాగాణులు కూడా బీళ్లుగా మారాయి. పచ్చిక బయళ్లు మచ్చుకైనా కనిపించడం లేదు. కుంటలు, చెరువుల్లో నీరింకి పోయింది. మేతకు, తాగునీటికి కరువొచ్చింది. పల్నాడుకు దక్షిణ సరిహద్దులో 42 కిలోమీటర్ల దూరం వ్యాపించి వున్న నల్లమల అడవిలో సైతం మేత దొరకని పరిస్థితి దాపురించింది. దీంతో జీవాల పోషణ కష్టమైంది. గత్యంతరం లేక జీవాల పోషకులు వలసబాట పడుతున్నారు. పల్నాడు నుంచి జీవాలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. పల్నాడు టు ప్రకాశం.. పల్నాడు ప్రాంతంలో మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు సుమారు 2.5 లక్షల దాకా వున్నాయి. రెండు రోజులుగా నాలుగు వేల జీవాలతో కాపరులు వలసవెళ్తున్నారు. మిగిలిన వారు కూడా వీరి బాటలోనే పయనించే ఆలోచనలో వున్నారు. ఎక్కువగా ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నారు. అక్కడ పంట కాల్వలకు నీరు రాక గడ్డి మొలిచిందని, కొద్దిపాటి వర్షాలకు మాగాణి భూముల్లో పచ్చిక పట్టిందని తెలుసుకుని, ఆ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలి పోతున్నారు. ఎగువ పల్నాడు(మాచర్ల, విజయపురిసౌత్, రెంటచింతల) నుంచి మేత కోసం అన్వేషించుకుంటూ కారంపూడి ప్రాంతానికి వచ్చిన కాపరులు ఇక్కడ కూడా మేత లేకపోవడంతో ఇక్కడ నుంచి లారీలలో ప్రకాశం జిల్లా కారంచేడుకు తరలిపోతున్నారు. సాధారణంగా జీవాలను ఎంత దూరమైనా నడిపించుకుంటూనే వెళ్తారు. కానీ మార్గంలో సరైన మేత లేక జీవాలు నడవలేక పోతుండటంతో లారీలలో తరలించాల్సి వస్తోందని జీవాల యజమానులు చెబుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే రానున్న వేసవి ఇంకెలా వుంటుందోననే ఆందోళన చెందుతున్నారు. జీవాలకు కొత్త జబ్బులు.. గురజాల రూరల్ మండలం గొట్టిముక్కల గ్రామంలో ఉన్న మూడు కుంటల్లోనూ నీరు ఇంకిపోయింది. అడవిలోని పచ్చికబయళ్లు ఎండిపోయాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతలకు జీవాలకు కొత్తజబ్బులు సోకుతున్నాయ. ఇక చేసేది లేక గ్రామం వదిలి జీవాలతో వలసపోతున్నారు పోషకులు. రెండు రోజుల్లో దాదాపు 60 కుటుంబాలు 8000 జీవాలను లారీలకు ఎక్కించుకొని తరలివెళ్లారు. పిల్లల చదువులను కూడా మధ్యలోనే ఆపేసి, వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, గొర్రెల, మేకల పెంపకందారులు కంటతడిపెడుతున్నారు.