పల్నాట దుర్భిక్షం
నీరింకిన కుంటలు, చెరువులు
మచ్చుకైనా కనిపించని పచ్చిక బయళ్లు
మేత, నీరు కోసం వెంపర్లాడుతున్న జీవాలు
వలసబాట పడుతున్న పోషకులు
కారంపూడి/గురజాల రూరల్: పల్నాడు ప్రాంతం.. జరీబు భూములు లేకున్నా జీవాలకు బాగా మేత దొరుకుతుందని పేరు. ఇతర జిల్లాల నుంచే కాదు, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా మేకలు, గొర్రెలకాపరులు మేత కోసం వాటిని ఇక్కడికి తోలుకొచ్చేవారు. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు మాగాణులు కూడా బీళ్లుగా మారాయి. పచ్చిక బయళ్లు మచ్చుకైనా కనిపించడం లేదు. కుంటలు, చెరువుల్లో నీరింకి పోయింది. మేతకు, తాగునీటికి కరువొచ్చింది. పల్నాడుకు దక్షిణ సరిహద్దులో 42 కిలోమీటర్ల దూరం వ్యాపించి వున్న నల్లమల అడవిలో సైతం మేత దొరకని పరిస్థితి దాపురించింది. దీంతో జీవాల పోషణ కష్టమైంది. గత్యంతరం లేక జీవాల పోషకులు వలసబాట పడుతున్నారు. పల్నాడు నుంచి జీవాలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.
పల్నాడు టు ప్రకాశం..
పల్నాడు ప్రాంతంలో మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు సుమారు 2.5 లక్షల దాకా వున్నాయి. రెండు రోజులుగా నాలుగు వేల జీవాలతో కాపరులు వలసవెళ్తున్నారు. మిగిలిన వారు కూడా వీరి బాటలోనే పయనించే ఆలోచనలో వున్నారు. ఎక్కువగా ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నారు. అక్కడ పంట కాల్వలకు నీరు రాక గడ్డి మొలిచిందని, కొద్దిపాటి వర్షాలకు మాగాణి భూముల్లో పచ్చిక పట్టిందని తెలుసుకుని, ఆ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలి పోతున్నారు. ఎగువ పల్నాడు(మాచర్ల, విజయపురిసౌత్, రెంటచింతల) నుంచి మేత కోసం అన్వేషించుకుంటూ కారంపూడి ప్రాంతానికి వచ్చిన కాపరులు ఇక్కడ కూడా మేత లేకపోవడంతో ఇక్కడ నుంచి లారీలలో ప్రకాశం జిల్లా కారంచేడుకు తరలిపోతున్నారు. సాధారణంగా జీవాలను ఎంత దూరమైనా నడిపించుకుంటూనే వెళ్తారు. కానీ మార్గంలో సరైన మేత లేక జీవాలు నడవలేక పోతుండటంతో లారీలలో తరలించాల్సి వస్తోందని జీవాల యజమానులు చెబుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే రానున్న వేసవి ఇంకెలా వుంటుందోననే ఆందోళన చెందుతున్నారు.
జీవాలకు కొత్త జబ్బులు..
గురజాల రూరల్ మండలం గొట్టిముక్కల గ్రామంలో ఉన్న మూడు కుంటల్లోనూ నీరు ఇంకిపోయింది. అడవిలోని పచ్చికబయళ్లు ఎండిపోయాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతలకు జీవాలకు కొత్తజబ్బులు సోకుతున్నాయ. ఇక చేసేది లేక గ్రామం వదిలి జీవాలతో వలసపోతున్నారు పోషకులు. రెండు రోజుల్లో దాదాపు 60 కుటుంబాలు 8000 జీవాలను లారీలకు ఎక్కించుకొని తరలివెళ్లారు. పిల్లల చదువులను కూడా మధ్యలోనే ఆపేసి, వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, గొర్రెల, మేకల పెంపకందారులు కంటతడిపెడుతున్నారు.
గ్రాసం లేక గ్రామం విడిచి.. బతుకు జీవుడా..!
Published Tue, Nov 17 2015 12:24 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement